
విజయవాడ: సిట్ సీజ్ చేశామని చెబుతున్న రూ. 11 కోట్లతో తనకు సంబంధం లేదని రాజ్ కేసిరెడ్డి ఏసీబీ కోర్టుకు తెలిపారు. లిక్కర్ కేసులో తన పాత్ర ఏమీ లేదని ఈ సందర్భంగా పేర్నొన్నారు. ఈరోజు(మంగళవారం, ఆగస్టు 26వ తేదీ) రాజ్ కేసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది విజయవాడలోని ఏసీబీ కోర్టు. దీనిలో భాగంగా ఆ డబ్బుతో తనకు సంబంధం లేదని కేసిరెడ్డి కోర్టుకు తెలిపారు.
‘నన్ను కస్టోడియల్ విచారణ అని చెప్పి సిట్ అరెస్ట్ చేసింది. లిక్కర్ కేసులో నా పాత్ర ఏమీ లేదు. అన్యాయంగా నన్ను ఇరికించారు. నాపై ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేదు. ఆ రూ. 11 కోట్లు నావే అయితే నా వేలి ముద్రలు ఉంటాయి కదా?, అసలు రూ. 11 కోట్ల క్యాష్ అనేది ఒక్క వ్యక్తి దగ్గర ఉంటుందా?, నేను స్పై సినిమా తీశాను. సిట్ అధికారులు సినిమా స్టోరీల కంటే ఎక్కువ కథలు చెబుతున్నారు. సిట్ విచారించిన 300 మందిలో ఏ ఒక్కరూ నాకు తెలియదు. చాలా మంది పేర్లు తొలిసారిగా వింటున్నా’ అని కేసిరెడ్డి పేర్కొన్నారు.