సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వట్లేదు | AP Govt Employees says CM Chandrababu is not giving an appointment | Sakshi
Sakshi News home page

సీఎం అపాయింట్‌మెంట్‌ ఇవ్వట్లేదు

May 30 2025 6:13 AM | Updated on May 30 2025 6:13 AM

AP Govt Employees says CM Chandrababu is not giving an appointment

మాట్లాడుతున్న బొప్పరాజు వెంకటేశ్వర్లు

మొత్తం రూ.20 వేల కోట్లు బకాయిలుంటే 10 శాతమే ఇచ్చారు

మహారాణిపేట (విశాఖ): ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి ఆరోగ్యంపట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం చంద్రబాబు కనీసం అపాయింట్‌మెంట్‌ కూడా ఇవ్వట్లేదని ఏపీ జేఏసీ అమరావతి అధ్యక్షుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు విమర్శించారు. విశాఖలోని రెవెన్యూ గెస్టుహౌస్‌లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు సీఎంను  అపాయింట్‌మెంటు అడిగినా.. ఇవాళ, రేపు అంటూ కొన్నాళ్లుగా అధికారులు వాయిదా వేస్తున్నారని మండిపడ్డారు. 

తాము పెద్దపెద్ద కోరికలు కోరట్లేదని, ఉద్యోగుల రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ రూ.5 వేల కోట్ల బకాయిల్ని ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్యోగులకు అనేక హామీలు ఇచ్చిందని.. అయినా ప్రభుత్వోద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు మాత్రమే అడుగుతున్నామన్నారు. పీఆర్సీ, ఐఆర్, పాత బకాయిల కోసం ఉద్యోగులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారని, సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమానికి సిద్ధమని బొప్పరాజు హెచ్చరించారు.

పీఆర్సీకి మీనమేషాలు ఎందుకు?
ఇక ఉద్యోగుల బకాయిల్లో కేవలం 10 శాతం మాత్రమే ఇచ్చారని, ప్రభుత్వం ఇంకా నాలుగు డీఏలు బకాయిపడిందన్నారు. పీఆర్సీ కమిషన్‌ వేయడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని బొప్పరాజు ప్రశ్నించారు. వేరే రాష్ట్రాల్లో కోర్టులకు వెళ్లి డీఏ బకాయిలు సాధించుకున్నారని, ప్రభుత్వం మీద గౌరవంతో తాము కోర్టులకు వెళ్లడంలేదన్నారు. 

అలాగే, రిటైర్డ్‌ ఉద్యోగులకే ప్రభుత్వం రూ.ఆరేడు వేల కోట్లు బకాయిలు ఉందని వెల్లడించారు. ఉద్యోగులకు మొత్తంగా రూ.20 వేల కోట్ల వరకు ప్రభుత్వం బకాయి ఉందని.. ఉద్యోగ ఆరోగ్య స్కీం స్కాంగా మారిందని.. ఒక ఉద్యోగి అనారోగ్యానికి గురై చికిత్స కోసం రూ.5 లక్షలు ఖర్చుచేస్తే రూ.90 వేల బిల్లు మంజూరు చేశారని ఆయన అవేదన వ్యక్తంచేశారు. 

ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్నామని, అందులో భాగంగా విశాఖ వచ్చినట్లు బొప్పరాజు చెప్పారు. తమ సమస్యలు పరిష్కారం కాకపోతే ఉద్యమానికి కూడా వెనుకాడబోమన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సత్తి నాగేశ్వరరెడ్డి,  ఏపీ జేఏసీ సెక్రటరీ కేఎన్‌ రావు, అప్పలరావు, డి. వెంకట్రావు, కిరణ్‌కుమార్, రాజేష్, ఏపీ రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement