‘డిజిటల్‌’లో బాలల భద్రతకు సమష్టి కృషి | NALSA conference on cybercrimes against children begins in Hyderabad | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌’లో బాలల భద్రతకు సమష్టి కృషి

Oct 4 2026 5:35 AM | Updated on Oct 4 2026 5:35 AM

NALSA conference on cybercrimes against children begins in Hyderabad

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పిలుపు

హైదరాబాద్‌లో చిన్నారులపై సైబర్‌ నేరాలపై ‘నల్సా’ సదస్సు ప్రారంభం

పాల్గొన్న సుప్రీంకోర్టు, పలు హైకోర్టుల న్యాయమూర్తులు

సాక్షి, హైదరాబాద్‌: డిజిటల్‌ యుగంలో చిన్నారుల భద్రతకు కుటుంబాలు, పాఠశాలలు, ప్రభుత్వ సంస్థలు, న్యాయ సేవా సంస్థలు, టెక్నాలజీ సంస్థలు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నేషనల్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ పిలుపునిచ్చారు. చిన్నారులపై సైబర్‌ వేధింపులు, ఆన్‌లైన్‌ బెట్టింగ్, లైంగిక వేధింపులు, బ్లాక్‌మెయిల్‌ వంటి ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో వారికి సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. 

‘పిల్లలు తమపై జరిగిన వేధింపులను వెల్లడించినప్పుడు మొదటి స్పందన అత్యంత కీలకం. ఓపికగా వినాలి.. గౌరవంగా చూడాలి. ఇకపై ఏం జరుగుతుందో వారికి అర్థమయ్యే భాషలో వివరించాలి’ అని చెప్పారు. సైబర్‌ ప్రపంచంలో పిల్లలపై జరుగుతున్న లైంగిక దోపిడీని అరికట్టడం, బాలల హక్కులకు రక్షణ కల్పించడం, వారికి స్నేహపూర్వక న్యాయవ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా నల్సా నిర్వహిస్తున్న దక్షిణ ప్రాంతీయ సదస్సు శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (టీఎస్‌ఎల్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో రెండు రోజులపాటు ఈ సదస్సు జరగనుంది. 

ప్రారంభ కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విక్రమ్‌నాథ్, జస్టిస్‌ పమిడిఘంటం శ్రీ నరసింహా, జస్టిస్‌ ఆర్‌.మహదేవన్, జస్టిస్‌ అలోక్‌ అరాధే, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అపరేశ్‌కుమార్‌ సింగ్, ఆ రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ జస్టిస్‌ శామ్‌ కోషి, కేంద్ర న్యా­య మంత్రి అర్జున్‌ మేఘ్‌వాల్, తెలంగాణ సీఎం ఎ.రేవంత్‌రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు తదితరులు పాల్గొన్నారు. 

వారి స్వేచ్ఛకు భద్రత కల్పించాలి: జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌ 
కవయిత్రి సరోజినీ నాయుడు రచించిన ‘టు మై చిల్ర్డన్‌’కవితలోని భావాల ప్రకారం.. ప్రతి తల్లీదండ్రి కోరుకునేది పిల్లలు నవ్వుతూ, బాధలకు దూరంగా ఎదగడమే. పిల్లలకు నేర్చుకునే, ఆడుకునే ప్రపంచాన్ని భయం లేకుండా అన్వేషించే స్వేచ్ఛ ఉండాలి. ఆ స్వేచ్ఛకు భద్రత కల్పించడం సమాజం బాధ్యత. సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ యాప్స్, ఆన్‌లైన్‌ గేమ్స్‌ పిల్లల జీవితంలో భాగమయ్యాయి. వాటి ద్వారా విద్య, స్నేహం వంటి ప్రయోజనాలతోపాటు అనేక ప్రమాదాలు కూడా ఎదురవుతున్నాయి. 

ఆన్‌లైన్‌ బెట్టింగ్, సైబర్‌ మోసాలు, లైంగిక వేధింపులు చిన్నారులను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. నకిలీ ప్రొఫైళ్ల ద్వారా పిల్లలతో పరిచయం పెంచుకుని లైంగికంగా వేధించడం, వ్యక్తిగత ఫొటోలు పంపేలా ఒత్తిడి చేయడం, అనంతరం వాటితో బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటి ఘటనలు ఆందోళనకరం. కృత్రిమ మేధ (ఏఐ) విస్తృత వినియోగం కూడా బాలల భద్రతకు కొత్త సవాళ్లు విసురుతోంది. 

చిన్నారుల సాధారణ ఫొటోలను మార్ఫింగ్‌ చేసి లైంగికంగా అసభ్యకరమైన నకిలీ చిత్రాలుగా రూపొందించడం, వాటిని సోషల్‌ మీడియా, మెసేజింగ్‌ గ్రూపుల్లో ప్రచారం చేయడం లేదా బ్లాక్‌మెయిల్‌కు ఉపయోగిస్తున్నారు. ఇలాంటి ఘటనలతో పిల్లల చదువు, ఆత్మవిశ్వాసం దెబ్బతినడంతోపాటు వారు ఇతరులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. పిల్లలు బెదిరింపు సందేశాలు వచ్చినప్పుడు భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పేలా ప్రోత్సహించాలి. లైంగిక బ్లాక్‌మెయిల్‌కు గురైన చిన్నారి.. ధైర్యంగా తమ సమస్యను చెప్పుకునే వ్యవస్థ అవసరం. 

పిల్లలే అత్యంత విలువైన ‘ఆస్తి’: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ పీఎస్‌ నరసింహా
ఆధునిక జీవన విధానం, పని ఒత్తిళ్లు, సైబర్‌ ప్రపంచం కారణంగా తల్లిదండ్రులు పిల్లలకు తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. మానవ సమాజానికి అత్యంత విలువైన ఆస్తి పిల్లలే. అయితే, ఈ విషయాన్ని మన నాగరికత, సంస్కృతి తగినంత ప్రాధాన్యంతో గుర్తించలేదు. దేశ భవిష్యత్తును భద్రపరచాలంటే ముందుగా పిల్లల భవిష్యత్తును భద్రపరచాలి. తల్లిదండ్రులు పిల్లలతో గడపాల్సిన సమయాన్ని కూడా సైబర్‌ ప్రపంచమే ఆక్రమిస్తోంది. చిన్నారుల సంక్షేమానికి ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.

బాలలకు ఉచిత న్యాయసేవలు: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ అలోక్‌ అరాధే
డిజిటల్‌ వాతావరణంలో పిల్లలను రక్షించడం కేవలం విధానపరమైన అంశం కాదు. అది రాజ్యాంగపరమైన బాధ్యత. సంప్రదాయ నేరాలకు భిన్నంగా ఆన్‌లైన్‌ లైంగిక నేరాల్లో అజ్ఞాత ఖాతాలు, ఎన్‌క్రిప్టెడ్‌ సందేశాలు, వివిధ డిజిటల్‌ వేదికలు, వేర్వేరు దేశాలు లేదా న్యాయ పరిధులు దాటి పనిచేసే నిందితులు ఉండే అవకాశం ఉంది. డిజిటల్‌ ఆధారాలను తొలగించడం లేదా మార్చడం సాధ్యమవుతున్నందున వాటిని సరైన విధానంలో భద్రపరచడం, పరిశీలించడం, విశ్లేషించడం అత్యంత కీలకం. బాలలకు ఉచిత న్యాయ సేవలు అందించడం చట్టబద్ధ హక్కు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement