మీ బాధలు వినడం మా పని కాదు | Minister Satyakumar warns women CHOs | Sakshi
Sakshi News home page

మీ బాధలు వినడం మా పని కాదు

May 4 2025 5:12 AM | Updated on May 4 2025 10:49 AM

Minister Satyakumar warns women CHOs

వేలు చూపిస్తూ కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లకు వార్నింగ్‌ ఇస్తున్న మంత్రి సత్యకుమార్‌

మహిళా సీహెచ్‌వోలను హెచ్చరించిన మంత్రి సత్యకుమార్‌

సాక్షి, అమరావతి/నెల్లూరు(అర్బన్‌): సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన మహిళా కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల(సీహెచ్‌వో)పై వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ జులుం ప్రదర్శించారు. ‘మీ బాధలు వినడం మా పని కాదు’ అంటూ చిందులు తొక్కారు. సమ్మె విరమించి వెంటనే విధుల్లో చేరకపోతే ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరించారు. గ్రామాల్లో విలేజ్‌ క్లినిక్స్‌ ద్వారా ప్రజలకు వైద్య సేవలందించే సీహెచ్‌వోలు తమను రెగ్యులర్‌ చేయాలని, ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతనాలు పెంచాలని, సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టారు. ఈ నేపథ్యంలో శనివారం నెల్లూరు పర్యటనకు వెళ్లిన మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌కు తమ గోడు చెప్పుకోవడానికి మహిళా సీహెచ్‌వోలు ఆయనను కలిశారు.

వినతిపత్రం అందజేసిన సీహెచ్‌వోలకు సమస్యలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మిమ్మల్నెవరు లోనికి రానిచ్చారు’ అంటూ రెచ్చిపోయారు. అందరూ వెంటనే సమ్మె విరమించి విధులకు హాజరు కావాలని హుకుం జారీ చేశారు. లేదంటే ఏఎన్‌ఎంలతో విలేజ్‌ క్లినిక్‌లు నడుపుకుంటామన్నారు. సీహెచ్‌వోలందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తే ప్రభుత్వానికి రూ.500 కోట్ల భారం తగ్గుతుందన్నారు. ఓ వైపు బెదిరింపు ధోరణితో మాట్లాడుతూనే మీ పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్‌ చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

కంగుతిన్న సీహెచ్‌ఓలు ‘సార్‌.. మా బాధలు ఒక్కసారి చెప్పుకోనివ్వండి’ అని బతిమాలుకున్నా మంత్రి వినలేదు. ‘యూనియన్లు పెట్టుకుని వంద మందిని చెడగొడతారు’ అంటూ వారిని కసురుకున్నారు. దీంతో ప్రభుత్వం ఇస్తున్న వేతనాలు కుటుంబ ఖర్చులు, పిల్లల పోషణకు చాలడం లేదని, జీవన వ్యయం పెరిగి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీహెచ్‌వోలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ సమస్యల్ని అర్థం చేసుకోవాలని మంత్రిని సీహెచ్‌వోలు అభ్యరి్థంచగా.. వారి ఆవేదనను చెవికి ఎక్కించుకోలేదు.

నోరు, కళ్లు మూసుకుని సీహెచ్‌వోల వినూత్న నిరసన 
చిలకలపూడి (మచిలీపట్నం): ఆయుష్మాన్‌ భారత్‌లో కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు (సీహెచ్‌వో)గా పనిచేస్తున్న తమ సమస్యలపై సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ స్పందించాలని కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్ల సంఘ నాయకుడు వి.నాగబాబు డిమాండ్‌ చేశారు. కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ధర్నా చౌక్‌ వద్ద కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్లు చేస్తున్న శాంతియుత నిరసన శనివారం ఆరో రోజూ కొనసాగింది. వారంతా నోరు, కళ్లు మూసుకుని వినూత్నంగా నిరసన తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement