మంటల్లో ముద్దగా మారిన మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు చూపించలేక తండ్రి నిర్ణయం
కర్నూలు (హాస్పిటల్): కర్నూలు వద్ద అగ్ని ప్రమాదానికి గురైన బస్సులో కరిగి ముద్దగా మారిన మృతదేహాన్ని తీసుకెళ్లి ఇంట్లో ఏమని చెప్పాలి.. వారికి ఈ శరీరాన్ని ఎలా చూపాలి.. చూపితే వారు తట్టుకోగలరా.. ఇంతటి దుఃఖం మాతోనే ముగిసిపోనీ.. కర్నూలులోనే కుమారునికి అంత్యక్రియలు చేస్తాం’ అని ఆ తండ్రి బోరున విలపిస్తూ భావోద్వేగంతో చెప్పిన మాటలు కంటతడి పెట్టించాయి. శుక్రవారం తెల్లవారుజామున కర్నూలు శివారులో జరిగిన వి.కావేరి బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు.
వీరిలో తమిళనాడులోని ధర్మపురం జిల్లా పాలక్కాడ్ తాలూకా మాదగేరి గ్రామానికి చెందిన రాజన్ మారప్పన్ కుమారుడు ప్రశాంత్ (29) కూడా ఉన్నాడు. ఇతను హైదరాబాద్‌లో చిప్స్ ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. అతడికి ఏడాదిన్నర క్రితమే వివాహం కాగా.. ఐదు నెలల కుమారుడు ఉన్నాడు. స్వస్థలానికి వెళ్లి భార్యాపిల్లలను చూసేందుకు గురువారం రాత్రి హైదరాబాద్‌లో వి.కావేరి ట్రావెల్స్ బస్సు ఎక్కాడు. బస్సు కర్నూలు దాటగానే మంటల్లో కాలిపోయింది. ఇందులో ప్రశాంత్ సజీవదహనయ్యారు.
సోమవారం తమిళనాడుకు చెందిన ప్రశాంత్ మృతదేహానికి కూడా కర్నూలులోనే అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబసభ్యులు అధికారులను కోరారు. కర్నూలు నుంచి 800 కి.మీ. దూరంలో ఉన్న మాదగేరికి వెళ్లాలంటే రెండు రోజుల సమయం పడుతుందని.. మరణించి ఇప్పటికే మూడు రోజుల సమయం దాటిందని, ఇప్పుడు స్వగ్రామానికి వెళ్లేలోపు ఐదు రోజులు పూర్తవుతుందని తండ్రి రాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కాలిపోయిన మాంసం ముద్దగా మారిన మృతదేహాన్ని కుటుంబసభ్యులకు చూపించి వారిని మరింత క్షోభకు గురిచేయలేమని, కేవలం అస్థికలు మాత్రమే తీసుకెళ్తామని, అందుకు ఏర్పాట్లు చేయాలని కోరారు. దీంతో మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, సద్గురుదత్త కృపాలయం గ్యాస్ క్రిమేషన్ ద్వారా అంత్యక్రియలు నిర్వహించి అస్థికల్ని అందజేశారు. వాటిని ప్రశాంత్ తండ్రి రాజన్ మారప్పన్‌తో పాటు సోదరుడు మణి, స్నేహితులు తీసుకెళ్లారు.


