
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆగ్రహం
సాక్షి ప్రతినిధి, తిరుపతి: చంద్రబాబు తన పాలనా వైఫల్యాలు, దుర్మార్గాల నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి లేని లిక్కర్ స్కాంను సృష్టించారని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి మండిపడ్డారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో గంగాధర్ నెల్లూరు వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త కృపాలకిష్‌్మతో కలిసి శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కక్షసాధింపుల కోసమే లిక్కర్ పేరుతో బేతాళ కథను సృష్టించి తప్పుడు కేసులు పెడుతూ వైఎస్సార్ సీపీ నేతలను, మచ్చలేని రిటైర్డ్ అధికారులను అరెస్టు చేసి పైశాచికానందం పొందుతున్నారని నారాయణస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..!
76 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ఉన్న నాపై కూడా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. వృద్ధాప్యం, అనారోగ్యం వల్లే గత ఏడాది ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకున్నా. ఇలాంటి పరిస్థితుల్లోనూ నిన్న సిట్ వాళ్లు వచ్చి దర్యాప్తు పేరిట ఇబ్బంది పెట్టే యత్నం చేశారు. సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకూ సమాధానాలిచ్చా. ఐదేళ్లు ఎక్సైజ్ శాఖ మంత్రిగా చేశా. అన్నీ పారదర్శకంగానే జరిగాయని, ఎక్కడా అవకతవకలకు తావులేదని నేను చెప్పా. కానీ నాపైన ఉన్నవారే అన్ని నిర్ణయాలూ చేశారని నేను చెప్పినట్టు ఎల్లోమీడియాలో అబద్ధపు కథనాలు రాశారు.
నా ఇంటికి సిట్ బృందం వచ్చినప్పటి నుంచి నన్ను అరెస్ట్ చేస్తున్నారని, మా ఇంట్లో ఉన్న డబ్బును లెక్కిస్తున్నారని, ఏదో స్వా«దీనం చేసుకుంటున్నారంటూ గంటగంటకూ విద్వేషపూరిత బ్రేకింగ్‌లు, స్క్రోలింగ్‌లు వేశారు. నాపైన ఎప్పుడూ ఎటువంటి ఆరోపణలూ లేవు. సిట్‌వాళ్లు కొత్తగా కనిపెట్టిందేమీ లేదు. అయినా ఎల్లో మీడియా కథనాలు రాస్తోంది. వాటినే సిట్ చార్జిషీట్లలో పేర్కొనడం చూస్తున్నాం. ఈ లిక్కర్ వ్యవహారం ఓ అక్రమ కేసని తేల్చిచెప్పడానికి ఇంతకన్నా రుజువులు అనవసరం.
నాకు ల్యాప్‌ట్యాప్ వాడకమే తెలియదు..
నాకు ల్యాప్‌ట్యాప్ లేదు. అయినా సిట్ వాళ్లు ల్యాప్‌ట్యాప్ స్వాధీనం చేసుకున్నట్టు ఎల్లో మీడియా తప్పుడు రాతలు రాసింది. నాకు ల్యాప్‌ట్యాప్ వాడడం కూడా తెలియదు. లేని ల్యాప్‌ట్యాప్‌ను ఎలా స్వాదీనం చేసుకుంటారు? సిట్ వాళ్లు నా ఫోన్ను తీసుకున్నారని కూడా రాశారు. ఫోన్ తీసుకుని వారేం చేస్తారు? ఏదో జరుగుతుందని ప్రజలను నమ్మించేందుకు ఎల్లోమీడియా, టీడీపీ పడరాని పాట్లు పడుతున్నాయి. మా ప్రభుత్వంలో లిక్కర్ వినియోగాన్ని తగ్గించాం.
ప్రభుత్వ షాపులుపెట్టి మాఫియాను అరికట్టాం. పారదర్శకంగా మద్యం పాలసీని అమలు చేశాం. ఫలితంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, 2014–19తో పోలిస్తే పెరిగింది. మద్యం దుకాణాలను ప్రభుత్వమే లాభాపేక్ష లేకుండా నడిపినప్పుడు అక్రమాలకు తావెక్కడ? మాపై చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలే. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో మద్యంలో భారీ అవినీతికి పాల్పడ్డారు.
ఇప్పుడు కూడా మద్యం పాలసీ పేరిట దోచుకుతింటున్నారు. 2014–19 మధ్య చంద్రబాబు ప్రివిలేజ్ ఫీజులను రద్దుచేసి, అధికార దుర్వినియోగం చేసి, రూ.5 వేల కోట్లకు పైగా ప్రభుత్వానికి నష్టం చేకూర్చారు. దీనిపై మా ప్రభుత్వ హయాంలో కేసూ నమోదైంది. ఆ కేసులో చంద్రబాబు బెయిల్‌పై ఉన్నారు. దాన్ని కప్పిపుచ్చడానికి మాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.