దోస్త్‌లో ఆ కాలేజీలను చేర్చొద్దు  

High Court order to the higher education department officials - Sakshi

ఉన్నత విద్యా శాఖ అధికారులకు హైకోర్టు ఆదేశం 

ఈ కాలేజీల్లో ప్రవేశాలు మా తీర్పునకు లోబడి ఉంటాయి 

ఈ విషయాన్ని ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తెలియచేయండి 

ఆ కాలేజీలకు హైకోర్టు ఆదేశం.. మధ్యంతర ఉత్తర్వులు జారీ 

సాక్షి, హైదరాబాద్‌: ఆన్‌లైన్‌ ప్రవేశ ప్రక్రియకు ఉద్దేశించిన డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ (దోస్త్‌)లో తమను చేర్చకుండా ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించాలని కోరుతూ పలు కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆ కాలేజీలను దోస్త్‌లో చేర్చవద్దని ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించింది. అయితే ఈ కాలేజీల్లో జరిగే ప్రవేశాలు తాము ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని డిగ్రీ ప్రవేశాలు పొందిన విద్యార్థులకు తెలియచేయాలని ఆయా కాలేజీలను ఆదేశించింది. కోర్టు ఆదేశాల గురించి తమకు తెలుసునన్న హామీని ప్రవేశాలు పొందిన విద్యార్థుల నుంచి తీసుకోవాలని తెలిపింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఉన్నత విద్యా శాఖ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్‌ 6కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలను ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టేందుకు అధికారులు దోస్త్‌ను తీసుకొచ్చారని, ఇందులో తమ కాలేజీలను కూడా చేరుస్తున్నారని, ఇది గతంలో హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులకు విరుద్ధమంటూ ఎడూ ఎలిమెట్స్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీతో మరో 10 విద్యా సంస్థలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఏసీజే జస్టిస్‌ రాఘవేంద్ర సింగ్‌ చౌహాన్‌ విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ కాలేజీలను దోస్త్‌లో చేరేలా ఉన్నత విద్యా శాఖ అధికారులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. వాస్తవానికి ఆన్‌లైన్‌ డిగ్రీ ప్రవేశాలపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, ఆ ఉత్తర్వులు ఇంకా అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. అయినా కూడా ఇప్పుడు ఆ ఉత్తర్వులకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి, ఈ కాలేజీలను దోస్త్‌లో చేర్చవద్దని అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top