నందిరెడ్డిగారిపల్లె ప్రత్యేకత ఏంటో తెలుసా!

Kurabala Kota: Mason, Beldari, Construction Workers in Nandireddigaripalle - Sakshi

ఆ ఊరంతా.. బేల్దార్లే !! 

ఇంటికి ఇద్దరు ముగ్గురు కూడా 

కురబలకోట(అన్నమయ్య జిల్లా) : ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. బేల్దార్లు (తాపీ మేస్త్రీలు), భవన నిర్మాణ కార్మికులున్న ఊరుగా కురబలకోట మండలంలోని నందిరెడ్డిగారిపల్లె పెట్టింది పేరు. ఇది కష్టజీవుల ఊరు. ఏ ఇంట్లో చూసినా తాపీ, గజం కట్టి, టేపు, మూల మట్టం కన్పిస్తాయి. వీరు కూడా అంతా ముస్లిం మైనార్టీలే. 40 ఏళ్ల క్రితం తొలుత ఆ ఊరికి చెందిన షేక్‌ నూరాసాబ్‌ ఈ వృత్తికి ఆద్యులుగా చెబుతారు. ఆ తర్వాత దర్గా ఖాదర్‌వల్లీ ఈ వృత్తిని స్వీకరించడంతో అతని వద్ద మరికొందరు బేల్దార్లు, మేస్త్రీలు తయారయ్యారు. 

ఇలా ఒక్కరొక్కరుగా పనికి వెళుతూ మిగిలిన వారు కూడా కాలక్రమంలో బేల్దార్లు అయ్యారు. ఇప్పుడు ఆ ఊరిలో 75 శాతం మందికి ఇదే జీవనాధారం. ఈ వృత్తినే పరంపరగా సాగిస్తున్నారు. ఇంటికి ఇద్దరు ముగ్గురు కూడా బేల్దార్లు ఉన్నారు. చేతిపని కావడంతో వచ్చే ఆదాయం ఇళ్లు గడవడం ఇతర అత్యవసరాలు తీరడానికి సరిపోతోందని చెబుతున్నారు. ఉదయం ఏడు గంటలకు పనికి బయలు దేరి సాయంత్రం ఐదు గంటల వరకు పనులు చేసి తిరిగి ఇళ్లకు చేరుకుంటారు. 

మంగళవారం మదనపల్లె సంత కావడంతో సెలవు తీసుకుంటారు. ఈ ఊరిలో 2221 జనాభా, 621 కుటుంబాలు, 1063 మంది ఓటర్లు ఉన్నారు. 90 శాతం అక్షరాస్యత ఉంది. ఈ ఊరి తర్వాత మండలంలోని సింగన్నగారిపల్లె, పందివానిపెంట కూడా భవన నిర్మాణ కార్మికులకు పెట్టింది పేరు. మదనపల్లె, కురబలకోట పరిసర ప్రాంతాలకు వీరు పనులకు వెళతారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రత్యేక శ్రద్ధ వహించి వీరికోసం వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. (క్లిక్‌: చదివింది ఏడో తరగతి.. నాదస్వర సాధనలో దిట్ట)

యువతరం చదువులపై దృష్టి     
నేటి తరం చదువులపై దృష్టి సారిస్తున్నారు. ఉద్యోగాల పట్ల మక్కువ చూపుతున్నారు. ఈ వృత్తి పట్ల యువకులు విముఖత చూపుతున్నారు. ప్రభుత్వ ఉర్దూ యూపీ స్కూల్‌ ఉంది. ఈ ఊరిలో సచివాలయం కూడా ఉంది. వెనుకబడిన ఆ ఊరు ఇప్పుడిప్పుడే వివిధ ప్రభుత్వ పథకాలతో క్రమేణా పేదరికం నుంచి బయటపడుతోంది. భవన నిర్మాణ కార్మికులకు 55 ఏళ్లకే పింఛన్‌ సౌకర్యం కల్పించాలి. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా ఇళ్లు కట్టుకున్నాం. మా ఇళ్లను మేమే ఉన్నంతలో సంతోషంగా కట్టుకుంటాం.  
– మోదీన్‌ సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె  

ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకాలేదు 
ఈ వృత్తితో ఎన్నేళ్లయినా ఉపాధికి ఢోకా లేదు. కట్టడాలు, భవన నిర్మాణాలు నిరంతరం జరుగుతుంటాయి. పని లేదన్న చింత లేదు. సీఎం జగన్‌ ప్రభుత్వంలో సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ క్లినిక్‌ భవనాలు, జగనన్న ఇళ్లు లాంటి తదితర ఎన్నో అభివృద్ధి పనుల వల్ల రెండు చేతులా తరగని పని ఉంది. కాలానికి తగ్గట్టుగా టెక్నాలజీ వచ్చింది. యంత్రాల సాయంతో పని కూడా సులభతరంగా మారింది. తాపీనే మాకు పెట్టుబడి.. ఆపై జీవనాధారం. ఖర్చులు పోను నెలకు రూ. 20 వేలు వరకు మిగులుతుంది.  
– కమాల్‌సాబ్, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె

అభివృద్ధి బాటపడుతోంది 
ఈ ఊరు దశాబ్దాలుగా పేదరికాన్ని అనుభవించింది. సచివాలయాలు రాక మునుపు సరైన రోడ్డు లేదు. వీధులు సరిగ్గా ఉండేవి కావు. ఇప్పుడు పక్కా రోడ్డు ఉంది. పక్కా ఇళ్లు మంజూరయ్యాయి. పింఛన్లు వస్తున్నాయి. వివిధ ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. 31 డ్వాక్రా గ్రూపులు ఉండగా వాటి ద్వారా రూ. 3 కోట్లు టర్నోవర్‌ ఉంది. డబ్బుకు ప్రైవేటు వారిని ఆశ్రయించాల్సిన పనిలేదు. ఈ ఊరు మదనపల్లె పట్టణానికి సమీపంలోనే ఉంది. ఇది కూడా వీరికి కలసి వచ్చింది 
– సఫియా, గ్రామ కార్యదర్శి, నందిరెడ్డిగారిపల్లె 

నాడు రూ. రెండున్నర.. నేడు రూ.800 
మేము పనిచేసే తొలి నాళ్లలో బేల్దార్లకు రోజుకు రెండున్నర రూపాయి ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 700 నుంచి రూ. 800 వరకు ఉంది. గుర్తుంపు కార్డులు ఇచ్చారు. వాటి అవసరం పెద్దగా ఏర్పడ లేదు. అల్లా దయవల్ల ప్రమాదకర ఘటనల బారిన పడలేదు. సత్తువ, శక్తి ఉన్నన్నాళ్లు ఈ పని చేసుకోవచ్చు. ఎప్పటికీ డిమాండు ఉంటుంది.  
– హైదర్‌వల్లీ, బేల్దారి, నందిరెడ్డిగారిపల్లె  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top