వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనపై ఆంక్షలు | Restrictions on YS Jagans visit to Srikakulam district | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనపై ఆంక్షలు

Jul 30 2026 5:10 AM | Updated on Jul 30 2026 5:10 AM

Restrictions on YS Jagans visit to Srikakulam district

పార్టీ నేత సీదిరి అప్పలరాజుతో ములాఖత్‌కు మాత్రమే అనుమతి

ర్యాలీ, రోడ్‌షో, బహిరంగ సమావేశాలకు అనుమతి నిరాకరణ

కాన్వాయ్‌లో 8 వాహనాలేనంటూ నిబంధనలు

వైఎస్‌ జగన్‌కు ఉన్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్న చంద్రబాబు సర్కారు

ఆశేష జనవాహిని ఆయన వెంట నడవకుండా కుట్రలు

అన్ని చోట్లా ఆ కుట్రలు విఫలం.. జగన్‌ వెంటే ప్రజలు

శ్రీకాకుళం జిల్లా పర్యటనలోనూ ప్రజలు పాల్గొనకుండా అడ్డుకొనే కుట్రలు

ప్రధాని పర్యటన, పల్నాడు ఘటన సాకు

శ్రీకాకుళం క్రైమ్‌: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళం జిల్లా పర్యటనలో ఆయన అభిమానులు, కార్యకర్తలు ఆయన వెంట నడవకుండా చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నింది. అత్యంత ప్రజాదరణ కలిగిన వైఎస్‌ జగన్‌ ఎక్కడికి వెళ్లినా అశేష జనవాహిని ఆయన వెంట నడుస్తుంది. భారీ సంఖ్యలో కార్యకర్తలు, యువత, మహిళలు, వృద్ధులు ఆయన కాన్వాయ్‌ వెంట వస్తారు. రోడ్ల పక్కన, మిద్దెలు, చెట్ల పైకెక్కి కూడా తమ అభిమాన నేత జగన్‌ను చూసేందుకు, ఆయనకు అభివాదం చేసేందుకు, కరచాలనం చేసేందుకు ప్రజలు ఆరాటపడతారు. 

ఇలా ప్రజలు ఆయన వెంట నడవకుండా చంద్రబాబు ప్రభుత్వం అన్ని చోట్లా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఎక్కడికక్కడ ప్రజలు, కార్యకర్తలను అడ్డుకుంటోంది. అయినా ఆయన అభిమానుల ముందు ఈ కుట్రలు విఫలమవుతూనే ఉన్నాయి. గురువారం వైఎస్‌ జగన్‌ శ్రీకాకుళం జిల్లా పర్యటనలోనూ అశేష ప్రజానీకం ఆయన కోసం వస్తారని ఇంటెలిజెన్స్, అధికారవర్గాలు సమాచారమివ్వడంతో చంద్రబాబు సర్కారు ఓర్వలేకపోతోంది. 

ఈ పర్యటనలో ప్రజలు పాల్గొనకుండా అడ్డుకొనేందుకు పోలీసు శాఖ ద్వారా పలు ఆంక్షలు విధించింది. భారీగా జనాలు రాకుండా  ఇటు పైడి భీమవరం నుంచి అటు ఇచ్ఛాపురం వరకు ముఖ్య కూడళ్లలో పోలీసులను పెట్టి ప్రజలను బెదరగొట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. పార్టీ నాయకులను ఇళ్లల్లో, పోలీసు స్టేషన్లలో నిర్బంధించనున్నట్లు సమాచారం.

ములాఖత్‌కు మాత్రమే అనుమతి ఉంది: ఎస్పీ
ప్రభుత్వం పెట్టిన ఆంక్షలను జిల్లా ఎస్పీ కె.వి. హహేశ్వర రెడ్డి బుధవారం వివరించారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అంపోలు జిల్లా జైలు వద్ద ములాఖత్‌లో కలిసేందుకు మాత్రమే వైఎస్‌ జగన్‌కు అనుమతి ఉందని ఎస్పీ చెప్పారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్టీ ప్రతినిధులు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి సీదిరి అప్పలరాజును ములాఖత్‌లో కలిసేందుకు పోలీసుల అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారని, పర్యటనకు సంబంధించి ఇతర వివరాలు అడిగినా ఇవ్వలేదని అన్నారు. 

ములాఖత్‌ అయ్యాక తిరిగి వెళ్లేందుకు మాత్రమే పోలీసుల అనుమతి ఉంటుందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన, వైఎస్‌ జగన్‌ పల్నాడు పర్యటనలో కాన్వాయ్‌ కింద ప్రజలు పడిన ఘటనలను దృష్టిలో ఉంచుకునే సభలు, ర్యాలీలు, రోడ్‌ షోలకు అనుమతి ఇవ్వడంలేదన్నారు. జెడ్‌ ప్లస్‌ కేటగిరీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రికి కల్పించాల్సిన రక్షణ ఏర్పాట్లు చేస్తున్నామని, కాన్వాయ్‌లో 8 వాహనాల వరకు అనుమతిస్తామని అన్నారు.

అప్పుడు చూద్దాం..
జగన్‌ మాస్‌ లీడర్‌ కదా.. మీరు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా ఆయనపై అభిమానమున్న అశేష జనవాహిని అధికంగా వస్తే అప్పటికప్పుడు మీ చర్యలు ఎలా ఉంటాయని ఎస్పీని విలేకరులు ప్రశ్నించగా..  ‘రాకూడదనే, అనుమతి లేదనే ఈ సమావేశం ద్వారా చెబుతున్నాం. అలాంటివేం జరిగినా నిర్వాహకులదే బాధ్యత. చట్టపరంగా చర్యలు తీసుకుంటాం’ అని అన్నారు. అప్పలరాజు అరెస్టు విషయంలో ఆ పార్టీ నాయకులతో పాటు మీడియాను సైతం 4 కిలోమీటర్ల ముందే హైవేపై బారికేడ్లు పెట్టి ఆపేశారని, ఇప్పుడూ అలాంటివే ఉంటాయా అని ప్రశ్నించగా.. అప్పటి పరిస్థితులనుబట్టి చూద్దాం అంటూ ఎస్పీ దాటవేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ కె.వి.రమణ, డీఎస్పీ సీహెచ్‌ వివేకానంద పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement