టెన్త్ స్పాట్.. ఫెయిల్‌ | Tabs and internet not working in spot valuation | Sakshi
Sakshi News home page

టెన్త్ స్పాట్.. ఫెయిల్‌

Apr 8 2026 4:59 AM | Updated on Apr 8 2026 4:59 AM

Tabs and internet not working in spot valuation

వికటించిన విద్యాశాఖ ప్రయోగాలు.. పనిచేయని ట్యాబ్‌లు, ఇంటర్నెట్‌...  

‘స్పాట్‌’ కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు ఉపాధ్యాయుల అవస్థలు  

సాక్షి, అమరావతి: పాఠశాల విద్యాశాఖలో ప్రయోగాలు వికటించాయి. ముఖ్యంగా సంస్కరణల పేరుతో రూ.కోట్లు ఖర్చు పెట్టి పదో తరగతి పరీక్షల విషయంలో అమలు చేసిన విధానాలు బెడిసి కొట్టాయి. ఈ విద్యా సంవత్సరంలో ఆటోమేషన్‌ పేరుతో అడ్డదిడ్డంగా ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వేశారు. అప్పుడు జరిగిన తప్పులను సరిచేసుకోకుండానే అదే ఆటోమేషన్‌ను పదో తరగతి మూల్యాంకనం (స్పాట్‌ వాల్యూయేషన్‌) విధులకు కూడా వర్తింపజేశారు. దీంతో సబ్జెక్టులు బోధించని వారికి కూడా స్పాట్‌ వాల్యూయేషన్‌ డ్యూటీలు పడ్డాయి. ఉపాధ్యాయులు ఎంత మొత్తుకున్నా పట్టించుకోకుండా పేపర్లు దిద్దాల్సిందేనని ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. దీంతో విద్యార్థులకు మార్కులు ఏ విధంగా వస్తాయోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.  

కనీస శిక్షణ లేకుండానే విధులు  
రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు జరిగాయి. దాదాపు 6.20 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. సోమవారం నుంచి ప్రారంభమైన జవాబు పత్రాల మూల్యాంకనం పది రోజుల్లో (ఏప్రిల్‌ 16లోపు) పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. మూల్యాంకనం విధుల్లో చీఫ్‌ ఎగ్జామినర్స్, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లు తదితర సిబ్బంది 20 వేల మందిని ఆటోమేషన్‌ ద్వారా నియమించారు. 

వారికి కేడర్ల ఆధారంగా చేయాల్సిన విధులపై కనీస శిక్షణ కూడా ఇవ్వకుండా మూల్యాంకనం సెంటర్లకు పంపించారు. వాస్తవానికి మూల్యాంకనం ప్రారంభమయ్యే నాటికి సిబ్బంది ఎంపిక, శిక్షణ పూర్తవ్వాలి. కానీ, మంగళవారం కూడా చీఫ్‌ ఎగ్జామినర్లు, అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు, స్పెషల్‌ అసిస్టెంట్లను ఎంపిక చేసి స్పాట్‌ కేంద్రాలకు పంపినట్లు తెలిసింది. దీనినిబట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.   

పనిచేయని ట్యాబులు, ఇంటర్నెట్‌! 
ఈ ఏడాది కొత్తగా పదో తరగతి మూల్యాంకనం కేంద్రాల్లోనే మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేసే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం రూ.50 లక్షలతో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించారు. అసిస్టెంట్‌ ఎగ్జామినర్లు పేపర్లు వేల్యూ చేసిన అనంతరం మార్కులను ట్యాబ్‌లలో నమోదు చేయాలి. వీటిని స్పెషల్‌ అసిస్టెంట్లు మరో ట్యాబ్‌లో రెండోసారి నమోదు చేస్తే, అవి లీప్‌ యాప్‌లో అప్‌లోడ్‌ అవుతాయి. కానీ, స్పాట్‌ వాల్యూయేషన్‌ సెంటర్లలో అందుబాటులో ఉంచిన ట్యాబ్‌లు, ఇంటర్నెట్‌ పనిచేయడం లేదని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

ఉదయం 9 గంటలకు ప్రారంభమైన మూల్యాంకనం సాయంత్రం 4 గంటలకల్లా పూర్తవ్వాలి. కానీ, ట్యాబ్‌లు, ఇంటర్నెట్‌ సక్రమంగా పని చేయకపోవడంతో సోమవారం అర్ధరాత్రి 11 గంటలు దాటినా మార్కుల నమోదు పూర్తికాలేదని తెలిసింది. దీంతో ఉపాధ్యాయులు దిద్దిన జవాబు పత్రాలను తిరిగి స్ట్రాంగ్‌ రూములకు తరలించారని సమాచారం. ఇవన్నీ పదో తరగతి ఫలితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement