ధర లేని 'ఉల్లి'.. రైతు 'తల్లడిల్లి'! | The hardships of onion farmers under the Chandrababu Naidu government are indescribable | Sakshi
Sakshi News home page

ధర లేని 'ఉల్లి'.. రైతు 'తల్లడిల్లి'!

Apr 8 2026 4:24 AM | Updated on Apr 8 2026 4:24 AM

The hardships of onion farmers under the Chandrababu Naidu government are indescribable

గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ధర లేని పరిస్థితి

క్వింటా రూ.400కు మించి కొనుగోలు చేయని దుస్థితి

కనీసం పెట్టుబడి ఖర్చులు రావట్లేదని రైతుల ఆందోళన 

వైఎస్‌ జగన్‌ హయాంలో క్వింటా రూ.4వేల వరకు పలికిన ధర

హామీలిచ్చి చేతులెత్తేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో ఉల్లి రైతుల కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. మార్కెట్‌­లో ధర లేక, కొనే నాథుడు లేక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు. రబీ పంట చేతికొచ్చే సమయంలో దిగజారిన ధరలతో గగ్గోలు పెడుతు­న్నారు. వందలాది క్వింటాళ్ల ఉల్లిని రోడ్ల పక్కనే కుప్పలుగా పోసి కొనే వారి కోసం పడిగాపులు పడాల్సిన దుస్థితి దాపురించింది. క్వింటా కనీసం రూ.500 కూడా పలకకపోవడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.

నాణ్యత బాగున్నా కొనే వారేరీ?
రాష్ట్రంలో ఉల్లి సాధారణ విస్తీర్ణం లక్ష ఎకరాలు.­అత్యధికంగా కర్నూలు, వైఎస్సార్‌ కడప, అనంత­పురం, విజయనగరం జిల్లాల్లో ఎక్కువగా సాగవు­తుండగా, కర్నూలు జిల్లా ఉల్లికి జాతీయ స్థాయిలో డిమాండ్‌ ఉంది. కర్నూలు తర్వాత మైదుకూరు ప్రాంతంలో సాగయ్యే కేపీ ఉల్లికీ డిమాండ్‌ ఎక్కువే. 3 నెలల్లో చేతికొచ్చే పంటకు ఎకరాకు రూ.లక్ష వర­కు పెట్టుబడి ఖర్చవుతుంది. 

ఖరీఫ్‌లో 8–10 టన్ను­లు, రబీలో 10–20 టన్నుల వరకు దిగుబడులొ­స్తాయి. కనీసం 3–6 నెలలు నిల్వ చేసే అవకాశం ఉన్నప్పటికీ నిల్వ చేసుకునే సదుపాయాల్లేక పంట చేతికి రాగానే అయినకాడికి అమ్ముకోవాల్సి వస్తుంది. నవంబర్, డిసెంబర్, జనవరిలో వేసిన పంట గత నెల నుంచి కోతలు మొదలయ్యాయి. నాణ్యత­కు ఢోకా లేకున్నప్పటికీ మార్కెట్‌లో ధర లేక, కొనే­వారూ లేక రైతులు తీవ్ర నష్టాలను చవిచూస్తున్నారు.

క్వింటా ధర రూ.300 నుంచి రూ.500లోపే..
ప్రస్తుతం కర్నూలు మార్కెట్‌కు రోజుకు 2వేల క్వింటాళ్ల చొప్పున వస్తోంది. కేవలం 5 శాతానికి మాత్ర­మే క్వింటా రూ.800 పలుకుతుండగా, 95 శాతానికి పైగా పంటకు క్వింటా రూ.300 నుంచి రూ.500కు మించి ధర లభించలేదు. సీజన్‌ ఆరంభంలోనే పరి­స్థితి ఇలా ఉంటే, పంట పూర్తిగా మార్కెట్‌కు వచ్చే సమయానికి మరింత దయనీయంగా మారుతుందని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుండడంతో తాము తీవ్ర నష్టాలు చవిచూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లి రైతుకు అండగా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం
ఉల్లి రైతులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లూ అండగా నిలిచింది. 2019–24 మధ్య క్వింటా రూ.3,500 నుంచి రూ.4వేల మధ్య ధర లభించింది. ధర తగ్గిన సందర్భాల్లోనూ మార్కె­ట్‌ ఇంటర్‌వెన్షన్‌ స్కీమ్‌ కింద రైతులకు మద్దతు ధర దక్కేలా జగన్‌ ప్రభుత్వం కృషి చేసింది. వై­ఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.­64 కోట్ల విలువైన 9,025 టన్నుల ఉల్లిని రైతుల నుంచి కనీస మద్దతు ధరకు కొనుగోలు చేశారు. 

మరో వైపు ధరలు పెరిగిన సందర్భాల్లోనూ షోలా­పూర్‌ మార్కెట్‌ నుంచి ఉల్లి కొనుగోలు చేసి సబ్సిడీపై రూ.50కే సరఫరా చేసి వినియోగ­దారులపై భారం పడకుండా చేశారు. గతేడాది క్వింటా రూ.1,200 తక్కువ కాకుండా కొనుగోలు చేయిస్తామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం చేతులెత్తేసింది. చివరికి రూ.800కి కొనుగోలు చేస్తామని చెప్పి మూడు రోజులు తిరక్కుండానే ‘అబ్బే అలాంటి ఆలోచనే ప్రభుత్వం దగ్గర లేదు’ అంటూ మాట మార్చి ఉల్లి రైతులను చంద్ర­బాబు ప్రభుత్వం దగా చేసింది.

ఈయన పేరు గంగరాజు. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పేలకుర్తికి చెందిన ఈ రైతు ఎకరాలో ఉల్లి సాగు చేశారు. రూ.80వేలకు పైగా పెట్టుబడి పెట్టారు. 120 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. పంట  అమ్ముకుందామని కర్నూలు మార్కెట్‌ యార్డుకు తీసుకొచ్చారు. వ్యాపారులు లేక ఇలా రోడ్ల పక్కన ఉల్లిని రాసులుగా పోసి ఎదురు చూస్తున్నాడు. కొనండి బాబూ అని కాళ్లావేళ్లా పడుతుంటే క్వింటా రూ.400కైతే తీసుకుంటామంటున్నారు. ఈ ధరకు అమ్ముకుంటే కనీసం కూలీ ఖర్చులు కూడా రావని, ఏం చేయాలో పాలుపోవడం లేదంటూ రైతు కన్నీరుమున్నీరవుతున్నారు.

కోత ఖర్చులు కూడా రావు
ఐదెకరాల్లో ఉల్లిసాగు చేశా. ఎకరాకు రూ.80వేల వరకు పెట్టుబడి పెట్టాను ఎకరాకు 10 టన్నుల దిగుబడి వచ్చింది. పంట చేతికొచ్చే సమ­యా­నికి ధర లేకుండా పో­యింది. ఎంతోకొంతకు తెగనమ్ముకుందామన్నా కొనే నాథుడు కనిపించడం లేదు. బ్రతిమి­లాడు­తుంటే క్వింటా రూ.500 ఇస్తామంటున్నారు. కనీసం కోత ఖర్చులు కూడా రావు. ఎలా బత­కాలో అర్థం కావడం లేదు. – ఎం.షఫీ, కర్నూలు జిల్లా

చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదు
1.50 ఎకరాల్లో ఉల్లి సా­గు చేశా. దాదాపు రూ.­1.20లక్షల వరకు ఖర్చ­య్యింది. ఎక­రా­కు 15 టన్నుల దిగు­బడి ఉంది. క్వింటా రూ.400కి మించి ధర ఇవ్వడం లేదు. పె­ట్టుబడి ఖ­ర్చు­లు దక్కని పరిస్థితి. చంద్ర­బాబు ప్రభుత్వం ఉల్లి రైతులను పట్టించుకోవడం లేదు.    – జీ మిన్నల్ల, పాలకుర్తి, కర్నూలు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement