బోగస్‌ పేర్లతో ఫీజురీయింబర్స్‌మెంట్‌ స్వాహా 

Fee Reimbursement Scam with bogus names - Sakshi

డిగ్రీ కాలేజీల్లో పీజీ తరగతులు 

విజిలెన్స్‌ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు 

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, మెడికల్‌ కాలేజీల్లో విజిలెన్స్‌ అధికారులు తనిఖీల్లో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. డిగ్రీ కళాశాలల్లో పీజీ తరగతులను నిర్వహిస్తున్నవి కొన్ని కాగా... విద్యార్థుల నుంచి వసూలు చేసిన ఫీజులను యూనివర్సిటీలకు చెల్లించకుండా తమ ఖాతాల్లోనే దాచుకున్న కళాశాలలు మరికొన్ని. ఇక అసలు విద్యార్థులు లేకుండానే ఉన్నట్లుగా చూపిస్తూ బోగస్‌ పేర్లతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు కాజేస్తున్న కాలేజీలు మరికొన్ని ఉన్నట్లు ప్రాథమిక విచారణలో అధికారులు గుర్తించినట్లు సమాచారం. ప్రధానంగా ప్రైవేట్‌ కాలేజీల్లో వసతులతో పాటు రికార్డులను అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. తనిఖీలను మరో రెండు రోజుల్లో పూర్తి చేసి పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది. ప్రైవేట్‌ కాలేజీల్లో జరుగుతున్న ఈ అవకతవకలను అరికట్టేందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులను కాలేజీల ఖాతాల్లో కాకుండా జవాబుదారీతనం, పారదర్శకత కోసం నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.   

ఒకే క్యాంపస్‌లో డిగ్రీ, పీజీ 
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తనిఖీల్లో పలు కాలేజీల్లో అవకతవకలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధానంగా డిగ్రీ కాలేజీకి అనుమతి పొందిన కొన్నేళ్ల తర్వాత పీజీ కాలేజీకి అనుమతి తీసుకుంటున్నారు. ఒకటో, రెండో తరగతి గదులను పెంచి అదే క్యాంపస్‌లో పీజీ కాలేజీ నిర్వహిస్తున్నారు. ల్యాబ్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం లేదు. బోధనా సిబ్బందిని నియమించకుండా డిగ్రీ అధ్యాపకులతోనే సరిపెడుతున్నారు. ప్రత్యేకంగా తరగతి గదులు, ల్యాబ్, స్టాఫ్‌ ఉన్నారని తప్పుడు పత్రాలు సృష్టించినట్టు విజిలెన్స్‌ తనిఖీల్లో బయటపడుతున్నాయి.
   
విద్యార్థుల సంఖ్యల్లోనూ తేడాలు 
కొన్ని కాలేజీలు యూనివర్సిటీకి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం సమర్పిస్తున్న విద్యార్థుల సంఖ్యకు, వాస్తవ సంఖ్యకు తేడా ఉన్నట్లు విజిలెన్స్‌ అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. బినామీ విద్యార్థుల ఫీజులను కాలేజీ యాజమాన్యాలు తమ జేబులో వేసుకుంటున్నట్లు వెల్లడవుతోంది. కొన్ని కాలేజీల్లో ఇలాంటి అవకతవకలు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు కొన్ని ఇంజనీరింగ్‌ కాలేజీలు యూనివర్సిటీలకు ఫీజులు చెల్లించకుండా ఏళ్ల తరబడి తమ వద్దే ఉంచుకుంటున్నాయి. అయితే ఆ ఫీజులను మాత్రం విద్యార్థుల నుంచి వసూలు చేస్తున్నాయి. విశాఖ జిల్లాలోని ఇంజనీరింగ్‌ కాలేజీ  ఏకంగా రూ.10 కోట్ల మేర జేఎన్‌టీయూ (కాకినాడ)కు చెల్లించాల్సి ఉందని తెలుస్తోంది.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top