తాడేపల్లి: అమరావతిపై ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు పదేపదే చెప్పిన అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధాని అంశంపై తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు.
‘వికేంద్రీకరణను మూడు ముక్కలాట అని ఎగతాళి చేశారు. ఇన్నాళ్లు అమరావతికి చట్టబద్ధత లేదా? ఇప్పటికే రాష్ట్రంపై చంద్రబాబు మోయలేని భారం మోపారు. అమరావతిని పూనకం వచ్చినట్లు రీస్టార్ట్ చేశారు. రాజధానిని పేకముక్కలతో పోల్చి వెటకారాలాడారు.
ప్రజలపై భారంలేని గ్రోత్ ఇంజిన్ కావాలన్నది జగన్ ప్రతిపాదన. రాజధాని గురించి తొలుత ఆలోచన చేసినప్పుడు ప్రభుత్వ భూమి 30వేల ఎకరాలు ఉండాలన్నారు. సామాన్యులకు, మధ్యతరగతి ప్రజలకు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చేవారికి అందుబాటులో ఉండాలన్నది అప్పుడు ఆయన ఆలోచన.
దీనికోసం చేసే ప్రయత్నం ప్రభుత్వం మీద బరువు కాకూడదన్నది జగన్ ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకునే 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నచోట రాజధాని పెట్టమన్నారు. చంద్రబాబు 2019లో దిగిపోయే నాటికి రాజధాని ప్రాంతంలో దారుణమైన దోపిడీ, అవినీతి జరిగింది.
ప్రజల సొమ్మును రాజధాని పేరుమీద లాగేస్తున్నారు
మా ప్రభుత్వంలో ఆ వ్యవహారాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఏ అవకాశం వచ్చినా దోపిడీ చేయడం అన్నది చంద్రబాబుకు అలవాటు. ఎన్ని విధాల పిండుకుని సంపాదించాలో చంద్రబాబుకు తెలుసు. అవసరంలేని, ఎక్కడాలేని రేట్లు పెట్టి, అందమైన పేర్లతో కాంట్రాక్టులు ఇచ్చి, దోపిడీ చేస్తున్నారు. మోటారు పెట్టి నీటిని తోడినట్టు, ప్రజల సొమ్మును రాజధాని పేరుమీద లాగేస్తున్నారు’ అని అన్నారు.
ఏపీలో చంద్రబాబు పట్టించుకోని సిటీలు ఎన్నో ఉన్నాయి. పార్లమెంట్ సాక్షిగా రేణుకా చౌదరి కమ్మరావతి అన్నారు. అమరావతిపై కుల ముద్ర వేయబోయారు. రేణుకాచౌదరి వ్యాఖ్యలను టీడీపీ ఎంపీలు ఎందుకు ఖండించలేదు. రేణుకా చౌదరి అన్న మాటలకు నారా లోకేష్ చప్పట్లు కొట్టారు.
రాజధాని నిర్మాణ ఖర్చు ప్రజల మీద పడకూడదన్నదే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆలోచన. రాజధాని ప్రాంతంలో చంద్రబాబు సొంత ఇల్లు కట్టుకోలేదు. వైఎస్ జగన్ ఇల్లు, పార్టీ కేంద్ర కార్యాలయం ఇక్కడే కట్టుకున్నారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.
దోపిడీ కోసమే
చంద్రబాబు అండ్ కో దోపిడీ కోసమే అమరావతిని వాడుకుంటున్నాని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘మేము అమరావతిపై కులముద్ర వేయలేదు. రూ.2 లక్షల కోట్ల అప్పులతో సాధ్యంకాని అమరావతిపై... సంబరాలు చేయాలని ఇతర ప్రాంతాలకు చెప్పడం అన్యాయం. అమరావతి సంబరాల పిలుపును ప్రజలు తిరస్కరించారు. అధికారులకు, ఉద్యోగులకు ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోలేదు.

మట్టి, నీళ్లు ఇచ్చి నెత్తిమీద చేయిపెట్టారని ప్రధాని మోదీని చంద్రబాబే అన్నారు. అమరావతికి కులం రంగును పులిమింది చంద్రబాబే. అమరావతిలో అవినీతిని మేం ప్రశ్నిస్తున్నాం. నేలమీద నిలబడి ఆలోచించాలని జగన్ సలహా ఇచ్చారు. అది చేయకుండా ఎదురుదాడి చేస్తున్నారు. పార్లమెంటు అధికారాలు, చట్టాల తయారీ మీద చంద్రబాబువి అవగాహనలేని మాటలు. ఇన్నాళ్లు ముఖ్యమంత్రిగా ఆయన ఎలా పనిచేశారో కూడా అర్థం కావడంలేదు’ అని చెప్పారు.
ఈ అప్పు భారాన్ని మోయాలి..
అమరావతి బాండ్లను తన ఘనతగా చంద్రబాబు చెప్పుకోవడం సిగ్గుచేటని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ‘అప్పట్లో 8 శాతం వడ్డీకి రుణాలు వస్తుంటే, చంద్రబాబు 10.3 శాతం వడ్డీకి తెచ్చారు. దీన్ని కూడా ఘనంగా చెప్పుకోవడానికి సిగ్గుచేటు కాదా? అప్పు భరించేది, చెల్లించాల్సింది ప్రజలే. అమరావతి ప్రజలు కూడా ఈ అప్పులు భారాన్ని మోయాలి. అమరావతి ఇప్పట్లో కాదని చంద్రబాబే చెప్తున్నారు. 2043 అని చెప్తున్నారంటే దాని అర్థం అదే. అప్పటి వరకూ అమరావతి పేరుతో దోపిడీ చేయాలన్నది చంద్రబాబు ప్లాన్. తన అవినీతిని అందమైన కథల ద్వారా ప్రజలకు కన్వెన్స్ చేయాలనుకుంటున్నారు.
తన దోపిడీ, అవినీతి కోసమే అమరావతిని చంద్రబాబుగా రాజధానిగా ఎంపిక చేసుకున్నారు. ఎన్ని కాంట్రాక్టులు అయితే, అంత డబ్బు సంపాదించవచ్చన్నది చంద్రబాబు ఆలోచన. చంద్రబాబు అబద్ధాలకు ఆణిముత్యం. చంద్రబాబు చెప్తున్నదానికీ, జగన్ చెప్తున్నదానికీ మధ్య వ్యత్యాసాన్ని, నిజానిజాలపై ప్రజలు ఆలోచన చేయాలి. జగన్ చెప్పిన దాంట్లో వాస్తవికతను కనిపిస్తుంది. చంద్రబాబు ప్రణాళికతో అసలు రాజధాని వస్తుందా?
ఇప్పట్లో కాదని మీరే అంటున్నారు కదా?
ఉద్యోగాలు ఇచ్చే నగరం, సజీవనగరంగా, అప్పుల భారం లేని విధంగా, సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టుగా అమరావతి ఎప్పుడు మారుతుంది? ఈ తరహా నగరం ఇప్పుడు కాదని చంద్రబాబే చెప్తున్నారు. ప్రభుత్వం చేసే అప్పుల ద్వారా రాజధాని కడితే ప్రభుత్వానికి ట్యాక్స్‌లు వస్తాయని అసంబద్ధమైన వాదనలు చేస్తున్నారు. అప్పుల ద్వారా నిర్మాణాలు, పైగా కంపెనీలకు జీఎస్టీ రాయితీలు. రూపాయి ఖర్చు చేసి, 10 పైసలు ఆదాయాన్ని, ఆదాయం అంటారా?
ఆ పది పైసలు కూడా కాంట్రాక్టర్లకు రాయితీలకు పోతుంది. అసలు చంద్రబాబు ఏ ఎకనామిక్స్ చదివాడో అర్థం కావడంలేదు. ఇంతచేసి చంద్రబాబు కట్టేది 7 బిల్డింగులు. అమరావతిలో 99 పైసలకు ఎందుకు భూములు ఇవ్వడంలేదు? అమరావతిలో ప్రభుత్వానికి వచ్చే భూములు ఎప్పుడు అమ్ముతారు? హైదరాబాద్‌లో ఉన్నంత రేటు రావడానికి ఎంత సమయం పడుతుంది? చంద్రబాబువి ప్రజలను మోసం చేసే మాటలే’ అని అన్నారు.


