
రాష్ట్రంలో ఆశించినంతగా నమోదు కాని వర్షపాతం
సాక్షి, విశాఖపట్నం: రుతుపవనాలు ప్రవేశించి నెల గడిచినా.. రాష్ట్రంలో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఆగస్ట్‌లో వరుసగా రాబోతున్న రెండు అల్పపీడనాలు బలపడితే మంచి వర్షాలకు ఆస్కారం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. రైతుకు ఇది కొంత ఉపశమనం కలిగించే మాటే అయినప్పటికీ, వాస్తవ పరిస్థితి ఎలా ఉంటుందన్న ఆలోచనే ఆందోళనకు గురిచేస్తోంది. దశాబ్ద కాలం తర్వాత.. వాతావరణ శాఖ అంచనాలకు అనుగుణంగా ముందస్తుగా నైరుతి పలకరించడంతో అన్నదాతలు ఖుషీ అయ్యారు.
మే నెలాఖరులో కురిసిన భారీ వర్షాలతో.. ఏరువాకకు ముందే పంటల సాగు ప్రారంభించారు. కానీ జూన్‌లో ఆశించిన మేర వర్షాలు నమోదు కాకపోవడంతో రైతుల కళ్లల్లో ఆందోళన ఛాయలు కనిపిస్తున్నాయి. మబ్బులు పట్టినా వర్షం పూర్తిస్థాయిలో కురవలేదు. ప్రతి రోజూ వర్షం కురిసినట్లే అనిపించినా.. భారీ వర్షాలు లేకపోవడంతో.. లోటు వర్షపాతం రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది.
జూన్ 1 నుంచి జూలై 5 వరకూ రాష్ట్ర సగటు వర్షపాతం 115.6 మిల్లీమీటర్లుగా ఉండాల్సి ఉండగా, 93.9 మిల్లీమీటర్లే నమోదైంది. జూలై మొదటి వారంలో అన్ని జిల్లాల్లోనూ ముసురు వాతావరణం కనిపించినా లోటు పూడ్చేంత భారీ వానలు కురవలేదు. ఈ నెలలోనూ ఆశించిన స్థాయి వర్షాలు పడే సూచనలు కనిపించడం లేదు. ఈ నెల మూడో వారంలో ఏర్పడే అల్పపీడనం ఏమైనా ఫలితాలిచ్చే అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. అడపాదడపా వర్షాలు కురిసినప్పటికీ, అవి లోటును భర్తీ చేసే స్థితిలో లేకపోవడంతో.. ఆగస్టు నెలలో కురిసే వానలపైనే రైతు ఆశలు పెట్టుకున్నాడు.