
వైఎస్ జగన్ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు
నెల్లూరులో సెక్షన్ 30 పోలీసు యాక్ట్ అమలు.. హెలిప్యాడ్‌కు 10 మంది, ములాఖత్‌కు ముగ్గురికే అనుమతి అంటూ ఆంక్షలు
మాజీ మంత్రి ప్రసన్నకుమార్‌రెడ్డి నివాసానికి 100 మందికే అనుమతి
మాజీ సీఎం పర్యటనపై ఆంక్షలు చూసి విస్తుపోతున్న ప్రజలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు పర్యటన నేపథ్యంలో నగరాన్ని అష్టదిగ్బంధం చేస్తూ సెక్షన్–30 పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నారు. వైఎస్ జగన్ హెలికాప్టర్ వద్దకు 10 మందిని మాత్రమే అనుమతిస్తామని పోలీసులు ప్రకటించారు. ఆయన కాన్వాయ్‌లో కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని తెలిపారు. మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్‌కు వైఎస్ జగన్ సహా కేవలం ముగ్గురికి మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు వెల్లడించారు.
మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి 100 మందినే అనుమతిస్తామని స్పష్టం చేశారు. వైఎస్ జగన్ నేపథ్యంలో అడుగడుగునా అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలు చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ప్రజలు వచి్చనా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంపైనా జనం తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఒక మాజీ ముఖ్యమంత్రి ప్రజల్లోకి వస్తుంటే ప్రభుత్వానికి అంత ఉలుకెందుకని చర్చించుకుంటున్నారు.
ఆంక్షలు మరింత కఠినతరం
ఈనెల 31న గురువారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నెల్లూరు రానుండటంతో పోలీసులు ఆంక్షల్ని మరింత కఠినతరం చేశారు. నెల్లూరు నగరంలో ఇప్పటికే సెక్షన్–30 పోలీసు యాక్ట్ అమల్లోకి తెచ్చారు. జనసమీకరణ చేయరాదని, రోడ్డుషోలు, ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహించకూడదంటూ ఆంక్షలు విధించారు. ఫ్లకార్డులు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదని వైఎస్సార్‌సీపీ శ్రేణులకు ఇప్పటికే స్పష్టం చేశారు. నిబంధనల్ని అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు.
ప్రజలకు సైతం ఎలాంటి అనుమతులు లేవని, వస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు. నెల్లూరు నగరంలోకి వచ్చే అన్నీ మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలను సైతం హౌస్ అరెస్ట్ చేస్తారన్న ప్రచారం సాగుతోంది. పోలీసుల చర్యలపై ప్రజల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జననేతను కనీసం చూసేందుకు కూడా అనుమతి ఇవ్వకపోవడంతో కూటమి సర్కారు తీరుపై జనం అసహనం వ్యక్తం చేస్తున్నారు.
హెలిప్యాడ్ వద్దకు 10 మందికే అనుమతి
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 31న ఉదయం 10–10.30 గంటల మధ్య హెలికాప్టర్‌లో చెముడుగుంట డీటీసీ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్రమ కేసుల నేపథ్యంలో జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీమంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డితో ములాఖత్ అవుతారు. జగన్‌మోహన్‌రెడ్డిని చూసేందుకు ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో వారిని అడ్డుకునేందుకు కేసులు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు.
హెలిప్యాడ్ వద్ద కేవలం 10
మంది వైఎస్సార్‌సీపీ నేతలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ములాఖత్‌కు కేవలం ముగ్గురిని మాత్రమే అనుమతించారు. జగన్‌మోహన్‌రెడ్డి కాన్వాయ్‌లో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. ములాఖత్ అనంతరం జగన్‌మోహన్‌రెడ్డి రోడ్డు మార్గంలో సుజాతమ్మ కాలనీలోని మాజీమంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి వెళతారు. అక్కడ వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడ 100 మందికి అనుమతించారు. ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాకుండా అటువైపు వెళ్లే అన్నీ రహదారుల్లో బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. హాస్పిటల్ వద్ద నుంచి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.
భద్రత పేరిట ఆంక్షలు
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉంది. అందుకు తగిన విధంగా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసు అధికారులు చెబుతున్నారు. రోప్ పార్టీలు, క్యూఆర్ టీమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న పోలీసులు వైఎస్ జగన్‌కి భద్రత కల్పించకుండా.. కేవలం ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు రాకుండా అడ్డుకునే పనిలో నిమగ్నమయ్యారు. నగరం నలువైపులా అష్ట దిగ్బంధం చేయాలని నిర్ణయించారు. నేషనల్ హైవేపైనా వాహనాల తనిఖీకి చర్యలు చేపట్టారు.
నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: ఇన్‌చార్జి ఎస్పీ
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటనకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఇన్‌చార్జి ఎస్పీ ఏఆర్ దామోదర్ మంగళవారం వెల్లడించారు. భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలు, ముందస్తు అనుమతులు, ఆంక్షలను మీడియాకు వెల్లడించారు. హెలిప్యాడ్ వద్ద 10 మందిని, ములాఖత్‌కు ముగ్గురిని, ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటికి 100 మందిని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. నగరంలో సెక్షన్–30 పోలీసు యాక్ట్ అమల్లో ఉన్న దృష్ట్యా ఊరేగింపులు, సభలు, సమావేశాలకు ఎలాంటి అనుమతి లేదన్నారు.