మహారాష్ట్రకు 103 టన్నుల ఆక్సిజన్‌.. | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రకు 103 టన్నుల ఆక్సిజన్‌..

Published Fri, Apr 23 2021 1:21 PM

Oxygen Express Starts Journey For Maharashtra From Visakhapatnam - Sakshi

సాక్షి విశాఖపట్నం/తాటిచెట్లపాలెం (విశాఖ ఉత్తర): కోవిడ్‌ బాధితుల ప్రాణాలు నిలబెట్టే ఆక్సిజన్‌ నింపిన ట్యాంకర్లతో ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు గురువారం రాత్రి విశాఖపట్నం నుంచి మహారాష్ట్రకు బయలుదేరింది. 7 ట్యాంకర్లలో 103 టన్నుల ఆక్సిజన్‌ను పంపించారు. మహారాష్ట్ర నుంచి 7 ఖాళీ ట్యాంకర్లతో వచ్చిన ఈ రైలు గురువారం తెల్లవారుజామున 4 గంటలకు స్టీల్‌ప్లాంట్‌కు చేరింది. రైలుపై ఉన్న ట్యాంకర్లు రోడ్డు మార్గం ద్వారా ఆక్సిజన్‌ ప్లాంట్‌కు చేరుకున్నాయి. అప్పటికే మైనస్‌ 183 డిగ్రీల వద్ద నిల్వచేసిన లిక్విడ్‌ ఆక్సిజన్‌ను ట్యాంకర్లలో నింపే ప్రక్రియ ప్రారంభించారు.

వాల్తేరు డీఆర్‌ఎం చేతన్‌కుమార్‌ శ్రీవాత్సవ, స్టీల్‌ప్లాంట్‌ సీఎండీ పీకే రథ్‌ పర్యవేక్షణలో 80 మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు ట్యాంకర్లలో ఆక్సిజన్‌ నింపే పనులు పూర్తిచేశారు. ఆక్సిజన్‌ నింపిన తరువాత ట్యాంకర్లను మళ్లీ రైలుపైకి తీసుకెళ్లారు. ఈ ప్రక్రియ 18 గంటల్లో పూర్తయింది. రైలు పైకి ఎక్కించిన తరువాత ట్యాంకర్ల టైర్ల నుంచి గాలి తీసేశారు. రైలు వేగంగా వెళ్తున్నప్పుడు టైర్లలో గాలి ఉంటే కదిలే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్తగా గాలి తీసేశారు. రాత్రి 9.30 గంటలకు ఆక్సిజన్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు విశాఖ స్టీల్‌ప్లాంట్‌ నుంచి మహారాష్ట్ర బయలుదేరింది. రైల్వేశాఖ గ్రీన్‌ చానల్‌ ఏర్పాటు చేసినందున ఈ రైలు త్వరితగతిన మహారాష్ట్ర చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు.
చదవండి:
కంప్యూటర్స్‌ చదివి.. మోసాలలో ఆరితేరి..  
సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే.. 

Advertisement
Advertisement