
పిఠాపురం: సహజ ప్రసవం (నార్మల్ డెలివరీ) చేసి గర్భిణి ప్రాణాలు తీసేశారంటూ ఆమె బంధువులు మంగళవారం పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. వైద్యురాలు సుజాత నిర్వాకం కారణంగా తమ బిడ్డ చనిపోయిందని ఆరోపించారు. వివరాల్లోకి వెళితే.. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామానికి చెందిన దొండపాటి శ్రీ దుర్గ (25) అనే గర్భిణి పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు పొందుతున్నారు. ఆమె ఈ నెల 13న వైద్య పరీక్షలకు ఆస్పత్రికి రాగా, వైద్యుల సూచన మేరకు డెలివరీ కోసం చేరారు. ఆమెకు డాక్టర్ సుజాత నార్మల్ డెలివరీ చేశారు. పాప పుట్టినప్పటికీ శ్రీదుర్గ అపస్మారకస్థితికి చేరుకుంది. దీంతో వెంటనే అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గుండెకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తడంతో వైద్యులు చికిత్స అందించినప్పటికీ ఆమె 14వ తేదీన మృతి చెందింది. అనంతరం మృతదేహానికి కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు.
స్కానింగ్ రిపోర్టులు పరిశీలించగా..
ఘటన జరిగిన వారం రోజుల తర్వాత శ్రీదుర్గ స్కానింగ్ రిపోర్టులను ఆమె కుటుంబ సభ్యులు వేరే వైద్యులకు చూపించారు. వాటిని పరిశీలించిన వైద్యులు..శ్రీదుర్గ హైరిస్క్ ట్రీట్‌మెంట్ పొందుతోందని, ఆమెకు నార్మల్ డెలివరీ చేయడం రిస్క్ అన్నారు. ఉమ్మనీరు తక్కువగా ఉండడంతో ప్రత్యేక పర్యవేక్షణలో పురుగు పోయాలని చెప్పారు. దీంతో శ్రీదుర్గ కుటుంబ సభ్యులు మంగళవారం పిఠాపురం ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. నార్మల్ డెలివరీ చేయడం వల్లే తమ బిడ్డ చనిపోయిందని, పుట్టిన పాప దివ్యాంగురాలిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని శ్రీదుర్గ తల్లిదండ్రులు దొండపాటి రాజు, సుబ్బారావు ఆరోపించారు. బలవంతంగా డెలివరీ చేయడం వల్ల పుట్టిన బిడ్డ కుడి చేయి, కన్ను పని చేయడం లేదని మృతురాలి సోదరి వేమగిరి సత్యలత తెలిపారు.
ఘటనా స్థలానికి పోలీసులు
పరిస్థితి విషమించడంతో పిఠాపురం ఎస్సైతో పాటు సిబ్బంది ఆస్పత్రికి వచ్చి బాధితులకు నచ్చచెప్పారు. మిగిలిన రోగులు ఇబ్బంది పడతారని ఆందోళన చేయవద్దని సూచించారు. విషయం తెలుసుకున్న గొల్లప్రోలు జెడ్పీటీసీ వులవకాయల నాగలోవరాజు ఆస్పత్రికి చేరుకుని, బాధితుల తరఫున డాక్టర్ సుజాతతో మాట్లాడారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులతో కలసి పాడా పీడీ చైత్ర వర్షిణికి ఫిర్యాదు చేశారు. స్పందించిన పీడీ ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తాన్నారు. కాగా.. డాక్టర్ సుజాత మాట్లాడుతూ గర్భిణి శ్రీదుర్గ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నానన్నారు. అయితే డెలివరీ సమయంలో ఆమె సహకరించలేదన్నారు. వైద్యురాలిగా తనకు 18 ఏళ్ల అనుభవం ఉందని తెలిపారు.