ఒళ్లు దగ్గర పెట్టుకుని రాతలు రాయండి
మహిళలను కించపరిచిన రాధాకృష్ణ వ్యాఖ్యలపై నిరసనాగ్రహం
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ‘చెత్త పలుకు’పై వైఎస్సార్‌సీపీ శ్రేణుల కన్నెర్ర
హైదరాబాద్‌లోని ఏబీఎన్ కార్యాలయం ఎదుట శాంతియుత నిరసన
రాష్ట్రంలో పలుచోట్ల ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతుల దహనం.. పోలీసులకు ఫిర్యాదు
మహిళలపై రాధాకృష్ణ వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకం
తీవ్రంగా ఖండించిన వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
విలువలన్నీ విడిచేసి.. బ్రోకరిజానికి జర్నలిజం ముసుగేసి.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ సాగిస్తున్న ‘చెత్తపలుకు’పై రాష్ట్రవ్యాప్తంగా నిరసనాగ్రహాలు వెల్లువెత్తాయి. మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా దిగజారిన రాతలు రాస్తున్నాడంటూ రాధాకృష్ణపై రాష్ట్ర ప్రజలు దుమ్మెత్తిపోశారు. ఇలాంటి రోతరాతలు రాధాకృష్ణకు కొత్త కాదని, ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తాయి.
వైఎస్సార్‌సీపీ నాయకులే లక్ష్యంగా వారి కుటుంబ సభ్యులపై అత్యంత నీచమైన వ్యాఖ్యలు చేసిన రాధాకృష్ణను వెంటనే అరెస్టు చేసి తగిన విధంగా శిక్షించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, ధర్నాలు చేపట్టారు. ఆంధ్రజ్యోతి దినపత్రిక ప్రతులను దహనం చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
హైదరాబాద్‌లోని ఆంధ్రజ్యోతి ప్రధానకార్యాలయం వద్ద కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని రాధాకృష్ణ రోతరాతలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. మహిళలను కించపరిచేలా దిగజారి రాతలు రాయడం, వ్యాఖ్యలు చేయడం భావప్రకటనా స్వేచ్ఛకిందకు ఎలా వస్తుందని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్/సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్: తమ మనోభావాలు దెబ్బతీసేలా, అసభ్యకర రీతిలో మహిళలను కించ పరిచేలా, సభ్య సమాజం తల దించుకునేలా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులు నిరసన తెలిపారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అవి కొత్త పలుకులు కావు.. చెత్త పలుకులు అంటూ ఊరూరా ర్యాలీలు చేశారు.
రాధాకృష్ణా ఖబడ్దార్.. ఒళ్లు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలని హెచ్చరించారు. రాధాకృష్ణది జర్నలిజం కాదని, ముమ్మాటికీ బ్రోకరిజం అని నినాదాలు చేశారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రతులను పలుచోట్ల మంటల్లో వేసి తగలబెట్టారు. ఏబీఎన్ రాధాకృష్ణ చిత్రాలతో ఉన్న ప్లకార్డులకు నిప్పుపెట్టారు. రాధాకృష్ణపై కేసు నమోదు చేయాలని పలు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో ఏ మహిళను దూషించినా చర్యలు తీసుకుంటామని పలుమార్లు డైలాగులు కొట్టిన నారా లోకేశ్, హోం మంత్రి అనిత ఏబీఎన్‌పై, రాధాకృష్ణపై ఎందుకు ఒక్క మాట కూడా మాట్లాడలేదని ప్రశ్నించారు.
సీఎం, డిప్యూటీ సీఎం ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు. పైగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న వారిపై విష ప్రచారాలు, తప్పుడు ఆరోపణలు చేస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు. అసభ్యకర వ్యాఖ్యలు, బాధ్యతారాహిత్య జర్నలిజాన్ని ఖండిస్తూ, మీడియా నైతిక విలువలను పాటించాలని డిమాండ్ చేశారు. పార్టీ శ్రేణులు ఐక్యంగా నిరసన తెలుపుతూ ఏబీఎన్ రాధాకృష్ణను గట్టిగా హెచ్చరించారు.
ఛీటర్ రాతలకు భయపడే ప్రశ్నే లేదు
హైదరాబాద్ ఫిలింనగర్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం ముందు మంగళవారం ఉదయం వైఎస్సార్‌సీపీ నేతలు శాంతియుతంగా నిరసన చేపట్టారు. వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ బ్రోకరిజంపై ధ్వజమెత్తారు. ఆంధ్రజ్యోతి చెత్త రాతలపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏబీఎన్ వద్ద బందోబస్తు నిర్వహించిన పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్‌సీపీ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ గొంతు పట్టుకుని పక్కకు లాగే ప్రయత్నం చేశారు. పలువురు నేతల చొక్కాలు పట్టుకుని తోసివేసేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసుల తీరు పట్ల వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు జర్నలిజానికి మాయనిమచ్చగా నిలుస్తాయన్నారు. ‘ఏబీఎన్ రాధాకృష్ణ మహిళలను అవమానించారు.
గడ్డి తిని ఈ వ్యాఖ్యలు చేశారా? రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి. చంద్రబాబుది, ఆయనది ఒకే ఎజెండా. రాధాకృష్ణ ఒక ఛీటర్.. ఆయన రాతలకు భయపడే ప్రశ్నే లేదు’ అని మండిపడ్డారు. ఈ ఆందోళనలో వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, నేతలు టి.విశ్వరూప్, శంకర్ నారాయణ, లేళ్ల అప్పిరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ప్రకాష్ రెడ్డి, రమేష్ యాదవ్, భరత్, పి.రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, ఇజ్రాయిల్, కావూరి శ్రీనివాస్, సురేష్, చంద్రశేఖర్‌రెడ్డి, కుంభా రవిబాబు తదితరులు పాల్గొన్నారు. ఏబీఎన్ రాధాకృష్ణ వ్యాఖ్యలను నిరసిస్తూ కూకట్‌పల్లిలో వైఎస్సార్ అభిమానులు ఫ్లకార్డులతో ప్రదర్శన నిర్వహించారు.


చంద్రబాబు మనసులో ఉన్నదే రాధాకృష్ణ రాస్తున్నారు
చంద్రబాబునాయుడు మనసులో ఏముందో రాధాకృష్ణ అదే రాస్తున్నారు. నిత్యం వైఎస్సార్‌సీపీ నాయకులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కుట్రలో భాగంగానే మహిళలను కించపరిచేలా రాతలు రాశారు. దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. కుట్రలతో వైఎస్సార్‌సీపీ నాయకుల మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీయాలనుకోవడం సరికాదు. – కాకాణి గోవర్దన్‌రెడ్డి, మాజీ మంత్రి
ఇది వేశ్యా రాజకీయం
ఏబీఎన్ రాధాకృష్ణ జర్నలిజం ముసుగులో వేశ్యా రాజకీయం చేస్తున్నారు. బూతు పత్రికను పెట్టుకుని చెడు రాతలు రాస్తూ వైఎస్సార్‌సీపీ కుటుంబంపై ఇష్టమొచ్చిన రాతలు రాస్తే తెలుగు ప్రజలు తరిమికొడతారు. బూతు భాషపై రాధాకృష్ణ క్షమాపణలు చెప్పాలి. – జోగి రమేష్, మాజీ మంత్రి
రాధాకృష్ణ రాజకీయ వ్యభిచారి
ఏబీఎన్ రాధాకృష్ణకు కుల గజ్జి పట్టి రాజకీయ వ్యభిచారం చేస్తున్నారు. మీడియాను అడ్డం పెట్టుకుని చంద్రబాబు కంట్లో పడాలని మహిళలను కించపరుస్తున్నారు. పక్క రాష్ట్రంలో తల దాచుకుని.. అక్కడొక పార్టీ, ఇక్కడొక పార్టీతో రాజకీయ వ్యభిచారం చేస్తున్నాడు. – తాటిపర్తి చంద్రశేఖర్, ఎమ్మెల్యే
ఆ వ్యాఖ్యలు, రాతలు దుర్మార్గం
ఏబీఎన్ రాధాకృష్ణ రాతలు చాలా దుర్మార్గంగా ఉన్నాయి. రాధాకృష్ణ అనే వ్యక్తి విలేకరిగా ఉంటూ అనేక తప్పుడు కార్యక్రమాలు, వ్యాపారాలు కూడా చేస్తున్నాడు. బూతు పత్రికలు, ఛానల్‌లు నడపడం సమంజసమా? – అంబటి రాంబాబు, మాజీ మంత్రి
రాధాకృష్ణ నీ పాపాలు అన్నీ ఇన్నీ కావు
ఏబీఎన్ రాధాకృష్ణ నీ పాపాలు అన్నీ ఇన్నీ కావు. దేవుడి లాంటి ఎన్టీఆర్‌ను పొట్టన పెట్టుకున్న దగ్గర నుంచి చంద్రబాబుకు తొత్తుగా వ్యవహరించావు. నీ బిల్డింగ్‌లో ఎన్నో పాపకార్యాలు చేశావు. ఇప్పుడు వైఎస్సార్‌సీపీ మహిళల పట్ల విపరీత వ్యాఖ్యలు చేస్తున్నావు. నీ కుటుంబం ఏమిటి? నీ భార్య, నీ కూతురు పరిస్థితి ఏమిటి? ఒకసారి వారి గురించి కూడా రాయి. నీ పాపం పండింది. బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. – నందమూరి లక్ష్మీపార్వతి, వైఎస్సార్‌సీపీ నాయకురాలు
అవి చెత్త పలుకులు
కొత్త పలుకు పేరిట చెత్త పలుకులు రాస్తున్న రాధాకృష్ణ జర్నలిజపు విలువలకు పాతరేశారు. మహిళా లోకాన్ని కించపరిచే విధంగా ఇలాంటి రాతలు రాయడం దౌర్భాగ్యం. దీనిని ఎవరూ హర్షించరు. వెంటనే రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి. లేదంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి


