ప్రశ్నించానని పోలీసులు రిమాండ్‌కు పంపారు | Nursing Student Supriya from Krishna District Meets YS Jagan | Sakshi
Sakshi News home page

ప్రశ్నించానని పోలీసులు రిమాండ్‌కు పంపారు

Apr 8 2026 5:17 AM | Updated on Apr 8 2026 11:33 AM

Nursing Student Supriya from Krishna District Meets YS Jagan

మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన నర్సింగ్‌ విద్యార్థిని సుప్రియ, ఆమె తల్లిదండ్రులు

వైఎస్‌ జగన్‌ ఎదుట గోడు వెళ్లబోసుకున్న నర్సింగ్‌ విద్యార్థిని సుప్రియ 

వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుంది.. అధైర్యపడొద్దని జగన్‌ భరోసా

జాతీయ ఎస్సీ కమిషన్, మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి సమస్య

పామర్రు సీఐ, ఎస్‌ఐలపై హైకోర్టులో ప్రైవేట్‌ కేసు వేస్తామని స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: తన తండ్రిపై నేరం మోపినందుకు ప్రశ్నించిన తనను పామర్రు సీఐ శుభాకర్, ఎస్‌ఐ భాస్కర్‌ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి దారుణంగా కొట్టారని కృష్ణా జిల్లా పామర్రుకు చెందిన నర్సింగ్‌ విద్యార్థిని సుప్రియ కన్నీటి పర్యంతం అయ్యారు. తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై గ్రీవెన్స్‌లో కృష్ణా జిల్లా కలెక్టర్‌ బాలాజీకి ఫిర్యాదు చేశానని, ఆయన తన అర్జీని పోలీసులకు అప్పగించగా.. వారు తనపై సెక్షన్‌ 307 కింద రివర్స్‌ కేసు పెట్టి రిమాండ్‌కు పంపారని వాపోయారు. తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చానని చెప్పారు. 

మంగళవారం ఆమె తన తల్లిదండ్రులు ఆరోగ్యం, జుజ్జువరపు చిన్ని, బాబాయి యాకోబుతో కలిసి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. స్థానిక టీడీపీ నాయకుడు గణేష్‌ కోసం పోలీసులు తన కుటుంబంపై ఇంత దారుణంగా వ్యవహరించారని వైఎస్‌ జగన్‌కు వివరించారు. వైఎస్సార్‌సీపీలో ఉత్సాహంగా పని చేస్తున్నామనే కక్షతో తన బాబాయి యాకోబు ఇంటిని టీడీపీ నేత గణేష్‌ తగల బెట్టించాడని, తమ కుటుంబాన్ని వేధింపులకు గురిచేస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. 

వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న దళిత విద్యార్థినిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపడం దారుణమని మండిపడ్డారు. సుప్రియకు అవసరమైన న్యాయ సహాయం వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ అందిస్తుందని చెప్పారు. సుప్రియ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరును జాతీయ ఎస్సీ కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్‌ దృష్టికి తీసుకెళ్లాలని పామర్రు పార్టీ ఇన్‌చార్జ్‌ కైలే అనిల్‌ కుమార్‌కు సూచించారు. పామర్రు సీఐ శుభాకర్, ఎస్‌ఐ భాస్కర్‌పై హైకోర్టులో ప్రైవేట్‌ కేసు వేసి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. సుప్రియ కుటుంబానికి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. అధైర్యపడొద్దని, పార్టీ అండగా ఉంటుందని వైఎస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement