
విజయవాడ కోర్టుకు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని తీసుకొస్తున్న సిట్ అధికారులు
రూ.3,200 కోట్ల కుంభకోణం అన్నది కట్టుకథే
2018–19లో ఎక్సైజ్ ఆదాయం రూ. 16 వేల కోట్లు ఉంటే 2023–24లో రూ.24 వేల కోట్లకు పెరిగింది.. మరి ఖజానాకు నష్టం ఎక్కడ జరిగినట్టు?
విచారణ పేరుతో సిట్ కట్టుకథలు.. ఒక్క ఆధారమూ లేదు
మద్యం కేసులో చంద్రబాబు బెయిల్ మీద ఉన్నారు
చంద్రబాబు హయాంలోనే మద్యం కుంభకోణం.. ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ
ఆ అవినీతిని మరుగుపరిచేందుకే ఇప్పుడు అక్రమ కేసు.. వేధింపులు
సీఐడీ కేసును పోలీసులు దర్యాప్తు చేయడం నిబంధనలకు విరుద్ధం
17ఏ కింద ముందస్తు అనుమతి తీసుకోనేలేదు.. అరెస్టు చేసే అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దన్న సుప్రీంకోర్టు
అయినా సిట్ అక్రమంగా అరెస్టు చేసింది
ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి తరపున వాదనలు వినిపించిన మాజీ ఏజీ శ్రీరామ్.. కాపీ పేస్ట్ రిమాండ్ నివేదికతో సిట్ కనికట్టు
ఇద్దరికీ 20 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ధరలను పెంచలేదు.. మద్యం ఉత్పత్తులపై పన్నులనే పెంచారు. గత టీడీపీ ప్రభుత్వంలో కంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మద్యం విక్రయాలను గణనీయంగా తగ్గించింది. కానీ, పన్నులను పెంచడంతో ఎక్సైజ్ శాఖకు ఆదాయం పెరిగింది. దాంతోనే ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెరిగింది. మరి ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగితే ఇక ప్రభుత్వ ఖజానాకు నష్టం ఎక్కడ వాటిల్లింది..? కుంభకోణం ఎక్కడ జరిగింది..? అంటే ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్ల నష్టం వాటిల్లిందని సిట్ చెబుతున్నది అంతా అవాస్తవమే కదా?
సాక్షి, అమరావతి: ‘సిట్ నమోదు చేసింది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విధానంపై ప్రస్తుత ప్రభుత్వం రాజకీయ కారణాలతోనే అక్రమ కేసు పెట్టింది. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు అవినీతిపై నమోదైన కేసులను కప్పిపుచ్చేందుకే ఈ కేసును నమోదు చేసింది’ అని మాజీ అడ్వకేట్ జనరల్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ ఏసీబీ న్యాయస్థానానికి వివరించారు. 2019–24 మధ్య మద్యం విధానంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,200 కోట్లు నష్టం వాటిల్లిందన్న సిట్ అభియోగానికి ఎలాంటి ప్రాతిపదిక లేదని స్పష్టం చేశారు.
అందుకు సంబంధించి న్యాయస్థానానికి కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయారని గుర్తు చేశారు. దీన్నిబట్టి స్కామ్ అనేది ఒక కట్టుకథ అని స్పష్టం చేశారు. సీఐడీ కేసును ఆ దర్యాప్తు సంస్థ పరిధిలోని ఇతర పోలీసు అధికారులు నిబంధనలకు విరుద్ధంగా దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు. ఈ కేసులో సిట్ అక్రమంగా అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డిల తరపున సీనియర్ న్యాయవాది శ్రీరామ్ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో శనివారం వాదనలు వినిపించారు. వారిద్దరిని సిట్ అధికారులు అక్రమంగా అరెస్టు చేశారని నిబంధనలను ఉటంకిస్తూ వివరించారు. అంశాల వారీగా శ్రీరామ్ వినిపించిన వాదనలు ఇలా ఉన్నాయి...
చంద్రబాబు ప్రభుత్వం 5 డిస్టిలరీల నుంచే 69% మద్యం కొనుగోళ్లు చేసింది
చంద్రబాబు అవినీతి కేసులను కప్పిపుచ్చేందుకే సిట్ ఈ అక్రమ కేసు నమోదు చేసింది. ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత కేసు. దీనివెనుక రాజకీయ దురుద్దేశాలు ఉన్నాయని.. వాటిని ఎంతమాత్రం కొట్టిపారేయలేమని సుప్రీంకోర్టు కూడా అభిప్రాయపడింది. నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారిస్తూ ఆ విషయాన్ని స్పష్టం చేసింది. రాజకీయ పక్షపాతం, దురుద్దేశాలకు న్యాయపరంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది కూడా. 2014–19 మధ్యన చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై పలు కేసులు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయి.
ఆ ఐదేళ్లలో ప్రభుత్వ మద్యం విధానం ద్వారా పాల్పడిన అవినీతిని ఇప్పటికే సీఐడీ నిర్ధారించి చంద్రబాబుతో పాటు పలువురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఈ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం కేవలం 5 డిస్టిలరీల నుంచే ఏకంగా 69 శాతం మద్యం కొనుగోళ్లు చేసినట్లు అప్పటి సిట్ తన రిమాండ్ రిపోర్టులోనే పేర్కొంది. మంత్రి మండలికి తెలియకుండా మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజును రద్దు చేశారు. ఆ కేసులో ఆయన ముందస్తు బెయిల్‌పై ఉన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా ఈ అక్రమ కేసు నమోదు చేయించారు. అంతెందుకు ఇప్పుడు అడ్డగోలుగా వేధిస్తున్న సిట్ రాజ్ కేసిరెడ్డి రిమాండ్ రిపోర్టులో కూడా 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే 54 శాతం మద్యం కొనుగోళ్లు చేసిందని పేర్కొనడం నిజం కాదా?
వైఎస్సార్‌సీపీ హయాంలో ఖజానా ఆదాయం పెరిగింది
2019–24లో రూ.3,200 కోట్ల కుంభకోణం జరిగిందని ఏ ప్రాతిపదికన నిర్ధారించామన్నది సిట్ చెప్పడమే లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కొత్తగా ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. 2014–19 మధ్య కంటే 2019–24 మధ్య రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగింది. 2018–19లో ఎక్సైజ్ శాఖ ఆదాయం రూ.16 వేల కోట్లు ఉంటే 2023–24లో రూ.24 వేల కోట్లకు చేరుకుంది. ఇక కుంభకోణంపై సిట్ వద్ద ఒక్క ఆధారం కూడా లేదు. కనీసం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలోనూ ఒక్క ఆధారాన్ని కూడా చూపలేకపోయింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని బెవరేజెస్ కార్పొరేషన్ రికార్డుల్లో కూడా అటువంటి సమాచారం ఏమీ లేదు. ఉంటే సిట్ చూపించి ఉండేది కదా. కేవలం సిట్ అధికారులు తాము బెదిరించి తీసుకున్న కొందరు డిస్టిలరీల ప్రతినిధుల వాంగ్మూలాలను మాత్రమే చూపిస్తున్నారు. ఆ డిస్టిలరీలన్నీ 2014–19లో అప్పటి ప్రభుత్వ హయాంలో లబ్ధి పొందినవే. అవే డిస్టిలరీలను తర్వాతి ప్రభుత్వం 2019–24లోనూ కొనసాగించింది.
సీఐడీ కేసును పోలీసులు ఎలా దర్యాప్తు చేస్తారు?
అసలు ఈ కేసు రాజకీయ ప్రేరేపితం. కేసు నమోదు నుంచి సీఐడీకి అప్పగించడం, సిట్ ఏర్పాటు అంతా చట్టానికి విరుద్ధంగా సాగుతోంది. ఈ కేసును సీఐడీ డీజీ పర్యవేక్షిస్తారు అని సిట్‌ను ఏర్పాటు చేస్తూ జారీ చేసిన జీవోలో ప్రభుత్వం పేర్కొంది. సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా గుర్తించింది. కానీ, సిట్‌లో ఉన్న సభ్యుల్లో అత్యున్నత అధికారి విజయవాడ పోలీస్ కమిషనర్. మిగిలిన సభ్యులు ఆయన కంటే జూనియర్లు. మరి వీరందరూ సీఐడీ పరిధిలోకి వస్తారా? తాము సీఐడీ పరిధిలోకి వస్తామని వారిని న్యాయస్థానంలో అఫిడవిట్ సమర్పించమనండి. వారు అలా అఫిడవిట్ సమరి్పస్తే తదనుగుణంగా మేం తదుపరి చర్యలు చేపడతాం. సీఐడీ పరిధిలోకి రాని పోలీస్ అధికారులు ఈ కేసును ఎలా దర్యాప్తు చేస్తారు? అంటే ఈ కేసు దర్యాప్తే పూర్తి నిబంధనలను విరుద్ధంగా సాగుతోంది.
సిట్ కేసు ఈ న్యాయస్థానం పరిధిలోకి రాదు
సిట్ నమోదు చేసిన ఈ కేసు విజయవాడ ఏసీబీ న్యాయస్థానం పరిధిలోకి రాదు. ఏసీబీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులను విచారించేందుకు ప్రత్యేక చట్టం ద్వారా ఈ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేశారు. సీఐడీ నమోదు చేసే అవినీతి నిరోధక కేసులు కూడా ఈ న్యాయస్థానం పరిధిలోకి వస్తాయని చట్టం చేశారు. కానీ, సిట్‌ను ప్రత్యేక పోలీస్ స్టేషన్‌గా గుర్తిస్తూ ఈ ప్రభుత్వం జీవో ఇచి్చంది. సిట్ నమోదు చేసే కేసులు అసలు ఈ న్యాయస్థానం పరిధిలోకి రానే రావు.
ప్రతి ఒక్కరికి 17ఏ కింద ముందస్తు అనుమతి తీసుకోలేదు
ఈ కేసులో నిందితులు ప్రతి ఒక్కరిపై దర్యాప్తునకు 17ఏ కింద ముందే అనుమతి తీసుకోవాలి. మొత్తంగా అందరిపై ఒకేసారి 17ఏ కింద అనుమతి తీసుకున్నామని.. కేరళ హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ సిట్ చెబుతున్నది సరికాదు. ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా ప్రకటించింది. (ఈ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించిందని సిట్ న్యాయవాదులు చేసిన వాదనను న్యాయవాది శ్రీరామ్ తోసిపుచ్చారు). 2023లో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుకు సంబంధించి 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే అంశంపై సుప్రీంకోర్టు చెప్పినదాన్ని ప్రస్తుతం సిట్ న్యాయవాదులు వక్రీకరిస్తున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం 2018 కంటే ముందే జరిగింది కాబట్టి 17ఏ వర్తించదు. 2018కు ముందు జరిగిన కేసులకు 17ఏ వర్తిస్తుందా వర్తించదా అనే విషయాన్ని పరిశీలించేందుకు ప్రత్యేక ధర్మాసనానికి నివేదించారు. అంతేగానీ, 2018 ఆ తర్వాత నమోదయ్యే కేసుల్లో నిందితులు ప్రతి ఒక్కరిపై విడివిడిగా 17ఏ కింద దర్యాప్తునకు అనుమతి తీసుకోవాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఆ ప్రకారం సీఎంవోలో కార్యదర్శిగా చేసిన కె.ధనుంజయ్ రెడ్డి, ఓఎస్డీ పి.కృష్ణమోహన్‌రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులు. వారిపై కేసులకు విడివిడిగా 17ఏ కింద అనుమతి తీసుకోవాల్సిందే. ఈ నిబంధనను సిట్ ఉల్లంఘించింది కాబట్టి ఇది అక్రమ అరెస్టే అవుతుంది.
హడావుడిగా అరెస్టు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది
ముందస్తు బెయిల్ ఇవ్వనంత మాత్రాన నిందితులను హడావుడిగా అరెస్టు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పింది. అరెస్టుకు ఉన్న అధికారాన్ని పోలీసులు దుర్వినియోగం చేయొద్దని ఇటీవలే స్పష్టం చేసింది. కచి్చతమైన ఆధారాలు ఉంటేనే అరెస్టు చేయాలని చెప్పింది. కానీ, ఈ అక్రమ కేసులో ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా సిట్ స్పష్టమైన ఆధారాలేమీ చూపలేకపోయింది. కనీసం న్యాయస్థానానికి కూడా సమర్పించనే లేదు. ఇక ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి దేశం విడిచివెళ్లే అవకాశం ఉంది కాబట్టి అరెస్టు చేస్తున్నామని సిట్ చెప్పడం పూర్తిగా అవాస్తవం. నిందితులుగా చేర్చకముందే వారికి వ్యతిరేకంగా సిట్ లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. సిట్ అక్రమంగా అరెస్టు చేసింది.
నిబంధనలకు విరుద్ధంగా అరెస్టు
ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను శుక్రవారం రాత్రి అరెస్టు చేసే క్రమంలో సిట్ అధికారులు నిబంధనలను ఉల్లంఘించారు. అరెస్టుకు ప్రాతిపదిక, కారణాలను నిందితులకు తెలపాలి. కానీ, వారికి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. వారి కారు డ్రైవర్‌కు చెప్పామని రిమాండ్ నివేదికలోనే సిట్ అధికారులు పేర్కొన్నారు. నిందితులకు తెలపాలన్న నిబంధనను సిట్ అధికారులు కావాలనే ఉల్లంఘించారు.
కాపీ పేస్ట్ కుట్ర.. అదే సిట్ రిమాండ్ నివేదిక
రెడ్‌బుక్ కుట్రనే సిట్ తన దర్యాప్తు నివేదిక పేరిట మరోసారి కనికట్టు చేసింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని కోరుతూ న్యాయస్థానంలో దాఖలు చేసిన రిమాండ్ నివేదికే ఆ విషయాన్ని వెల్లడించింది. పూర్తిగా అవాస్తవాలు, అభూత కల్పనలతోనే రిమాండ్ నివేదిక రూపొందించిందని స్పష్టమైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు చేసిన రాజ్ కేసిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, ఇతర నిందితుల రిమాండ్ నివేదికల్లో పేర్కొన్న కట్టుకథనే కాపీ పేస్ట్ చేసింది. ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డికి వ్యతిరేకంగా కనీసం ఒక్క ఆధారాన్ని కూడా చూపించలేకపోయింది. ఈ కేసు దర్యాప్తు పేరిట డిస్టిలరీల ప్రతినిధులు, ఇతర సాక్షులను తాము బెదిరించి నమోదు చేసిన అబద్ధపు వాంగ్మూలాలనే అరెస్టుకు ప్రాతిపదికగా చూపించడం సిట్ కుట్రను బట్టబయలు చేసింది.
20 వరకు రిమాండ్ విధించిన న్యాయస్థానం
సిట్ అరెస్టు చేసిన రిటైర్డ్ ఐఏఎస్ కె.ధనుంజయ్‌రెడ్డి, పి.కృష్ణమోహన్‌రెడ్డికి న్యాయస్థానం ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. వారిద్దరిని సిట్ అధికారులు శనివారం ఉదయం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఇరు పక్షాల వాదనల అనంతరం న్యాయస్థానం రిమాండ్ విధించింది. వారికి ప్రత్యేక వసతులు కలి్పంచాలని తన ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిని సిట్ అధికారులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.
శ్రీధర్‌రెడ్డికి ముగిసిన కస్టడీ
విజయవాడ లీగల్: మద్యం కుంభకోణం ఆరోపణలపై అరెస్టయి విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా వున్న శ్రీధర్‌రెడ్డి మూడు రోజుల కస్టడీ శనివారంతో ముగిసింది. పోలీసులు ఆయనకు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించి, ఏసీబీ న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. అనంతరం జిల్లా జైలుకు తరలించారు.