
సాక్షి, అమరావతి: ప్రభుత్వాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే సహించలేని స్థితిలో ఉన్న సీఎం చంద్రబాబు దానిని కట్టడి చేసేందుకు మంత్రుల బృందంతో కూడిన కమిటీని సిద్ధం చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.
మానవ వనరులు, ఐటీ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాలు, సమాచార శాఖ, హోం శాఖ మంత్రులతో కూడిన బృందాన్ని కమిటీగా ఏర్పాటు చేశారు. కమిటీ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి సమాచార శాఖ డైరెక్టర్ ఈ బృందానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. కమిటీ ఎవరైనా నిపుణుల సహాయం తీసుకోవచ్చు.
మంత్రుల బృందం బాధ్యతలివీ
» దేశంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు వర్తించే ప్రస్తుత చట్టాలు, నియమాలు, మార్గదర్శకాలను సమీక్షించాలి.
» జవాబుదారీతనం, సమ్మతి అమలులో అంతరాలను గుర్తించాలి.
» అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను అధ్యయనం చేయాలి. పారదర్శకత ప్రమాణాలు, ప్లాట్‌ఫామ్ బాధ్యతలు, వినియోగదారుల రక్షణ చర్యలతో సహా సోషల్ మీడియా జవాబుదారీతనానికి ప్రపంచ విధానాలను విశ్లేషించాలి.
» హానికరమైన కంటెంట్, తప్పుడు సమాచారం, ఆన్‌లైన్ దుర్వినియోగం, జాతీయ భద్రతకు ముప్పు తదితర అంశాలకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లు జవాబుదారీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సిఫార్సులు చేయాలి.
» ఫిర్యాదుల పరిష్కారం, నివేదించే విధానాలపై స్పష్టమైన బాధ్యతలను సూచించాలి. పౌర హక్కులను కాపాడటంపై సలహా ఇవ్వాలి.
» నిరంతర పర్యవేక్షణ కోసం నోడల్ ఏజెన్సీలు లేదా స్వతంత్ర పర్యవేక్షణ సంస్థలను సృష్టించడం లేదా బలోపేతం కోసం సిఫార్సు చేయాలి.
» నిర్ణయం తీసుకోవడానికి వీలుగా మంత్రుల బృందం తమ సిఫార్సులను ప్రభుత్వానికి త్వరగా సమర్పించాలి.