
శ్రామికులకు కూలీ డబ్బుల్లేవ్.. ఉద్యోగులకు జీతాల్లేవ్
3 నెలలుగా జీతానికి నోచుకోని 15 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది
27 లక్షల కుటుంబాలకు రూ.800 కోట్ల కూలీ డబ్బులు బకాయి
కూటమి ప్రభుత్వ హయాంలో పెరిగిన రాజకీయ జోక్యం
ఇష్టారాజ్యంగా సిబ్బంది తొలగింపు.. నియామకాలు
అన్నీ కలిపి వేసవిలో పేదలకు పనుల కల్పనపై ప్రభావం
గత ఏడాది ఒక్క ఏప్రిల్‌లోనే ఆరు కోట్ల పని దినాలు
ఈ ఏడాది గత 40 రోజులుగా కల్పించింది 4.41 కోట్ల పని దినాలే
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు అస్తవ్యస్తంగా మారింది. 27 లక్షల శ్రామికుల కుటుంబాలకు రూ.800 కోట్ల మేర కూలీ డబ్బులు బకాయిలుండటంతో పేదలు ఆకలితో అలమటిస్తున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈ పథకం కింద పని చేసే దాదాపు 15 వేల మంది ఉద్యోగులు, సిబ్బంది మూడు నెలలుగా వేతనాలు అందక విలవిల్లాడిపోతున్నారు. గ్రామాల్లో వ్యవసాయ పనులు దొరకని ప్రస్తుత వేసవి రోజుల్లో ఉపాధి హామీ పథకంపై ఆధారపడి జీవించే పేదల పరిస్థితి దయనీయంగా తయారైంది.
నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం పనుల్లో పనిచేసే శ్రామికులకు గరిష్టంగా 15 రోజుల లోపే వారి పనికి సంబంధించిన కూలీ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 27 లక్షల పేద కుటుంబాలకు సంబంధించిన 39 లక్షల మంది పేదలకు నెల రోజులుగా చేసిన పనులకు కూలీ డబ్బులు చెల్లించ లేదు. ఇలాగైతే ఎలా అంటూ వ్యవసాయ కారి్మక సంఘాల నేతలు మండిపడుతున్నారు. మరోవైపు.. మెటీరియల్ కేటగిరిలో గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, తదితర పనులు చేసిన వారికి రూ.2,500 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
మరోవైపు ఉపాధి హామీ పథకం కార్యక్రమాల పర్యవేక్షణకు మండల కంప్యూటర్ సెంటర్ల(ఎంసీసీ)లో పని చేసే టెక్నికల్ అసిస్టెంట్లు (టీఏ) మొదలు రాష్ట్ర స్థాయి కార్యాలయంలో పనిచేసే దాదాపు ఏడు వేల మంది వివిధ స్థాయిల ఎఫ్‌టీఈ ఉద్యోగుల వరకు ఫిబ్రవరి నెల వేతనం ఇప్పటి వరకు చెల్లించలేదని ఆయా ఉద్యోగ సంఘాల ప్రతినిధులు వాపోతున్నారు. గ్రామ స్థాయిలో ఉపాధి హామీ పథకం పనులను నిత్యం పర్యవేక్షించే ఫీల్డు అసిస్టెంట్లకు, రాష్ట్ర స్థాయి గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయంలో పనిచేసే కొన్ని కేటగిరీల ఉద్యోగులు 8 వేల మందికి మార్చి నెల నుంచి వేతనం ఇవ్వలేదు. మొత్తంగా 15 వేల మందికి జీతాలు ఇవ్వక పోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది.
మితిమీరిన అధికార పార్టీ నేతల ఆగడాలు
గత ఏడాది జూన్‌లో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు పనులు కల్పించే ఉపాధి హామీ పథకం అమలులో రాజకీయ జోక్యం మితిమీరిపోతోంది. ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన వెంటనే అప్పటిదాకా గ్రామాల్లో ఉపాధి పథకం ఫీల్డు అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వారిలో అత్యధికులను ఏకపక్షంగా తొలగించి, ఆ స్థానాల్లో కూటమి పార్టీల సానుభూతిపరులను నియమించారు. గ్రామాల్లో పార్టీల వారీగా పనులు కేటాయిస్తున్నారని ఎన్నో ఘటనలు రుజువు చేశాయి.
కేవలం అధికార పార్టీకి అనుకూలంగా ఉండే వారికి మాత్రమే పనులు కల్పించాలని ఒత్తిళ్లు వస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు, ప్రభుత్వం సైతం కొత్తగా గ్రూపుల వారీగా మాత్రమే పనులు కల్పించాలని నిర్ణయం తీసుకోవడంతో కొన్ని గ్రూపులకు పనులు కేటాయించడం లేదని విమర్శలున్నాయి. కొద్ది రోజుల కిత్రం.. అనకాపల్లి జిల్లా మామిడపాలెం గ్రామంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి ఓటు వేశారని దాదాపు 350 మంది కూలీలకు స్థానిక సిబ్బంది పనులు కల్పించకపోవడంతో వారు ఆందోళనకు దిగారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్‌ఎల్ పురం గ్రామానికి చెందిన 300 మంది కూలీలు తమకు పనుల కల్పనలో రాజకీయ పక్షపాతం చూపుతున్నారని ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటి పరిస్థితులే కొనసాగుతున్నాయి.
పనుల కల్పనలో ఘోరంగా విఫలం
⇒ 2024 ఏప్రిల్ నెలలో అప్పటి ప్రభుత్వం పేదలకు 5.98 కోట్ల పని దినాల్లో పనులు కల్పించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల 30 రోజులతో పాటు మే నెలలో పది రోజులు కలుపుకుని.. మొత్తం 40 రోజుల్లో కూటమి ప్రభుత్వం కేటాయించిన పని దినాలు కేవలం 4.41 కోట్లు మాత్రమే. ఎక్కువ డిమాండ్ ఉండే మే నెలలో రోజుకు 25 లక్షల పని దినాలకు మించి పనులు కల్పించడం లేదు. శనివారం దాదాపు 30 లక్షల మంది పేదలు ఉపాధి హామీ పథకం పనులకు డిమాండ్ పెట్టుకుంటే కేవలం 23 లక్షల మందికి మాత్రమే పనులు కల్పించారు.
⇒ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం శ్రామికుల ఆదాయం సైతం పడిపోయినట్టు స్వచ్ఛంద సంస్థ ‘లిబ్‌టెక్ ఇండియా’ ఓ నివేదిక విడుదల చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులకు హాజరైన ఒక్కో పేద కుటుంబం ఏడాది మొత్తంలో రూ.13,484 చొప్పున ఆదాయం పొందింది. అదే 2024–25 ఆర్థిక ఏడాదిలో రోజు వేతన రేటు రూ.272 నుంచి రూ.300కు పెరిగినప్పటికీ సగటున ఓ కుటుంబానికి రూ.13,190 మాత్రమే పొందినట్టు ఆ సంస్థ పేర్కొంది. పెరిగిన ధరల ప్రకారం చూస్తే.. ఒక్కో కుటుంబం సగటున రూ.1531 చొప్పున నష్టపోయిందని వెల్లడించింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో 25.55 కోట్ల పేదలు పనులు పొందగా, 2024–25లో ఆ సంఖ్య 24.22 కోట్లకు పరిమితమైంది.
⇒ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో వంద పని దినాల పాటు పనులు పొందిన కుటుంబాల సంఖ్య కూడా భారీగా తగ్గింది. 2023–24 ఏడాదిలో 6.87 లక్షల కుటుంబాలు వంద పని దినాల్లో పనులు పొందగా, 2024–25లో 5.1 లక్షల కుటుంబాలు మాత్రమే ఆ మేరకు పనులు పొందాయి.