
వ్యాధి నిర్ధారణ వ్యవస్థ అస్తవ్యస్తం
చంద్రబాబు పాలనలో ప్రజారోగ్యానికి భరోసా కరవు
ప్రభుత్వాస్పత్రుల్లో జరగని రోగ నిర్ధారణ
వైద్య పరీక్షలన్నీ బయటకే రాస్తున్న సిబ్బంది
నిరుపయోగంగా రూ.కోట్లు విలువ చేసే పరికరాలు
ప్రయోగ శాలల్లో రసాయనాల కొరత
సాక్షి, అమరావతి: చంద్రబాబు పాలనలో పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యానికి భరోసా కరవవుతోంది. వైద్య రంగంలో ఏఐ, డిజిటల్ నెర్వ్ సెంటర్‌తో అత్యాధునిక సేవలంటూ ప్రభుత్వం చేస్తున్న హడావుడికి క్షేత్ర స్థాయి పరిస్థితులకు ఏ మాత్రం పొంతన ఉండటం లేదు. ప్రైవేట్‌లో చికిత్సలు చేయించుకునే స్తోమత లేక ప్రభుత్వాస్పత్రులకు వెళితే అక్కడా జేబుకు చిల్లు పడుతోందని రోగులు లబోదిబోమంటున్నారు. చికిత్స సంగతి దేవుడెరుగు రోగనిర్ధాణ దశలోనే ప్రభుత్వాస్పత్రులు చతికిలపడుతున్నాయి.
థైరాయిడ్, హెచ్‌బీఏ1సీ తదితర రక్త పరీక్షలతోపాటు, సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ వంటి ఖరీదైన రోగనిర్ధారణ పరీక్షలు ప్రభుత్వాస్పత్రుల్లో అందుబాటులో ఉండడం లేదు. బయట చేయించుకోవాలని సిబ్బంది సూచిస్తున్నారు. దీంతో రోగులపై వైద్య పరీక్షలకే పెనుభారం పడుతోంది. పరీక్షను బట్టి రూ.500 నుంచి రూ.10 వేలపై వరకు రోగులు సొంత ఖర్చు చేసుకోవాల్సి వస్తోంది. పీహెచ్‌సీ, ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లో రూ. లక్షల నుంచి రూ.కోట్ల విలువ చేసే అధునాతన పరికరాలు ఉన్నా వాటి నిర్వహణ సరిగా లేక నిరుపయోగంగా మారాయి. మైక్రోబయాలజీ ల్యాబ్‌లను రసాయనాల కొరత వేధిస్తోంది.
ఉత్తరాంధ్ర వాసులకు తప్పని అవస్థలు
ఉత్తరాంధ్ర ప్రజలకు అందుబాటులో ఉండే కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్)లో వైద్య పరీక్షలు అరకొరగానే అందుతున్నాయి. ఇక్కడ ఒకే ఎంఆర్‌ఐ పరికరం ఉంది. రోగుల తాకిడి ఎక్కువగా ఉండడంతో అందరికీ ఉచితంగా సేవలు అందడం లేదు. అత్యవసర సమయాల్లో రోగులు బయటే ఎంఆర్‌ఐ స్కాన్ చేయించుకోవాల్సిన దుస్థితి.
డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్మించినా..
ప్రజలకు ఉచితంగా సమగ్ర రోగనిర్ధారణ సేవల కల్పన కోసం గత ప్రభుత్వంలో సిటి డయగ్నోస్టిక్ సెంటర్‌ను విమ్స్ ప్రాంగణంలో నిర్మించారు. నిర్మాణం పూర్తయింది. పరికరాలు సమకూరిస్తే ఖరీదైన వైద్య పరీక్షలు ప్రజలకు అందుతాయి. అయితే కూటమి సర్కారు పట్టించుకోవడం లేదు. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పీహెచ్‌సీ, ఏపీవీవీపీ, డీఎంఈ ఆస్పత్రుల్లో నిర్ధేశించిన మేరకు అన్ని రకాల రోగనిర్ధారణ పరీక్షలు ఎక్కడా అందుబాటులో లేవు. పార్వతీపురం జిల్లా ఆస్పత్రిలో సీటీస్కాన్ పరికరంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సేవలకు ఆటంకం కలుగుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా ఇదే దుస్థితి
⇒ పల్నాడు జిల్లాలోని నరసరావుపేట ఏరియా ఆస్పత్రిలోని ల్యాబ్‌లో థైరాయిడ్, ఇతర రక్త పరీక్షలు చేయడం లేదు. ఈ పరీక్షల కోసం గుంటూరు జీజీహెచ్‌కు వెళ్లాలని సూచిస్తున్నారు. వ్యయప్రయాసలకోర్చి అంత దూరం వెళ్లలేని రోగులు స్థానికంగానే ప్రైవేట్ ల్యాబ్‌లలో డబ్బు పెట్టి పరీక్షలు చేయించుకుంటున్నారు.
⇒ గిద్దలూరు ప్రాంతీయ ఆస్పత్రిలో గత ప్రభుత్వంలో అధునాతన రోగ నిర్ధారణ వనరులతో ఏర్పాటు చేసిన ఐసీహెచ్‌ఎల్ ప్రయోగ శాలలో ఆటోమేటెడ్ బయో కెమిస్ట్రీ అనలైజర్, ఆటోమేటెడ్ హార్మోన్, యూరిన్ అనలైజర్, రియల్ టైం పీసీఆర్ సహా వివిధ రకాల అధునాతన పరికరాలు ఉన్నా.. సిబ్బంది లేకపోవడంతో వైద్య పరీక్షలు చేయడం లేదు.
⇒ దర్శి ప్రభుత్వాస్పత్రిలో ఈఎన్‌టీ, ఆర్ధోపెడిక్ వైద్యులు ఉన్నా పరికరాలు లేక చికిత్స అందడం లేదు. డిజిటల్ ఎక్స్‌రే లేదు.
⇒ నంద్యాల జీజీహెచ్‌లో స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. అ్రల్టాసౌండ్, సీటీ స్కాన్ సేవలు అందడం లేదు.
⇒ ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల సీహెచ్‌సీ ప్రయోగశాలలో సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ల్యాబ్‌కు తాళం పడింది.
⇒ ఏలూరు జీజీహెచ్‌లో థైరాయిడ్, క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల పరీక్షలను ఎక్కువగా బయటకే రాస్తున్నారు.
⇒ నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో స్కానింగ్ పరీక్షలను ఏరోజుకారోజు చేయడం లేదు.శ్లాట్ పద్ధతిలో రెండు, మూడురోజులకు చేస్తున్నారు. ముగ్గురు రేడియాలజిస్ట్‌లు
ఉండాల్సి ఉండగా ఒకరు సెలవులో ఉన్నారు. ఒక్కోరోజు ఒక్కరే ఉంటున్నారు. థైరాయిడ్, లిపిడ్ ప్రొఫైల్ వంటి పరీక్షల నిర్వహణకు రసాయనాల కొరత వేధిస్తోంది.
హెచ్‌బీఏ1సీ పరీక్షలూ చేయడం లేదు.
ఎక్స్‌రే ఫిల్మ్‌లు లేవు
విశాఖపట్నం జిల్లా పద్మనాభం మండలం రేవిడి గ్రామానికి చెందిన కె. సూర్యనారాయణ గత నెలలో భూ తగాదా నేపథ్యంలో ప్రత్యర్థుల దాడిలో గాయపడ్డాడు. గ్రామానికి దగ్గరగా ఉండే విజయనగరం జీజీహెచ్ డెంటల్ విభాగానికి బాధితుడిని కుటుంబ సభ్యులు తీసుకెళ్లారు. వైద్యుడు డెంటల్ ఎక్స్‌రే చేయించాలని సూచించారు. ఫిల్మ్‌లు లేకపోవడంతో ఇక్కడ ఎక్స్‌రే తీయలేమని విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు.
థైరాయిడ్ పరీక్ష కోసం ప్రైవేటు ల్యాబ్‌కు..
నరసరావుపేటకు చెందిన వెంకట లక్ష్మి అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల పట్టణంలోని ఏరియా ఆస్పత్రికి వెళ్లారు. వైద్యులు పలు రకాల పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఆస్పత్రిలోని ల్యాబ్‌కు వెళ్లగా థైరాయిడ్ పరీక్ష అందుబాటులో లేదని సిబ్బంది చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌కు వెళితే అక్కడ ఉచితంగా చేస్తారని సూచించారు. థైరాయిడ్ పరీక్ష కోసం వ్యయప్రయాసలకోర్చి గుంటూరుకు వెళ్లలేక పట్టణంలోని ప్రైవేట్ ల్యాబ్‌లో డబ్బులు కట్టి ఆమె పరీక్ష చేయించుకున్నారు.