కొనసాగుతున్న 45వ విడత ఫీవర్‌ సర్వే 

Ongoing 45th Fever Survey Andhra Pradesh - Sakshi

1,63,37,078 కుటుంబాల నుంచి వివరాల సేకరణ 

ఇతర రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యలు.. స్వల్ప లక్షణాలుంటే అక్కడికక్కడే మందులు 

ఏదైనా జబ్బుతో ఉన్న వారికి లక్షణాలుంటే పరీక్షలు, వైద్యం 

ఇంటింటి సర్వేలో ఆశా వర్కర్‌తోపాటు వలంటీర్లు 

ఏఎన్‌ఎం, మెడికల్‌ అధికారి పర్యవేక్షణ.. ఈనెల 17 నాటికి పూర్తయ్యేలా ప్రణాళిక  

సాక్షి, అమరావతి: దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కోవిడ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం 45వ విడత ఇంటంటి ఫీవర్‌ సర్వే చేపట్టింది. ఆశా వర్కర్‌తో పాటు గ్రామ, వార్డు వలంటీర్లు సోమవారం నుంచి ఇంటింటికి వెళ్లి జ్వరం లక్షణాలున్న వారు ఉన్నారా లేదా అనేది గుర్తించే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే 44 సార్లు ఇంటింటి ఫీవర్‌ సర్వే నిర్వహించడం ద్వారా కోవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం సఫలీకృతమైంది.

ఇప్పుడు రాష్ట్రంలో మొత్తం 1,63,37,078 కుటుంబాల లక్ష్యంగా చేపట్టిన 45వ విడత సర్వే వివరాలను ఏరోజుకు ఆరోజు ఆన్‌లైన్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఎవరికైనా జ్వరం లక్షణాలుంటే వారికి కోవిడ్‌ పరీక్షలను నిర్వహించేందుకు సంబంధిత ఏఎన్‌ఎంతో పాటు మెడికల్‌ అధికారి దృష్టికి తీసుకెళతారు. దీర్ఘకాలిక జబ్బులున్నవారిలో జ్వరం లక్షణాలుంటే వెంటనే కోవిడ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ పరీక్ష ఫలితాల ఆధారంగా హోం ఐసొలేషన్‌కు సూచనలు చేయడంతోపాటు ఉచిత మందుల కిట్‌ అందజేస్తారు. వైద్యులు పర్యవేక్షిస్తారు. దీర్ఘకాలిక జబ్బులు లేనివారిలో స్వల్ప జ్వరం లక్షణాలుంటే వారికి అక్కడికక్కడే మందులు ఇస్తారు.

ఫీవర్‌ సర్వే నిబంధనల మేరకు పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ హైమావతి జి ల్లాల వైద్యాధికారులకు ఆదేశాలు జారీచేశారు. నెలలో రెండుసార్లు ఫీవర్‌ సర్వే నిర్వహించాలని, ఈ నెలలో తొలివిడత సర్వే ఈ నెల 17వ తేదీలోగా పూర్తికావాలని నిర్దేశించారు. మిగతా రోజువారీ కార్యక్రమాలను కొనసాగిస్తూనే ఫీవర్‌ సర్వే నిర్వహించాలని స్పష్టం చేశారు. ఇంటింటి ఫీవర్‌ సర్వేను అత్యంత ప్రాధాన్యతగా తీసుకోవాలని వైద్యాధికారులు సిబ్బందిని ఆదేశించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top