విద్యార్థులపై పైసా భారం లేదు

Fee Reimbursement for students of unaided courses in aided colleges - Sakshi

ఎయిడెడ్‌ కాలేజీల్లో అన్‌ ఎయిడెడ్‌ కోర్సుల విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌

పటిష్టంగా అమలు చేస్తున్న సీఎం జగన్‌

ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఖరారు చేసిన ఫీజులే

రాష్ట్రంలో మొత్తం డిగ్రీ కాలేజీలు 1,444

వీటిలో ఎయిడెడ్‌ 137.. ప్రభుత్వ కాలేజీలు 154

మిగిలిన 1,153 ప్రయివేటు అన్‌ ఎయిడెడ్‌ 

సంప్రదాయ కోర్సుల్లో పడిపోయిన చేరికలు

2020–21లో మొత్తం సీట్లలో 57 శాతమే భర్తీ

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రయివేటు అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మాదిరిగానే ఎయిడెడ్‌ కాలేజీల్లోని అన్‌ ఎయిడెడ్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా ప్రభుత్వం పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు అమలు చేస్తోంది. ఏ ఒక్క విద్యార్థి మీద పైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా వాటిని భరిస్తోంది. విద్యావ్యవస్థలో గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ విధానం 1960లో ఆరంభమైంది. అక్షరాస్యత పెరుగుతున్న కొద్దీ డిగ్రీ కాలేజీలకు, సీట్లకు డిమాండ్‌ పెరుగుతూ వచ్చింది. దీనికి అనుగుణంగా కాలేజీలు, సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు అప్పట్లో ప్రభుత్వం ప్రయివేటు డిగ్రీ కాలేజీల ప్రారంభానికి అనుమతులు ఇచ్చింది. ఈ తరుణంలో కొంతమంది దాతలు, ప్రముఖులు మంచి ఉద్దేశంతో సమాజానికి సేవచేయాలని కాలేజీలు స్థాపించారు.

భీమరంలోని డీఎన్‌ఆర్‌ కాలేజీ, ఏలూరులోని సీఆర్‌రెడ్డి కాలేజీ, మదనపల్లెలోని బీటీకాలేజీ, అమలాపురంలోని ఎస్‌కేబీఆర్‌ కాలేజీ, విశాఖపట్నంలో డాక్టర్‌ ఎల్‌బీ కాలేజీ.. వంటివి ఇలా ఏర్పాటైనవే. వీటిలో విద్యార్థుల చేరికలు పెరుగుతున్న కొద్దీ అదనంగా అధ్యాపకుల అవసరం ఏర్పడింది. సిబ్బంది సంఖ్య పెరిగిన కొద్దీ వారికి వేతనాలు వంటివి అందించడం ఆయా సంస్థలకు ఆర్థికంగా భారంగా మారింది. ఈ నేపథ్యంలో ఆయా యాజమాన్యాలు  ఆర్థికసాయాన్ని అర్థించగా ప్రభుత్వం టీచర్ల వేతనాలకు ఇయర్లీ గ్రాంటును మంజూరు చేసింది. తరువాత దీన్ని 3 నెలలకు మార్చింది. 2010–12 నుంచి ఈ వేతనాల చెల్లింపును సీఎఫ్‌ఎంఎస్‌ పరిధిలోకి చేర్చారు. రాష్ట్రంలో 1,444 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో 1,153 ప్రయివేటు అన్‌ ఎయిడెడ్‌వి. 137 ఎయిడెడ్, 154 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు. కాలేజీల సంఖ్య పెరిగాక ప్రభుత్వ, ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో చేరికలు తగ్గిపోయాయి. 2020–21లో మొత్తం కాలేజీల్లోని సీట్లలో 57 శాతం మాత్రమే భర్తీ అయ్యాయి. 

ఫీజులు భరిస్తున్న ప్రభుత్వం
మరోవైపు మారుతున్న కాలానికి అనుగుణంగా కోర్సుల పునర్వ్యవస్థీకరణ జరిగి మార్కెట్, ఎంప్లాయిమెంటు ఓరియెంటెడ్‌ కోర్సులు ప్రారంభమయ్యాయి. దీంతో సంప్రదాయ కోర్సుల్లో చేరికలు పడిపోయాయి. ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లో 90 శాతం కోర్సులు అన్‌ ఎయిడెడ్‌వి ఉన్నాయి. వీటికి ఉన్నతవిద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఖరారు చేసిన ఫీజులే వర్తిస్తాయి. ఈ కోర్సులకు అయ్యే ఫీజులను.. ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక పూర్తిగా రీయింబర్స్‌మెంటు చేయిస్తున్నారు. ప్రయివేటు అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థులకు మాదిరిగానే ఎయిడెడ్‌ కాలేజీల్లోని అన్‌ ఎయిడెడ్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు కూడా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటు అమలవుతోంది. ఏ ఒక్క విద్యార్థి మీద కూడా నయాపైసా భారం పడకుండా ప్రభుత్వమే పూర్తిగా భరిస్తోంది. ఖరారైన ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తున్నట్లు ఉన్నత విద్యానియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌కు ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. ఒకవేళ ఏ కాలేజీలోనైనా నిర్ణీత ఫీజులకన్నా అధికంగా వసూలు చేస్తే ఆ సంస్థలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోనున్నారు. 

ఎయిడెడ్‌ స్కూళ్లలో తగ్గిన చేరికలు
ఎయిడెడ్‌ పాఠశాలల్లో కనీస వసతులు, సరైన బోధన లేకపోవడం, యాజమాన్యాలు కూడా నిర్లిప్తంగా వ్యవహరిస్తుండటంతో చేరికలు మరింతగా తగ్గిపోయాయి. ప్రభుత్వం ఇక్కడి సిబ్బంది వేతనాలకు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కింద ఖర్చుచేస్తున్న ప్రజాధనం వృధాగా మారుతోంది. విద్యార్థులకు సరైన ప్రమాణాలతో కూడిన విద్య అందడం లేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top