
విజయవాడ: మరో రెండు రోజుల్లో వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో మంగళవారం(సెప్టెంబర్ 2వ తేదీ) నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
పశ్చిమ బెంగాల్-ఒడిశా తీరాలకు అనుకుని వాయువ్య బంగాళాఖాతం మీదుగా సముద్ర మట్టానికి సగటును 1.5 మరియు 5.8 కి.మీ ఎత్తులో ఉపరిత ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
తీరం వెంబడి గంటకు 40 -60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. బుధవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్ళరాదని సూచించారు. ఇప్పటికే ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ వెల్లడించారు.
ఈ నేపధ్యంలో ప్రజలు చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న భవనాలు,హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
సాయంత్రం 6 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి వరద నీటిమట్టం 48.1అడుగులు ఉందన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 11.47 లక్షల క్యూసెక్కులు ఉందని మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుందన్నారు. కృష్ణానది వరద ప్రవాహం ప్రకాశం బ్యారేజి వద్ద సాయంత్రం 6 గంటలకు 2.25 లక్షల క్యూసెక్కులు ఉందన్నారు. వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదుల వరద ప్రవాహం హెచ్చుతగ్గులుగా మరో నాలుగు,ఐదు రోజులు ఉండొచ్చని పూర్తిస్థాయిలో వరద తగ్గే వరకు పొంగిపొర్లే నదులు, వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వినాయక నిమజ్జనాల్లో జాగ్రతలు తీసుకోవాలన్నారు.