787 కాలేజీలు మూత

Engineering and other seats reduced in courses - Sakshi

ఇదీ గత ఐదేళ్లలో ఉన్నత విద్యా సంస్థల పరిస్థితి..

వచ్చే ఏడాది మరో 200 కాలేజీలకు కోత

ఉన్నత విద్య కాలేజీల్లో ప్రవేశాలు అంతంతే

ఇంజనీరింగ్‌ తదితర కోర్సుల్లో తగ్గిపోయిన సీట్లు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉన్నత విద్యా సంస్థలు తగ్గుతున్నాయి. నాణ్యత ప్రమాణాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపడుతుండటంతో కాలేజీలు మూత పడుతున్నాయి. కొన్ని కాలేజీలు విద్యార్థుల్లేక యాజమాన్యాలే రద్దు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తేల్చిన లెక్కలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. 2014–15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో ఉన్నత విద్య అందించే కాలేజీలు 3,688 ఉంటే అవి 2018–19 విద్యా సంవత్సరం నాటికి 2,901కి తగ్గాయి. ఈ ఐదేళ్లలో 787 కాలేజీలు మూతపడ్డాయి. వచ్చే ఏడాది మరో 200 వరకు డిగ్రీ, ఇతర కాలేజీలు మూత పడే అవకాశం ఉంది. గత ఐదేళ్లలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బి.ఫార్మసీ, ఫార్మ్‌–డి, ఎంసీఏ, ఎంబీఏ, బీఈడీ, న్యాయవిద్య, ఎంటెక్, ఎం.ఫార్మసీ, బీపీఈడీ తదితర కోర్సులు నిర్వహించే కాలేజీలు వందల సంఖ్యలో తగ్గినా ఆయా కోర్సుల్లో సీట్లు మాత్రం భారీగా పెరి గాయి. అయినా పెరిగిన సీట్లకు అనుగుణంగా విద్యార్థుల ప్రవేశాలు లేకపోవడం గమనార్హం.

అత్యధికంగా డిగ్రీ కాలేజీలే మూత
రాష్ట్రంలో అత్యధికంగా డిగ్రీ కాలేజీలు మూత పడుతున్నాయి. 2018–19 విద్యా సంవత్స రంలో రాష్ట్రంలో 1,151 డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలు చేపడితే అందులో 25 శాతంలోపే ప్రవేశాలు జరిగిన కాలేజీలు 786 ఉండటం గమనార్హం. 280 కాలేజీల్లో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. అందులో అన్ని కాలేజీలు మూతపడకపోవచ్చు. ఇప్పటికే ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఉంటారు. మరోవైపు ప్రమాణాలు పెంచుకుంటే వచ్చే విద్యా సంవత్సరంలోనూ విద్యార్థులు చేరే అవకాశం ఉంటుంది. అయినా ఒక్క డిగ్రీలోనే 150 కాలేజీలకు మూసివేత ముప్పు పొంచి ఉంది. ఇతర కోర్సుల్లోనూ జీరో అడ్మిషన్లు ఉన్న కాలేజీలు ఉన్నాయి. మొత్తంగా దాదాపు 200 కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరంలో రద్దయ్యే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం గనుక వరుసగా మూడేళ్ల పాటు 25 శాతంలోపే ప్రవేశాలు జరిగిన కోర్సులను రద్దు చేయాలన్న నిర్ణయాన్ని పక్కాగా అమలు చేస్తే వందల సంఖ్యలో కాలేజీలు మూతపడే అవకాశం ఉంది.

ఆశించిన మేర లేని ప్రవేశాలు
ఐదేళ్లలో ప్రవేశాలు అంత ఆశాజనకంగా లేవు. సీట్లు పెరిగిన స్థాయిలో ప్రవేశాలు పెరగలేదు. 2014–15 విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని అన్ని ఉన్నత విద్యా కోర్సుల్లో 3,77,344 మంది విద్యార్థులు చేరితే 2018–19 విద్యా సంవత్సరంలో 3,97,225 మంది విద్యార్థులు చేరారు. అన్ని కాలేజీల్లో 1,28,887 సీట్లు పెరిగినా కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య ఐదేళ్ల కిందటితో పోలిస్తే విద్యార్థుల సంఖ్య 19,881 మాత్రమే పెరిగింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top