అమరావతి మోయలేని గుదిబండగా మారింది: పేర్ని నాని | Perni Nani Slams Chandrababu’s Corruption Over Amaravati | Sakshi
Sakshi News home page

అమరావతి మోయలేని గుదిబండగా మారింది: పేర్ని నాని

Apr 13 2026 5:53 PM | Updated on Apr 13 2026 7:07 PM

Perni Nani Slams Chandrababu’s Corruption Over Amaravati

తాడేపల్లి: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అవినీతి, అత్యాశ వల్ల అమరావతి మోయలేని గుదిబండగా మారిందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం (ఏప్రిల్‌ 13) పేర్నినాని తాడేపల్లిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ఏపీ రాజధాని అంశంలో చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.

‘మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తే ఇబ్బంది ఏంటి? బాధ్యతగా వ్యవహరించాల్సిన మంత్రులతో బూతులు తిట్టిస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయిస్తున్నారు. చంద్రబాబు అంతులేని అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నారు.

రాష్ట్రానికి రాజధాని అనేది సిరిసంపదలతో తూగేలా ఉండాలి. అంతేగానీ, రాష్ట్రాన్ని దివాళా తీసే విధంగా రాజధాని ఉండకూడదు. ఏది బాగుంటుందో ఇవాళ రాష్ట్ర ప్రజలు ఆలోచించే పరిస్థితి వచ్చింది. మావిగన్‌ అనే ప్రతిపాదనతో రాజధాని తక్కువ ఖర్చుతో నిర్మితమవుతుంది. 

ప్రజలు అమాయకులేం కాదు.. అన్నీ ఆలోచిస్తారు. చంద్రబాబుకు విశ్వాసం లేదని ఎన్టీఆర్‌ విమర్శించారు. 224 మంది ఎమ్మెల్యేలను కాసులతో కొనుక్కున్నారని ఎన్టీఆర్‌ అన్నారు. వెన్నుపోటు పొడిచారని స్వయంగా ఎన్టీఆరే అన్నారు. కేబినెట్‌లో ఉన్న తొమ్మిది మంది మంత్రులే చంద్రబాబును తిట్టని తిట్టు తిట్టారు

రాజధానికి అప్పులు చేసి ఏం ఏస్తారు? అప్పులతో 7 కోట్ల ప్రజలను తాకట్టు పెడుతున్నారు. రూ.51 వేల కోట్ల టెండర్లు పిలిచామని జబ్బలు చరుకుంటున్నారు. ఇప్పటివరకు మీరు మా ప్రాంతానికి చేసిందేంటి?’ అని పేర్ని నాని అన్నారు.

అమరావతి వలన కలిగే‌ ప్రయోజనం ఏంటో? మావిగన్ వలన కలిగే నష్టం ఏంటో చంద్రబాబు చెప్పటం లేదని పేర్ని నాని అన్నారు. ‘మావిగన్ ప్రకటనకు 48 గంటల్లోనే పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  మావిగన్‌కు అడవిలో ఉండే గిరిజనులు సైతం మద్దతు ఇస్తున్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూరుకుపోయేలా చేయకూడదు. 

మావిగన్ పై జనంలో మంచి రెస్పాన్స్ రాగానే బొత్స, ధర్మానపై కూటమి నేతలు విమర్శలు చేశారు. చంద్రబాబు వాడుకుని వదిలేసేరకం అని కన్నా లక్ష్మీనారాయణ అప్పట్లో అన్నారు. మళ్లీ వచ్చి ఏం చేస్తావ్? అని పవన్ కల్యాణ్ విమర్శించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఏకంగా పుస్తకాలే రాశారు. 

కాంట్రాక్టర్లను రాత్రి సమయంలో బెదిరించి డబ్బులు వసూలు చేస్తాడని చంద్రబాబుకు టార్చ్‌లైట్ మంత్రి అనే పేరుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ఆధారాలు చూపిస్తాం. టీటీపీ నేతలు వీటిని కూడా ప్రెస్‌మీట్ లో చూపించగలరా? చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలకు చూపించే టైం వస్తుంది. 

అమరావతి, మావిగన్ లలో దేనికి  సత్తా ఉందో ప్రజలకు ఎందుకు చెప్పటం లేదు? మావిగన్ ప్రాంతం సీఆర్‌డీఏ పరిధిలోనే ఉందని చంద్రబాబు అంటున్నారు. పామర్రు వరకు సీఆర్‌డీఏ లో మరి మాస్టర్ ప్లాన్ ఎందుకు లేదు? జగన్ మావిగన్ అనగానే ఇప్పుడు సర్వే సంస్థలను కొన్ని గ్రామాలకు ఎందుకు పంపారు? 

అమరావతిలో రూ.51 వేల కోట్ల టెండర్లు పిలిచామన్న ప్రభుత్వం మా ప్రాంతంలో ఏం అభివృద్ధి చేస్తున్నారు? మేము కూడా రాజధానిలోనే ఉంటే మరి మావైపు ఎందుకు అభివృద్ధి చేయటం లేదు? మావైపు ఒక్క టవర్ కూడా ఎందుకు కట్టలేదు? జడ్జీల బంగ్లాలు, అసెంబ్లీ, ఇతర బిల్డింగులు మా ఏరియాలో ఎందుకు కట్టటం లేదు? అసలు అమరావతిలో నిర్మించే భవనాలపై శ్వేత పత్రం రిలీజ్ చేయాలి. బేసిక్ నిర్మాణాలకే రూ.51 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారట. 

ఇక కరెంటు, నీరు, డ్రైనేజీలు ఇతరత్రా పనులకు ఎంత ఖర్చు చేస్తారు? ఇవి కాకుండా అంతర్గత రోడ్లకు ఎంత ఖర్చు చేస్తారు? చంద్రబాబు, మంత్రి నారాయణ మానసిక స్థితి బాగలేదు. ఇద్దరినీ మానసిక వైద్యులకు చూపించాలి. ఎకరంలో జగన్ ఇల్లు కట్టుకుంటే ప్యాలెస్ అన్నారు. మరి ఐదు ఎకరాల్లో చంద్రబాబు కట్టేదాన్ని ఏం అనాలి? వెలగపూడిలో సచివాలయం లిఫ్టులే పని చేయటం లేదు, ఇక ఏం రాజధాని బిల్డింగులు కడతారు? అమరావతి ఎప్పటికి పూర్తవుతుంది?

ఇంకా ఎంత అప్పు చేస్తారు? మావిగన్ ఎందుకు అవసరం లేదు? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. అమరావతి చట్టబద్ధత అనగానే చంద్రబాబు, లోకేష్ పండుగ చేసుకున్నారు. కానీ భూములు ఇచ్చిన ఏ ఒక్క రైతు అయినా సంబరాలు చేసుకున్నారా? జనానికి అప్పులు, చంద్రబాబుకు సంపద మిగులుతుంది. టీడీపీ వారు కూడా మావిగన్ ప్రతిపాదనను మెచ్చుకుంటున్నారు’ అని పేర్ని నాని చెప్పారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement