తనికెళ్ల భరణికి ‘లోక్‌నాయక్‌’ పురస్కారం

Lok Nayak award for Tanikella Bharani - Sakshi

నేడు విశాఖ కళాభారతిలో ప్రదానం

ఏయూ క్యాంపస్‌: లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ వార్షిక సాహిత్య పురస్కారాన్ని ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత తనికెళ్ల భరణికి ప్రదానం చేయనున్నట్లు ఫౌండేషన్‌ నిర్వాహకుడు, ఏపీ అధికార భాషా సంఘం చైర్మన్‌ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తెలిపారు. విశాఖపట్నంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సోమవారం సాయంత్రం కళాభారతిలో లోక్‌నాయక్‌ ఫౌండేషన్‌ వార్షిక సాహిత్య పురస్కారాల ప్రదానోత్సవ సభ నిర్వహిస్తామని చెప్పారు.

ఈ సభలో తనికెళ్ల భరణికి పురస్కారం, రూ.2లక్షలు నగదు బహుమతి అందిస్తామని వివరించారు. తెలుగు సంస్కృతి, భాష, సాహిత్య రంగాలకు విశేష సేవలు అందిస్తున్న వ్యక్తులకు 18 ఏళ్లుగా ఈ పురస్కారాన్ని అందిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా మాజీ సీఎం ఎన్టీ రామారావు శత జయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి తుది వరకు వెన్నంటి ఉన్న వ్యక్తులను కూడా గౌరవిస్తూ సన్మానిస్తామని చెప్పారు.

ఎన్టీఆర్‌కు ప్రత్యేక అధికారిగా పనిచేసిన జి.రామచంద్రరావు, వ్యక్తిగత సహాయకుడు మోహన్, భద్రతాధికారి కృష్ణారావు, కారు డ్రైవర్‌ లక్ష్మణ్‌ను సన్మానించి రూ.లక్ష చొప్పున నగదు బహుమతి అందజేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మిజోరం గవర్నర్‌ డాక్టర్‌ కంభంపాటి హరిబాబు, అతిథులుగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్, సినీనటుడు మోహన్‌బాబు, లోక్‌సత్తా వ్యవస్థాపకుడు డాక్టర్‌ ఎన్‌.జయప్రకాష్‌ నారాయణ, విజ్ఞాన్‌ విద్యా సంస్థల కార్యదర్శి లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు హాజరవుతారని తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top