ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ వల.. లాంగ్‌ డ్రైవ్‌ పేరుతో కిడ్నాప్‌

Man Take The Girl To Long Drive Kidnap Her In East Godavari Police Arrest - Sakshi

రాజమహేంద్రవరం: ఓ యువతితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకుని, ప్రేమిస్తున్నానని చెప్పి నమ్మించి, పథకం ప్రకారం బయటకు తీసుకువెళ్లి కిడ్నాప్‌ చేసిన నిందితుడిని పోలీసులు కటకటాల్లోకి నెట్టారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీస్‌ జిల్లా కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఈ వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. రాజానగరం మండలం తోకాడకు చెందిన ఓ యువతితో భీమవరం సమీపంలోని కొత్త పూసలమర్రుకు చెందిన మోకా ఫణీంద్ర ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం పెంచుకున్నాడు.

ఆమెతో చాటింగ్‌ ప్రారంభించాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ నెల 15న లాంగ్‌ డ్రైవ్‌కి తీసుకువెళ్తానని చెప్పి ఫణీంద్ర.. రాజానగరం వచ్చాడు. ఆ యువతిని తన బైక్‌పై ఎక్కించుకుని, భీమవరం సమీపంలోని బలుసుమూడి 31వ వార్డులోని ఒక ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమె బంగారు చైన్, చెవి దిద్దులు తీసుకున్నాడు. తర్వాత ఆమె కాళ్లు, చేతులు కట్టేసి కొట్టి గాయపర్చాడు. అనంతరం ఆమె తండ్రికి ఫోన్‌ చేశాడు.

అతడి కూతురిని కిడ్నాప్‌ చేశానని, రూ.5 లక్షలు ఇస్తేనే వదిలిపెడతానని, లేకుంటే చంపేస్తానని బెదిరించాడు. దీంతో ఆందోళన చెందిన యువతి తల్లిదండ్రులు వెంటనే రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు అప్రమత్తమై ఎనిమిది బృందాలుగా ఏర్పడి, కేసు దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువతిని కిడ్నాపర్‌ ఫణీంద్ర అదే ఇంట్లో ఉంచి ఈ నెల 16న తాళం వేసి, బయటకు వెళ్లిపోయాడు.

ఇంట్లోనే బందీగా ఉన్న ఆ యువతి ఇంటి తలుపును గట్టిగా బాదింది. దీనిని గమనించిన స్థానికులు బలుసుమూడి 31వ వార్డు మహిళా పోలీసు గంగాభవానీకి సమాచారం అందించారు. ఆమె ఈ విషయాన్ని అక్కడి టూ టౌన్‌ పోలీసులకు తెలపడంతో వారు వెంటనే అక్కడకు చేరుకున్నారు. ఇంట్లోకి ప్రవేశించి, యువతిని రక్షించారు. రాజమహేంద్రవరం అర్బన్‌ పోలీసులకు సమాచారం తెలిపారు. దీంతో వారు కిడ్నాపర్‌ ఫణీంద్రను అరెస్టు చేశారు. ఈ కేసులో చాకచక్యంగా వ్యవహరించిన బలుసుమూడి 31వ వార్డు మహిళా పోలీస్‌ గంగాభవానీని ఎస్పీ ప్రశంసాపత్రం, నగదు, మెమెంటో, శాలువాతో సత్కరించారు.
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top