
రుతుపవనాలు అస్తవ్యస్తం
దేశంలో మారిపోతున్న వర్షాల తీరుతెన్నులు
ఎండాకాలంలో వానలు, వరదలు..
వర్షాకాలంలో ఎండలు, కరువు పరిస్థితులు
2040 నాటికి 12 నుంచి 22 శాతం పెరగనున్న వర్షపాతం
వ్యవసాయానికి, ఆర్థికవ్యవస్థకు పెనుముప్పు
సాక్షి, అమరావతి: గ్లోబల్ వార్మింగ్ రుతుపవనాల వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ.. ప్రజలకు వార్నింగ్ ఇస్తోంది. ప్రధానంగా వ్యవసాయాధారితమైన మన దేశంలో వ్యవసాయ, ఆర్థిక వ్యవస్థలకు పెనుముప్పు ఏర్పడే అవకాశం ఉందని హెచ్చరిస్తోంది. మన దేశంలో ఎక్కువమంది ప్రజలకు వ్యవసాయమే ఆధారం. సేద్యానికి జీవం పోసేది వర్షం. ఆ వర్షాలను సమకూర్చేవి రుతుపవనాలు. అవి లేకపోతే పంటలే లేవు. పంటలు లేకపోతే అన్నదాతే లేడు. అందుకే రుతుపవనాలను దేశ ఆర్థికవ్యవస్థకు ఊపిరిగా పరిగణిస్తారు.
కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఈ రుతుపవనాల వ్యవస్థ అస్తవ్యస్తమవుతోంది. వర్షాలు ఎక్కడ పడతాయో, ఎప్పుడు పడతాయో అంచనా వేయడం కష్టమవుతోంది. ఎండాకాలంలో ఆకస్మిక వర్షాలు, వరదలు.. వర్షాకాలంలో ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మన రాష్ట్రంలో గత వేసవిలో విపరీతమైన వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదలడంలేదు. అదే సమయంలో వేసవిలో తరహాలో ఎండలు కాస్తున్నాయి.
రెండు ప్రధాన రుతుపవన వ్యవస్థలు
భూభాగం వేడెక్కి తక్కువ పీడనం ఏర్పడినప్పుడు సముద్రం నుంచి భూమివైపు వచ్చే తేమగాలులు విస్తారంగా వర్షాలు కురిపిస్తాయి. ఈ వ్యవస్థనే రుతు పవనాలుగా పిలుస్తారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు వర్షాలు కురిపిస్తాయి.
నైరుతి రుతుపవనాలు: ఈ సీజన్ జూన్ నుంచి సెపె్టంబర్ వరకు ఉంటుంది. దేశం మొత్తం వార్షిక వర్షంలో సుమారు 75 శాతం ఈ కాలంలోనే కురుస్తుంది. జూన్ మొదటి వారంలో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. అక్కడి నుంచి క్రమంగా దేశమంతా విస్తరిస్తూ జూన్ చివరినాటికి ఉత్తర భారతం వరకు చేరతాయి. జూలైలో గరిష్ట వర్షాలు పడతాయి. ఆగస్టు వరకు కొనసాగి, సెపె్టంబర్ చివర్లో ఇవి వెనుదిరుగుతాయి.
ఈశాన్య రుతుపవనాలు: అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఉంటుంది. ముఖ్యంగా తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌కు ఈ వర్షాలు ప్రాణాధారం. నైరుతి రుతుపవనాలు వెళ్లిపోయిన తరువాత ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తాయి.
తగ్గిన ఎల్‌నినో ప్రభావం
ఇప్పటివరకు రుతుపవనాలపై ఎల్‌నినో, లానినో ప్రభావం బలంగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ప్రభావం బలహీనమైంది. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల పెరుగుదలే వర్షాలపై ప్రధానంగా ఉంటోంది. ఎల్‌నినో, లానినో అనేవి పసిఫిక్ మహాసముద్రపు నీరు వేడెక్కడం, చల్లబడటం వల్ల జరిగే వాతావరణ మార్పులు. ఎల్‌నినోలో సముద్రం వేడెక్కుతుంది. దీనివల్ల కొన్ని ప్రాంతాల్లో ఎండలు, కరువు పరిస్థితులు, కొన్నిచోట్ల వరదలు వస్తాయి. లానినోలో సముద్రం చల్లబడుతుంది. వర్షాలు ఎక్కువై తుపాన్లు కూడా రావచ్చు. ఈ రెండు వ్యవస్థలు ప్రపంచంలోని వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి.
రుతుపవనాల ప్రభావం
» దేశంలో 51 శాతం వ్యవసాయ భూమి రుతుపవనాలపైనే ఆధారపడి ఉంది.
» మొత్తం ఆహారోత్పత్తిలో 40 శాతం ఈ రుతువుల వల్ల కురిసే వర్షాల ద్వారానే వస్తుంది.
» గ్రామీణ జనాభాలో 47 శాతం మంది జీవనోపాధి వ్యవసాయమే.
» చెరువులు, బావులు, నదులు నిండిపోవడం నుంచి విద్యుత్ ఉత్పత్తి వరకు అన్నింట్లో రుతుపవనాలు కీలకం.
భవిష్యత్తు అంచనాలు
» 2040 నాటికి వర్షపాతం 12 శాతం నుంచి 22 శాతం వరకు పెరిగే అవకాశం.
» వర్షం కురిసే రోజులు తగ్గి, తక్కువ రోజుల్లోనే విపరీతంగా వర్షాలు కురుస్తాయి.
» దీనిఫలితంగా వరదలతో పాటు కరువు పరిస్థితులు ఎదురవుతాయి.
» ఈ శతాబ్దం చివరినాటికి రుతుపవనాల అసమానత మరింత తీవ్రం అవుతుంది.
వాతావరణ వైపరీత్యాలు.. క్లౌడ్‌బరస్ట్‌ల ముప్పు
శాస్త్రవేత్తల అంచనా ప్రకారం రుతుపవనాల్లో విపరీత మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తూర్పు, మధ్య, ఉత్తర భారతంలో వర్షపాతం తగ్గిపోతోంది. గుజరాత్, పశ్చిమ రాష్ట్రాలు, ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. భారీ వర్షపాతం సంఘటనలు మరింత ఎక్కువవుతున్నాయి. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్ము–కశ్మీర్ ప్రాంతాల్లో ఒక్కసారిగా కురిసే ఆకస్మిక వర్షాలు (క్లౌడ్ బరస్ట్‌లు) పెరుగుతున్నాయి.
గంటలో 100 మిల్లీమీటర్లకుపైగా వర్షం కురవడం వల్ల గ్రామాలకు గ్రామాలు కొట్టుకుపోతున్నాయి. అపారమైన ప్రాణ, ఆస్తినష్టం జరుగుతున్నాయి. వర్షాలు అసహజంగా కురవడం వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో నీటినిల్వలు పెరుగుతున్నాయి. దీనివల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్య వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి.