
ఒంగోలు: ఉద్యోగ విరమణ చేసినా అతనిలో ప్రతిభాపాటవాలు తగ్గలేదు. ఏకంగా ఎవరెస్టునే ఎక్కి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. అతనే కాకుమాను రాజశిఖామణి. ప్రకాశం జిల్లా ఒంగోలు క్లౌపేటకు చెందిన ఈ రిటైర్డ్ ఎస్పీ 63 ఏళ్ల వయసులో ఈనెల 3న ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్టు పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించారు. 1981లోనే ఆయన సబ్‌ఇన్‌స్పెక్టర్‌గా పోలీసు శాఖలో ప్రవేశించారు. అత్యంత క్లిష్టమైన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు శిక్షణతోపాటు నేషనల్ సెక్యూరిటీ గార్డు (బ్లాక్ క్యాట్ కమాండో) శిక్షణ పొందారు. 1987లో ఆరుగురు ఐఏఎస్‌లను మావోయిస్టుల చెర నుంచి విడిపించడంలో ఆయన అనుసరించిన వ్యూహంతో గుర్తింపు పొందారు.
అత్యధిక కాలం ఉమ్మడి ఆంధ్రపదేశ్‌లో ఏపీ పోలీసు అకాడమీలో పనిచేశారు. విజయనగరం పోలీసు ట్రైనింగ్ కాలేజీ ఎస్పీగా పనిచేస్తూ పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి తనకు ఇష్టమైన పర్వతారోహణ చేయాలని సంకల్పించారు. 2019లో తన 61 ఏళ్ల వయసులో యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ ఎల్బరస్ 5,642 మీటర్ల ఎత్తును అధిరోహించారు. తాజాగా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి మరోమారు ప్రపంచ ఖ్యాతిని ఆర్జించారు. దేశంలోని రిటైర్డ్ పోలీసు అధికారుల్లో ఎవరెస్టు అధిరోహించిన ఏకైక వ్యక్తిగా రాజశిఖామణి నిలిచారు.