డయాఫ్రం వాల్‌ నాణ్యత బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే | Ministry Of Jal Shakti Says Polavaram Diaphragm wall quality responsibility AP Govt | Sakshi
Sakshi News home page

డయాఫ్రం వాల్‌ నాణ్యత బాధ్యత ఏపీ ప్రభుత్వానిదే

Jan 30 2025 4:18 AM | Updated on Jan 30 2025 4:18 AM

Ministry Of Jal Shakti Says Polavaram Diaphragm wall quality responsibility AP Govt

వాల్‌ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారో నివేదికలో స్పష్టం చేయండి

రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిన కేంద్ర జల సంఘం

సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు ప్రధాన (ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌) డ్యామ్‌ గ్యాప్‌–2లో కొత్తగా నిర్మిస్తున్న డయాఫ్రం వాల్‌ నాణ్యత బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తేల్చిచెప్పింది. తాము ఆమోదించిన విధానం, నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం డయాఫ్రం వాల్‌ నిర్మిస్తున్నారా? లేదా? అన్నది నిర్ధారించాల్సిన బాధ్యత పీపీఏ (పోలవరం ప్రాజెక్టు అథారిటీ)దేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం, పీపీఏకు బుధవారం సీడబ్ల్యూసీ డైరెక్టర్‌ రాకేశ్‌ టొతేజా లేఖ రాశారు. 

పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్‌ గ్యాప్‌–2లో దెబ్బతిన్న డయాఫ్రం వాల్‌కు 6 మీటర్ల ఎగువన 1.5 మీటర్ల మందం, 1,396.6 మీటర్ల పొడవుతో కొత్త డయాఫ్రం వాల్‌ డిజైన్‌.. నిర్మించే విధానంపై డిసెంబర్‌ 26న సీడబ్ల్యూసీకి పోలవరం ప్రాజెక్టు సీఈ నివేదిక ఇచ్చారు. దీనిపై అంతర్జాతీయ నిపుణుల కమిటీ(పీవోఈ)తో సీడబ్ల్యూసీ డిజైన్స్‌ సీఈ విజయ్‌శరణ్‌ ఈ నెల 9న ఒకసారి.. 15న రెండోసారి.. 17న మూడోసారి సమీక్షించారు. ఈ సమీక్షల్లో వెల్లడైన అంశాల ఆధారంగా డయాఫ్రం వాల్‌ నిర్మించే విధానంలో లోపాలు ఎత్తిచూపుతూ.. వాటిని అధిగమించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వివరిస్తూ నివేదిక ఇవ్వాలని పోలవరం సీఈని ఆదేశించారు.  


సీడబ్ల్యూసీ లేఖలో ప్రధానాంశాలివీ 
డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో వినియోగించే టీ–16 కాంక్రీట్‌ మిశ్రమం ఆమోదించిన ప్రమాణాల ప్రకారం బలంగా, ధృడంగా, సీపేజీని సమర్థవంతంగా అడ్డుకుంటుందా లేదా అన్నది నిర్ధారించడానికి ఎలాంటి పరీక్షలు చేస్తారో నివేదికలో పేర్కొనాలి. ప్లాసిŠట్‌క్‌ కాంక్రీట్‌ నాణ్యతను నిర్ధారించడానికి మూడంచెల నాణ్యత నియంత్రణ విధానం ఉండాలి. ఆ విధానాన్ని ఎలా ఏర్పాటు చేస్తారనే అంశంపై నివేదిక ఇవ్వాలి. 

⇒ డయాఫ్రం వాల్‌ నిర్మాణం కోసం ట్రెంచ్‌ కట్టర్, గ్రాబర్‌తో భూమిని తవ్వుతూ.. ఖాళీ ప్రదేశంలోకి బెంటనైట్‌ మిశ్రమాన్ని నింపుతూ రాతిపొర తగిలే వరకూ ప్యానల్‌ను దించుతూ పోతారు. రాతి పొర తగిలాక.. కఠిన శిల(హార్డ్‌ రాక్‌)లోకి ఎగువ మొన నుంచి ఏకీకృత రీతిలో రెండు మీటర్ల లోతు వరకూ ప్యానల్‌ను దించాలి. ఆ తర్వాత ఎలాంటి అవాంతరాలు లేకుండా 12 గంటల్లోగా ప్లాస్టిక్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్ని పోయాలి.  

⇒ కఠిన శిల ఫర్మియబులిటీ, సీపేజీపై పరీక్షలు నిర్వహించాలి. పరిమితి కంటే ఎక్కువ సీపేజీ ఉన్నట్టు ఆ పరీక్షల్లో వెల్లడైతే.. దాన్ని అరికట్టడానికి గ్రౌటింగ్‌ (అధిక ఒత్తిడితో సిమెంట్‌ను రాతి పొరల్లోకి పంపడం) చేసే విధానాన్ని ఖరారు చేయాలి. 
⇒ డయాఫ్రం వాల్‌ నిర్మాణంలో ఒక ప్యానల్‌కూ మరో ప్యానల్‌ మధ్య జాయింట్లు సక్రమంగా ఉన్నాయా.. లేదా.. అన్నది నిర్ధారించాలి. 

⇒ పాత డయాఫ్రం వాల్‌ నిర్మించే సమయంలో అధిక ఒత్తిడితో ప్లాసిŠట్‌క్‌ కాంక్రీట్‌ మిశ్రమాన్ని పంపినప్పుడు విచలనం, భ్రమణానికి గురవడం వల్ల డయాఫ్రం వాల్‌ మందం 0.3 శాతం అంటే 4.5 సెంటీమీటర్లు తగ్గింది. ఇప్పుడు నిర్మిస్తున్న డయాఫ్రం వాల్‌ మందం 0.5 శాతం అంటే 7.5 సెంటీమీటర్లు తగ్గుతుందని నివేదికలో పేర్కొన్నారు. అప్పటికీ.. ఇప్పటికీ మందం తగ్గడానికి కారణాలు ఏమిటన్నది సవివరంగా నివేదిక ఇవ్వాలి. 

⇒ డయాఫ్రం వాల్‌ నిర్మాణం పూర్తయ్యాక.. ప్రధాన డ్యామ్‌ నిర్మాణ సమయంలో ఎగువ భాగం కొంత తొలగిస్తారు. అలా తొలగించే సమయంలో డయాఫ్రం వాల్‌ దెబ్బతినకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది నివేదికలో స్పష్టం చేయాలి. 
⇒ ప్రాజెక్టు పనులను రోజూవారీ, నెలవారీ సమీక్షిస్తూ.. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనులు చేస్తున్నారా? లేదా అన్నది పీపీఏ నివేదిక ఇవ్వాలి.      

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement