ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలందరికి అంతా ఊహిస్తున్న సందేశం ఇచ్చేశారు. ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల తర్వాత మోదీ కొన్ని చర్యలు చేపడతారని ,అవి ప్రజలపై భారం మోపేవిగా ఉండక తప్పదని భావించారు. హైదరాబాద్ లో జరిగిన భారతీయ జనతా పార్టీ బహిరంగ సభలో ఆయన పలు అంశాలు ప్రస్తావించి అసలు సమస్య కూడా చెప్పేశారు. ఆయన చెప్పినవి సూచనలుగా తీసుకుంటారా? లేక జరగబోయే పరిణామాలుగా తీసుకుంటారా అన్నది ప్రజల ఇష్టం.
ఒక ఏడాదిపాటు బంగారం కొనవద్దని చెప్పడం నిజంగా సంచలనమైన సంగతే. పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించాలని చెప్పడం అసాధారణమేమీ కాకపోయినా, భవిష్యత్తులో వీటి ధరలు పెంచుతారన్న సంకేతాలు ఇచ్చినట్లు అయ్యింది. విదేశీ పర్యటనలు తగ్గించుకోవాలని, యూరియా వాడకం నియంత్రించాలని ఇలా తొమ్మిది పాయింట్లపై ప్రజలకు సలహాలు ఇచ్చారు. విదేశీ మారక ద్రవ్యాన్ని పొదుపు చేయడం కోసం ఈ చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వీటన్నిటిని దేశ భక్తితో ముడిపెట్టడంపై కొంతమంది విమర్శలు చేస్తున్నారు. దేశం ఎదుర్కుంటున్న సమస్యలను ప్రజలకు వివరించడం తప్పు కాదు. కాని ఆయన కూడా సాధారణ రాజకీయ నేత మాదిరే వ్యవహరిస్తున్నారన్నదే బాధ. ఇంతకాలంగా ప్రధానమంత్రిగా ఉంటూ దేశ ప్రజల అభిమానం చూరగొంటున్న నేతగా ఆయన రాజనీతిజ్ఞుడుగా ఉంటే సంతోషంగా ఉంటుంది. కాని ఆలా చేయలేకపోతున్నారే అన్న భావన ఆయన అభిమానులలో ఏర్పడుతోంది.
దాదాపు మూడు నెలలుగా గల్ఫ్ లో యుద్ద వాతావరణం నెలకొంది. అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు, ఇరాన్ కు మద్య సాగుతున్న ఘర్షణల ప్రభావం ప్రపంచం అంతటా పడుతోంది. ముఖ్యంగా హర్మూజ్ జలసంధిని మూసివేయడం, ఇతరత్రా అంతర్జాయతీయ పరిణామాలు అందరిని కలవరపరుస్తున్నాయి. ఈ క్రమంలోనే కమర్షియల్ వంట గ్యాస్ ధరను అమాంతం పెంచాల్సి వచ్చింది. అప్పుడే పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరుగుతాయని ఊహించారు.
కాని శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులు ఆ ఊసు ఎత్తకుండా జాగ్రత్తపడ్డారు. కేంద్రం తరపున అధికారులు ఎప్పటికప్పుడు ఆయిల్ ధరలు పెరగవని చెబుతూ వచ్చారు. కానీ.. ఎన్నికలు పూర్తయి, ఫలితాలు వెల్లడైన వారం రోజులకే అసలు రంగు బయటపడింది. ప్రధాన మంత్రే ఆర్థిక సంక్షోభం గురించి స్వయంగా వివరించారు. సమీప భవిష్యత్తులో చమురు ధరలు పెరగవచ్చన్నది ఎక్కువ మంది అంచనాగా ఉంది.
ఇక ఈ పొదుపు సూత్రాలు చెప్పడానికి ఆయన ఎంపిక చేసుకున్న వేదిక సరైనదేనా అన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన పార్టీ బహిరంగ సభలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. పెట్రోల్ ,డీజిల్ వాడకం తగ్గించుకోండని, ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేయాలని చెప్పారు. సొంత వాహనాలను వదలి మెట్రో,బస్ లను వాడాలని చెప్పారు. ఆక్షేపణ లేదు. ఈ సమస్య గురించి ఆయనకు ముందుగానే తెలుసు కదా! అలాంటప్పుడు ఇంత భారీ సభను నిర్వహించడం ఎంతవరకు సరి? లక్షల మందిని సమీకరించి, వారందరిని వాహనాలలో తీసుకురావడానికి ఎంత పెట్రోల్, డీజిల్ అవసరం అవుతాయో ఆయనకు తెలియదా?
ప్రజలకు పొదుపు మంత్రం చెప్పి, తామేమో ఇలా జనాన్ని పోగు చేయడానికి చమురును వాడవచ్చా! రెండున్నరేళ్ల తర్వాత జరిగే తెలంగాణ శాసనసభ ఎన్నికలకోసమో, లేక హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల కోసమో ఈ సభ పెట్టినట్లు లేదా? అలాగే తెలంగాణలో ఆయన పలు శంకుస్థాపనలు ,ప్రారంభోత్సవాలు చేశారు. అది కూడా హైదరాబాద్ నుంచి రిమోట్ ద్వారానే జరిపారు. ఆ పని ఢిల్లీ నుంచి కూడా చేసి ఉండవచ్చు కదా అన్న సందేహానికి అవకాశం ఇచ్చారు. దేశంలోని ఆయా నగరాలలో ప్రజా రవాణా అంత మెరుగ్గా లేదన్న సంగతి ఆయనకు తెలుసు కదా!
ముందుగా దానిని మెరుగు చేయకుండా బస్సుల్లో వెళ్లండి అంటే అది ఎలా సాధ్యం అవుతుంది. మోదీ చెప్పిన సూత్రాలలో బంగారం కొనుగోలు చేయవద్దని చాలా ముఖ్యమైన ప్రకటనగా కనిపిస్తుంది. ఇది మహిళల సెంటిమెంట్‌కు వ్యతిరేకంగా ఉండవచ్చు. ప్రత్యేకించి హిందూమతం అంటూ నిత్యం జపం చేసే బీజేపీ ఈ ప్రతిపాదన చేస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. దీని ప్రభావం దేశ వ్యాప్తంగా బంగారం షాపులపై ఉంటుంది. నిజంగానే ప్రజలు బంగారం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం మానివేస్తే దాని విపరిణామాలు కూడా గణనీయంగానే ఉంటాయి. కొన్నివేల గోల్డ్ షాపులు దెబ్బతింటాయి.
వేలాది మంది ఉద్యోగాలకు గండం ఏర్పడుతుంది. ఇన్నేళ్లుగా ఆత్మనిర్భర్ పేరుతో కేంద్రం అమలు చేస్తున్న విధానాలు పెద్దగా ఫలించడం లేదని ఆయన చెప్పినట్లుగా ఉంది. గోల్డ్ బాండ్ల పేరుతో ప్రజల నుంచి నిధుల సేకరణ కూడా ఫలితం ఇవ్వలేదన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. విదేశీ వస్తువుల వినియోగం తగ్గించాలని అన్నారు. బాగానే ఉంది. కాని తమ మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పేరుతో ఎన్నివేల కోట్ల అప్పు చేస్తున్నది మోదీకి తెలియదా? అక్కడ నిర్మాణాల కోసం ఈ మధ్య కొన్ని కోట్ల లీటర్ల డీజిల్ ను మళ్లించే యత్నం చేయడంపై కేంద్రం అభ్యంతరం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవసరమైన నిర్మాణాలు చేపట్టి, పొదుపుగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చెప్పి ఉంటే బాగుండేది కదా!
హైదరాబాద్‌లో స్వయంగా చంద్రబాబు ఇంటికి ప్రధాని వెళ్లారు కదా! ఆ సందర్భంగా ఏపీలో జరుగుతున్న దుబారా గురించి కూడా సలహా ఇచ్చి ఉంటే బాగుండేదేమో! చదరపు అడుగుకు రూ.18 వేల వరకు ఖర్చు పెడుతున్న ప్రభుత్వంగా ఏపీ రికార్డు సాధిస్తోంది.ఈ నిర్మాణాలలో ఎన్ని రకాల సరుకులను విదేశాల నుంచి తెప్పిస్తోందో తెలియదు. ఒక్క అద్దాలకే రూ.2540 కోట్లు వెచ్చించబోతున్నారే. అవన్ని ఇండియాలో తయారయ్యేవా? లేక దిగుమతి చేసుకోవల్సి ఉంటుందా? వంట నూనెలు తగ్గించుకోవాలని కూడా మోడీ సలహా ఇచ్చారు.
ఇన్నేళ్ల పాలనలో వంట నూనెల విషయంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించలేకపోవడం అవమానమే. రైతులు యూరియా వాడకం తగ్గించాలని అన్నారు. ఉక్రెయిన్,రష్యా యుద్దం మూడేళ్లుగా జరుగుతోంది. త్వరలో ముగుస్తుందని చెబుతున్నారు. ఈ దశలో యూరియా గురించి మోడీ జాగ్రత్తలు చెబుతున్నారు. సేంద్రీయ ఎరువులు, ప్రత్యామ్నాయ ఎరువులు అందుబాటులో ఉంటే రైతులు తప్పనిసరిగా మార్చుతారు. అది చేయకుండా యూరియా వాడవద్దంటే, పంటలు సరిగా పండకపోతే రైతులకు కలిగే నష్టాన్ని ఎవరు భరిస్తారు? ప్రజలు విదేశీ పర్యటనలను తగ్గించుకోవాలని ప్రధాని సలహా ఇచ్చారు. ఇదేదో ఏపీ ప్రభుత్వానికి ఇచ్చి ఉండాల్సింది. ఈ మధ్య కాలంలో చిత్రమైన శిక్షణల పేరుతో మంత్రులు, అధికారులను బృందాలుగా సింగపూర్ పంపుతున్నారు. దీనివల్ల ఏపీకి కలిసి వచ్చేది ఏమి ఉందో ఎవరికి తెలియడం లేదు.
ప్రభుత్వ ఖజానా పై కోట్ల భారం పడుతోంది.వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ మీటింగుల గురించి కూడా ప్రధాని సూచన చేశారు. ఇప్పటికే అలాంటివి జరుగుతున్నాయి. కాని వాటివల్ల కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. మామూలు రోజుల్లో ప్రధాని ప్రజలకు ఇలాంటి సలహాలు ఇచ్చి ఉంటే తప్పక చిత్తశుద్ది అర్ధం అవుతుంది.కాని ఎన్నికల సమయంలో ఒక రకంగా ,ఆ తర్వాత మరో రకంగా వ్యవహరిస్తుండడమే విమర్శలకు దారి తీస్తుంది.గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు డాలర్‌తో రూపాయి విలువను పోల్చి విమర్శలు చేసిన మోడీ, అప్పటికన్నా విలువ దాదాపు రెండు రెట్లు తగ్గినా ఇంతవరకు మాట్లాడలేదు.
ప్రధాని చెప్పిన నవ సూత్రాలపై లోక్ సభ లో విపక్ష నేత రాహోల్ గాంధీ ధ్వజమెత్తారు. ఇది మోదీ ప్రభుత్వ వైఫల్యం అని, ప్రధాని అయిన 12 ఏళ్లకు ఈ స్థితికి దేశాన్ని దిగజార్చారని వ్యాఖ్యానించారు. ఎప్పుడో 1965లో లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానిగా ఉన్నప్పుడు పాక్ యుద్దం, కరువు పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు వారానికి ఒక పూట ఉపవాసం చేయాలని విజ్ఞప్తి చేశారు. దానిని ఆయన తొలుత తన కుటుంబం నుంచే ఆచరించి చూపారు.తద్వారా దేశభక్తి అంటే ఏమిటో తెలియచేశారు. అలాగే ముందుగా మన కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ నేతలు దేశభక్తిని నిజమైన రీతిలో ఆచరించి,అప్పుడు ప్రజలకు చెబితే ఆదర్శవంతంగా ఉంటుంది కదా!

- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


