నాది న్యాయపోరాటం.. రాజకీయం కాదు | Former employee Anand files complaint with EC against Jana Sena MLA Nagamadhavi | Sakshi
Sakshi News home page

నాది న్యాయపోరాటం.. రాజకీయం కాదు

Apr 8 2026 4:33 AM | Updated on Apr 8 2026 4:33 AM

Former employee Anand files complaint with EC against Jana Sena MLA Nagamadhavi

నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే నాగమాధవిపై ఈసీకి ఫిర్యాదుచేసిన మాజీ ఉద్యోగి ఆనంద్‌  

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: తన పోరాటం రాజకీయం కాదని విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోకం నాగమాధవిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేసిన మాజీ ఉద్యోగి ఆనంద్‌ చెప్పారు. నాగమాధవికి చెందిన కంపెనీలో పనిచేసిన తన కెరీర్‌ను నాశనం చేయాలని చూశారని, అందుకే తాను నష్టపరిహారం కోసం న్యాయపోరాటం చేస్తున్నానని ‘సాక్షి’కి తెలిపారు. ఎమ్మెల్యే నాగమాధవికి చెందిన మిరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీకి విజయనగరం జిల్లా ముంజేరు పంచాయతీలో ఉన్న బ్రాంచిలో 2021 నుంచి 2024 నవంబర్‌ వరకు సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేసినట్లు చెప్పారు. 

2024 ఎన్నికల్లో జనసేన తరఫున పోటీచేసిన నాగమాధవి ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని ఎన్నికల కమిషన్‌కు గత ఫిబ్రవరిలో ఆధారాలతో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ విజయనగరం జిల్లా కలెక్టర్‌/ఎన్నికల అధికారిని ఈసీ ఆదేశించిందన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ఆధారాలతో తన కార్యాలయానికి రావాలని నెల్లిమర్ల తహసీల్దార్‌ మెయిల్‌ ద్వారా సమాచారం ఇచ్చారని తెలిపారు. ప్రాణభయం కారణంగా తాను స్వయంగా హాజరుకాలేనని, జూమ్‌ మీటింగ్‌లో విచారణకు అనుమతించమని ఎన్నికల సంఘానికి ఈ–మెయిల్‌లో విజ్ఞప్తిచేసినట్టు చెప్పారు. 

తనను ఉద్యోగం నుంచి తొలగించడంతో 2025 డిసెంబర్‌ 22న విశాఖపట్టణం లేబర్‌ కమిషనర్‌ను ఆశ్రయించినట్లు తెలిపారు. తనకు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్, ఆగిపోయిన బోనస్‌ ఇవ్వాలని లేబర్‌ కమిషనర్‌.. ఈ ఏడాది జనవరి 27న యాజమాన్యానికి నోటీసు ఇచ్చారని తెలిపారు. తాను రూల్స్‌కు విరుద్ధంగా వ్యవహరించినట్లు యాజమాన్యం ఫిర్యాదు చేసిందన్నారు. తన కెరీర్‌ నాశనం అవుతుందన్న ఆందోళనతో.. ఎన్నికల్లో కంపెనీ చేసిన ఆర్థిక అవకతవకలపై ముందుగా ఫిబ్రవరిలో భోగాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. 

ఇది తెలుసుకున్న యాజమాన్యం ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకుంటేనే ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్‌ ఇస్తామని చెప్పినట్టు తెలిపారు. సర్టిఫికెట్‌ ఇచ్చినరోజే వెనక్కి తీసుకుంటానని చెప్పినా, వాళ్లు పట్టించుకోకపోవడంతో ఈసీ వరకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. ఈ విషయంలో తనపై అసత్యప్రచారం చేస్తున్న టీవీ చానళ్లపై పరువునష్టం దావా వేస్తానని చెప్పారు. తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదని, జీవన మనుగడ కోసమే తన పోరాటమని ఆయన స్పష్టంచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement