ఉపాధి, ఉద్యోగ కల్పనకు లైఫ్‌ స్కిల్స్‌ కోర్సులు

Life skills courses for employment and job creation - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిగ్రీ కాలేజీల్లో విద్యార్థులు తమ చదువులు ముగించుకుని బయటకు రాగానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కించుకునేలా స్కిల్‌ డెవలప్‌మెంట్, లైఫ్‌ స్కిల్స్‌ కోర్సులకు విద్యాశాఖ శ్రీకారం చుడుతోంది. సంప్రదాయ డిగ్రీ కోర్సులైన బీఏ, బీకాం, బీఎస్సీ విద్యార్థులు తప్పనిసరిగా ఈ స్కిల్‌ డెవలప్‌మెంట్, లైఫ్‌ స్కిల్స్‌ కోర్సులను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

నూతన జాతీయ విద్యావిధానం ప్రకారం.. కొత్తగా 17 రకాల స్కిల్‌ డెవలప్‌మెంట్, లైఫ్‌ స్కిల్స్‌ అంశాలను కాలేజీ విద్యా విభాగం గుర్తించింది. వీటి సిలబస్‌తో పుస్తకాలను అందుబాటులోకి తెచ్చేందుకు కాలేజీ విద్య కమిషనర్‌ పోలా భాస్కర్‌ సన్నాహాలు చేపట్టారు. విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కేలా ఇప్పటికే అనేక కార్యక్రమాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. జవహర్‌ నాలెడ్జి సెంటర్ల (జేకేసీ) ద్వారా నిర్వహించిన పలు క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్లలో వేలాది మందికి అవకాశాలు దక్కాయి. 

లైఫ్‌ స్కిల్స్‌లో 4 కోర్సులు
కాగా స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో 13 కోర్సులు, లైఫ్‌ స్కిల్స్‌ విభాగంలో 4 కోర్సులను రూపొందించారు. లైఫ్‌ స్కిల్స్‌ కోర్సుల విభాగంలో.. హ్యూమన్‌ వ్యాల్యూ­స్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎథిక్స్, ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూ­నికేషన్‌ టెక్నాలజీ, ఎనలిటికల్‌ స్కిల్స్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ ఉన్నాయి. లైఫ్‌ స్కిల్స్‌ కోర్సులు అందరు విద్యార్థులకు ఒకే రకంగా ఉంటాయి.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌లో 13 కోర్సులు..
ఇందులో మూడు విభాగాలుగా కోర్సులను ప్రవేశపెడుతున్నారు. స్ట్రీమ్‌–ఏ ఆర్ట్స్‌ విభాగంలో టూరిజం గైడెన్స్, సర్వే అండ్‌ రిపోర్టింగ్, సోషల్‌ వర్క్‌ మెథడ్స్, ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌ ఉన్నాయి. అలాగే స్ట్రీమ్‌–బీ కామర్స్‌ విభాగంలో ఇన్సూరెన్స్‌ ప్రమోషన్, బిజినెస్‌ కమ్యూనికేషన్, లాజిస్టిక్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, రిటైలింగ్‌ కోర్సులు ఉన్నాయి. స్ట్రీమ్‌–సీ సైన్స్‌ విభాగంలో ఎలక్ట్రికల్‌ అప్లయెన్సెస్, ప్లాంట్‌ నర్సరీ, సోలార్‌ ఎనర్జీ, డెయిరీ టెక్నిక్స్, పౌల్ట్రీ ఫార్మింగ్‌ ఉన్నాయి. వీటిలో సెమిస్టర్ల వారీగా ఆయా అంశాలను విద్యార్థులు ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

విద్యార్థులను అన్ని విధాలుగా తీర్చిదిద్దేలా..
డిగ్రీ కాలేజీల్లో ఉన్నత ప్రమాణాలు నెలకొనేలా ప్రభుత్వం ఇప్పటికే అనేక సంస్కరణలను చేపట్టింది. జాబ్‌ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలు, పరిజ్ఞానం విద్యార్థులకు అందేలా చర్యలు తీసుకుంది. ఇప్పటికే జాబ్‌ ఓరియెంటెడ్‌ కోర్సులను ప్రవేశపెట్టింది. క్లౌడ్‌ కంప్యూటింగ్, ఆక్వాకల్చర్‌ వంటివి వీటిలో ఉన్నాయి.

ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి కూడా అధ్యయనం చేసేందుకు వీలుగా లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఎల్‌ఎంఎస్‌)ను అందుబాటులోకి తెచ్చింది. దీనిలో 700 వీడియో పాఠాలను అప్‌లోడ్‌ చేయించింది. విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ నైపుణ్యాన్ని పెంచేందుకు ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ ల్యాబ్స్‌ (ఈఎల్‌ఎల్‌)ను ప్రవేశపెట్టింది. 72 కాలేజీల్లో ఈఎల్‌ఎల్‌లు ఏర్పాటయ్యాయి.  ప్రఖ్యాత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ద్వారా కోర్సులను  ఆన్‌లైన్‌ ద్వారా అందించడానికి ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.

144 కాలేజీల్లో వర్చువల్‌ తరగతులు
విద్యార్థులకు ఉన్నత పరిజ్ఞానంతో కూడిన అంశాల బోధనకు వీలుగా 144 కాలేజీల్లో వర్చువల్‌ తరగ­తులను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. అలాగే 132 కాలేజీల్లో జవహర్‌ నాలెడ్జి సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. 56 కాలేజీల్లో డిజి­టల్‌ తరగతులను ప్రవేశపెట్టారు. జిల్లా రిసోర్స్‌ కేంద్రాల ద్వారా విద్యార్థులు ఏడాది పొడవునా వివిధ కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు.

విద్యార్థులకు అందుతున్న బోధన ఎలా ఉందో తెలుసుకునేందుకు ప్రత్యేక సర్వే చేపడుతున్నారు. ‘స్టూడెంట్‌ శాటిస్‌ఫ్యాక్షన్‌  సర్వే’ పేరుతో లెక్చరర్లు ఎలా చెబుతున్నారో విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. అకడమిక్, అడ్మినిస్ట్రేషన్‌ ఆడిట్‌ను నిర్వహిస్తూ కాలేజీల్లో సిబ్బంది సామర్థ్యాలను సైతం పెంచుతున్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top