
అమరావతి నిర్మాణం పేరుతో ఇప్పటికి రూ.52 వేల కోట్ల రుణం
దీంతోపాటు 2025–26 బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం
రాజధానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని గత నెలలో ఆర్థిక సంఘాన్ని కోరిన చంద్రబాబు
కేవలం 53,748 ఎకరాల్లో పనులు చేపట్టడానికే ఈ వ్యయం..
స్మార్ట్ ప్రాజెక్టులు అంటూ మరో 44,676.64 ఎకరాల సమీకరణ దిశగా సర్కారు అడుగులు
అందులో పనులు చేపట్టాలంటే సుమారుగా మరో రూ.80 వేల కోట్లు వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా
నిర్మాణం పూర్తయ్యే సరికి అమరావతి అప్పులు రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లకు చేరతాయని అధికార వర్గాల లెక్కలు
ఆ అప్పుల భారం అంతా రాష్ట్ర ప్రజలు చెల్లించే పన్నులతోనే తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్న ఆర్థిక నిపుణులు, అధికారవర్గాలు
కొండను సైతం అవలీలగా మోస్తానని గొప్పలు చెప్పుకున్న ఓ పెద్ద మనిషి తీరా బల ప్రదర్శన రోజు.. మీరు మోసుకొస్తే చాలు.. నేను మోసేస్తా..! అని జారుకున్నట్లుగా ఉంది సీఎం చంద్రబాబు తీరు! రైతులిచ్చిన భూముల్లో అన్నీ పోగా మిగిలే 8 వేల ఎకరాలను విక్రయించి రూ.లక్ష కోట్లతో అమరావతిని కట్టేస్తానని గతంలో నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఇప్పుడు అంత డబ్బు రావాలంటే స్మార్ట్ ప్రాజెక్టులు రావాలని.. అందుకోసం మరో 44 వేల ఎకరాలకుపైగా భూములను రాజధాని గ్రామాల్లో తీసుకోవాల్సి ఉంటుందని తాపీగా చెబుతున్నారు!! రూ.లక్ష కోట్లతో రాజధానిని నిర్మించడం అటుంచితే దాదాపు లక్ష ఎకరాల భూమిని మాత్రం తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు, అధికార వర్గాలు, రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
సాక్షి, అమరావతి: ‘‘రాజధాని అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు... ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది..!’’ సీఎం చంద్రబాబు తరచూ వల్లించే మాటలివీ! కానీ.. రాజధాని నిర్మాణానికి ఇప్పటికే రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తుండగా ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.6 వేల కోట్లను కేటాయించింది.
రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని స్వయంగా సీఎం చంద్రబాబు గతనెల 16న కేంద్ర ఆర్థిక సంఘానికి నివేదించారు. అది కూడా ఇప్పటికే సేకరించిన 53,748 ఎకరాల్లో రాజధాని పనులు చేపట్టడానికే ఈ నిధులు అవసరమని తేల్చారు.తాజాగా స్మార్ట్ ప్రాజెక్టుల పేరుతో మరో 44,676.64 ఎకరాలను రాజధాని కోసం సమీకరించే దిశగా టీడీపీ కూటమి సర్కారు అడుగులు వేస్తోంది.
ఇక అందులో నిర్మాణ పనులు చేపట్టి.. మొత్తం రాజధానిని పూర్తి చేయాలంటే అన్నీ కలిపి కనీసం రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని.. ఇదంతా అప్పుగా తేవాల్సిందేనని అధికార వర్గాలు తేల్చి చెబుతున్నాయి. దీన్ని బట్టి అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటూ సీఎం చంద్రబాబు చెబుతున్నదంతా సెల్ఫ్ డబ్బానేనని ఆర్థిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రజలు చెల్లించే పన్నులతోనే ఆ అప్పు తీర్చాల్సి వస్తుందని స్పష్టం చేస్తున్నారు.
రాజధానిపై లీకులు.. ఇన్‌సైడర్ ట్రేడింగ్!
రాజధాని లేకుండా రాష్ట్రాన్ని విభజించి ఆంధ్రప్రదేశ్‌కు తీరని అన్యాయం చేశారని.. సంక్షోభాన్ని అవకాశంగా మల్చుకుని దేవతల రాజధాని అమరావతిని తలపించే రీతిలో ప్రపంచంలోనే అత్యద్భుతమైన నగరాన్ని నిరి్మస్తానంటూ 2014లో సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తూ చంద్రబాబు గంభీరంగా ప్రకటించారు. రాజధాని ఏర్పాటయ్యే ప్రాంతంపై వందిమాగధులకు ముందే లీకులిచ్చారు. ‘ఇన్‌సైడర్ ట్రేడింగ్’ ద్వారా తన బినామీలు, సన్నిహితులు కారు చౌకగా రైతుల నుంచి భూములు కాజేశాక రాజధానిపై తాపీగా ప్రకటన చేశారు.
తుళ్లూరు, తాడికొండ, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ (భూ సమీకరణ) ద్వారా 29,442 మంది రైతుల నుంచి 34,823.12 ఎకరాలను సమీకరించారు. మరో 18,924.88 ఎకరాల ప్రభుత్వ, అటవీ భూములతో కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో (217 చ.కి.మీ.) రాజధాని నిర్మాణం అంటూ హడావుడి చేశారు.
కామధేనువు కాదు అప్పుల కుప్ప..
ఇప్పటికే రూ.52 వేల కోట్ల అప్పులు ఓ చిన్న ఇల్లు కట్టాలన్నా ముందుగానే తగిన ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుంటారు. అలాంటిది ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండానే (నిధులున్నాయో లేదో చూసుకోకుండా) 2016–19 మధ్య రాజధాని ప్రాంతంలో రహదారులు, మౌలిక సదుపాయాలు, ల్యాండ్ పూలింగ్ స్కీం లేఅవుట్ల అభివృద్ధి పనులను 55 ప్యాకేజీల కింద రూ.33,476.23 కోట్లకు అప్పగించారు. ఇందుకోసం సీఆర్‌డీఏ రూ.8,540.52 కోట్ల అప్పులు తెచ్చింది.

అయితే 2019 మే నాటికి ఆ పనులకు రూ.5,428.41 కోట్లను మాత్రమే వ్యయం చేసింది. మిగతా రూ.28,047.82 కోట్లతో పూర్తి చేయాల్సిన పనులను ఇప్పుడు రద్దు చేసి అంచనాలను అమాంతం పెంచేసింది. 2018–19 ధరలతో పోల్చితే పెట్రోల్, డీజిల్, సిమెంటు, స్టీలు తదితర ధరలు పెద్దగా పెరగలేదు. అయినా సరే మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 50 నుంచి 105 శాతం పెంచేసి కొత్తగా టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పగించింది.
రాజధాని పనుల పేరుతో ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు(ఏడీబీ) నుంచి రూ.15 వేల కోట్లు, హడ్కో (హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) నుంచి రూ.11 వేల కోట్లు, జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్ల్యూ డెవలప్‌మెంట్ బ్యాంకు నుంచి రూ.5 వేల కోట్లు వెరసి రూ.31 వేల కోట్ల అప్పులు తీసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. సీఆర్‌డీఏ బాండ్ల ద్వారా మరో రూ.21 వేల కోట్లు సమీకరించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అంటే.. ఇప్పటికే ఏకంగా రూ.52 వేల కోట్లు అప్పులు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇక 2025–26 బడ్జెట్‌లో రాజధాని నిర్మాణానికి రాష్ట్ర ఖజానా నుంచి రూ.6 వేల కోట్లు కేటాయించారు. వీటిని పరిశీలిస్తే.. అమరావతి కామధేనువు కాదు.. అప్పుల కుప్ప అన్నది స్పష్టమవుతోంది. మరి బాబు చెబుతున్న సెల్ఫ్ పైనాన్స్ మోడల్ ఎక్కడ ఉందన్నది ఆయనకే తెలియాలి! ఇకపోతే రాజధాని నిర్మాణానికి దాదాపు రూ.80 వేల కోట్లు అవసరమని గత నెలలో సీఎం చంద్రబాబు 16వ ఆర్థిక సంఘానికి ప్రజంటేషన్ ఇవ్వడం గమనార్హం.
మరో 44,676.64 ఎకరాల సమీకరణ దిశగా..
భూ సమీకరణ కింద రైతుల నుంచి సేకరించిన భూమి, ప్రభుత్వ భూమి కలిపి మొత్తం 53,748 ఎకరాల్లో భవనాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వగా ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయని.. ఆ భూమిని విక్రయిస్తే రూ.లక్ష కోట్లు వస్తాయని.. దాంతో రాజధాని నిర్మించవచ్చునని 2016 నుంచి చంద్రబాబు చెబుతూ వస్తున్నారు. ఇప్పుడు తాజాగా స్మార్ట్ ప్రాజెక్టులు వస్తేనే రాజధానిలో భూముల విలువ పెరుగుతుందని, అవి రావాలంటే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిపోర్టు, స్పోర్ట్స్ సిటీ నిరి్మంచాలని చెబుతున్నారు.
అయితే ఇంటర్నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, స్పోర్ట్స్ సిటీ నిర్మాణానికి భూములు లేవంటూ.. అందుకోసం తుళ్లూరు, తాడికొండ, అమరావతి, మంగళగిరి మండలాల్లో 11 గ్రామాల పరిధిలో 44,676.64 ఎకరాలను సమీకరించే దిశగా ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. ఇక ఆ భూముల్లో రోడ్లు, మౌలిక సదుపాయాలు, భవనాల నిర్మాణంతోపాటు రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు ఇవ్వాలంటే సుమారుగా మరో రూ.80 వేల కోట్లు అవసరమని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
మొత్తమ్మీద రాజధాని నిర్మాణం పూర్తయ్యే సరికి పెరిగే ధరలను (ఎస్కలేషన్) పరిగణనలోకి తీసుకుంటే అన్నీ కలిపి రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్లు వ్యయం అవుతుందని లెక్కగడుతున్నారు. అదంతా అప్పులు చేయాల్సిందే. వాటిని వడ్డీతో కలిపి చెల్లించడానికి ఇంకెన్ని లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందో ఊహించవచ్చు. ఆ అప్పు అంతా చివరకు ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే మొత్తంతోనే తీర్చాల్సి ఉంటుందని తేటతెల్లమవుతోంది.
అమరావతిపై బాబు డాబుసరి మాటలివిగో..
‘రాజధానిగా అమరావతి కామధేనువు లాంటి ప్రాజెక్టు. ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా టీడీపీ ప్రభుత్వం రూపొందించింది. భూ సమీకరణ కింద తీసుకున్న భూములు.. రైతులకు అభివృద్ధి చేసి ఇచ్చే ప్లాట్లుతోసహా అన్ని పోనూ ప్రభుత్వానికి 8,250 ఎకరాలు మిగులుతాయి. వాటిని అమ్ముకుంటే భారీగా నిధులు వస్తాయి’ – 2020 ఆగస్టు 7న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు

‘అమరావతి అందరికి ఆమోదయోగ్యమైంది. అది సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. అందరికీ ఇవ్వగా మిగిలే 8 వేల ఎకరాలకుపైగా భూములను అమ్ముకుంటే ప్రభుత్వానికి రూ.లక్ష కోట్ల వరకు ఆదాయం వస్తుంది. అక్కడ ఏ భవనం తాత్కాలికం కాదు.. అన్నీ శాశ్వత భవనాలే’ – 2020 ఆగస్టు 14న నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబు

‘అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ మోడల్ సిటీ అని గతంలోనే చెప్పా. మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. ఇక్కడ సృష్టించే సంపదతో వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలను చేపడతాం’ – 2024 జూన్ 19న సీఎం చంద్రబాబు

‘అమరావతిలో రైతులిచ్చిన భూములతోపాటు ప్రభుత్వ భూముల్లో రోడ్లు, భవనాలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా మిగిలిన భూములు అమ్మితే రాజధానిని నిర్మించుకోవచ్చు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు. ఇక్కడ వచ్చే ఆదాయమే రాజధాని నిర్మాణానికి సరిపోతుంది’ – 2024 జూన్ 20న సీఎం చంద్రబాబు