
శ్రీకాకుళం జిల్లా: మండలంలోని గోపీనగర్‌లో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎన్.స్వప్న (45) గుండెపోటుతో గురువారం మృతి చెందారు. పని ఒత్తిడితోనే ఆమె చనిపోయారని సహోద్యోగులు చర్చించుకుంటున్నారు. బుధవారం విధులకు హాజరైన ఆమెకు అదే రోజు రాత్రి తీవ్ర గుండె నొప్పి రావడంతో రాజాంలో ఉన్న తన కుటుంబ సభ్యులు శ్రీకాకుళం మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తుదిశ్వాస విడిచారు.
స్వప్నకు భర్త నాగరాజు, కుమార్తె హనీ ఉన్నారు. భర్త నాగరాజు శ్రీకాకుళం ఎస్‌బీఐ ఏడీబీలో మేనేజర్‌గా విధులు నిర్వహిస్తుండగా కుమార్తె ఇంటర్ చదువుతోంది. ఉపాధ్యాయురాలు 2023లో ఆమదాలవలస మండలానికి బదిలీపై వచ్చారు. అప్పటి నుంచి ఆ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు ఉండేవారు. ఇటీవల జరిగిన బదిలీల్లో ఒకరు వెళ్లిపోగా ఈమె ఒక్కరే పాఠశాలలో ఉన్నారు. పని ఒత్తిడి, యాప్‌లలో నిత్యం అప్‌లోడ్ చేయాల్సిన అంశాలు తదితర విషయాల్లో ఆమె ఒత్తిడికి గురైనట్లు తోటి ఉపాధ్యాయులు చర్చించుకుంటున్నారు.