లోకేశ్‌ శాఖ అక్రమాలపై పవన్‌ ప్రశ్నించరా? | Margani Bharat Fires on Nara Lokesh over Mega DSC | Sakshi
Sakshi News home page

లోకేశ్‌ శాఖ అక్రమాలపై పవన్‌ ప్రశ్నించరా?

May 27 2026 3:20 AM | Updated on May 27 2026 3:20 AM

Margani Bharat Fires on Nara Lokesh over Mega DSC

ఒక్కో పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నారు  

వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి భరత్‌  

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రశ్నిస్తా అంటూ పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌.. విద్యాశాఖ మంత్రి లోకేశ్‌ శాఖలో జరిగిన డీఎస్సీ అక్రమాలపై ఎందుకు మౌనం వహిస్తున్నారని మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్‌ నిలదీశారు. మెగా డీఎస్సీ పేరుతో రాష్ట్రంలో భారీ స్కామ్‌ జరిగిందని, ఒక్కో టీచర్‌ పోస్టును రూ.15 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందని చెప్పా­రు. ప్రశ్నాపత్రాల లీకేజీ నుంచి మెరిట్‌ లిస్ట్‌ దాచి­పెట్టడం వరకు మొత్తం నియామక ప్రక్రియపై సిట్టింగ్‌ జడ్జితో విచారణగానీ, సీబీఐతో దర్యాప్తుగానీ జరిపించాలని డిమాండ్‌ చేశారు.

ఆయన మంగళవారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడారు. డీఎస్సీ–2025 పరీక్ష రాసే వ్యక్తికే ప్రశ్నాపత్రాల తయారీ బాధ్యతలు అప్పగించారని చెప్పారు. ప్రశ్నాపత్రాలు లీకైన తర్వాత కూడా ఆ ఉద్యోగిని ఎందుకు సస్పెండ్‌ చేయలేదని, ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఎలాంటి సిఫార్సులు లేకుండా ప్రతిభ ఆధారంగా 1.20 లక్షల సచివా­లయ ఉద్యోగాలు ఇచ్చిందని గుర్తుచేశారు. 

గోదావరి కలుషితం కాకుండా వైఎస్‌ జగన్‌ చర్యలు 
గోదావరి కలుషితం కాకుండా ఉండాలని గతంలో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రూ.756 కోట్లతో డీపీఆర్‌ రూపొందించి కేంద్రానికి పంపిందని చెప్పారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకా­వత్‌ ద్వారా ఏఆర్‌సీపీ స్కీమ్‌లో రూ.88 కోట్లు తీసుకొచి్చ­నట్లు తెలిపారు. పేపర్‌ మిల్లు నుంచి వచ్చే కలుషిత నీటిని పూర్తిగా శుద్ధిచేసిన తర్వాతే గోదావరి­లో వదలాల్సి ఉందన్నారు.

తమ హయాంలో సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ (ఎస్టీపీ) పనులు 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు. కానీ ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కమీషన్ల కోసం కాంట్రాక్టర్‌ను బెదిరించి పనులు ఆపేశారని విమర్శించారు. ట్రీట్‌మెంట్‌ పేరుతో రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతూ నేరుగా కలుషిత నీటిని గోదావరిలోకి వదులుతున్నారన్నారు. దీంతో ప్రజల్లో కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు పెరుగుతున్నాయని చెప్పారు. పవన్‌కళ్యాణ్‌ ఎస్టీపీ చానల్‌ను పరిశీలించి అక్కడ జరుగుతున్న అక్రమాలను బయటపెట్టాలని సూచించారు.

ఇసుక మాఫియా అక్రమాలకు అంతేలేదు 
రాజమహేంద్రవరంలో ఇసుక మాఫియా అక్రమాలకు అంతే లేకుండా పోయిందని చెప్పారు. గ్యా­మన్‌ ఇండియా బ్రిడ్జిని రాజమహేంద్రవరం సిటీ, రూరల్‌ ఎమ్మెల్యేలు పంచుకున్నట్టుగా వ్యవహరిస్తున్నారన్నారు. బ్రిడ్జి స్తంభాల వద్ద విపరీతంగా ఇసుక తవ్వేస్తున్నారని చెప్పారు. ఇక్కడ ఇసుక మాఫియా, మట్టి మాఫి­యా, చిట్టీల మాఫియా రెచ్చిపోతున్నాయని తెలి­పారు. గ్యామన్‌ ఇండియా బ్రిడ్జి వద్ద జరుగుతున్న ఇసుక దోపిడీ, పేపర్‌ మిల్లు కాలుష్యంపై పవన్‌కళ్యాణ్‌ రివ్యూ చేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement