
సంగం(శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు): అప్పటి వరకు కేరింతలు కొడుతూ.. అల్లరి చేసిన ఆ చిన్నారిని మృత్యువు కారు రూపంలో వెంటాడింది. దీంతో ఆనందం ఆవిరై ఆ కుటుంబం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. వివరాల్లోకి వెళితే సంగం మండలం కొరిమెర్ల సమీపంలో సంగం–కలిగిరి రహదారిపై శనివారం రోడ్డు దాటుతున్న ఆరేళ్ల చిన్నారి ఆయేషాను కలిగిరి వైపు వెళ్తున్న ఓ కారు వేగంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలై కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆ చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ పరిశీలించిన వైద్యులు చిన్నారి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆయేషా సంగం మండలం తలుపూరుపాడుకు చెందిన నాయబ్ రసూల్, దిల్షాద్‌ల కుమార్తె. వీరు కొరిమెర్ల సమీపంలో మామిడితోపు లీజుకు తీసుకుని మామిడి కాయలు విక్రయిస్తుంటారు.
కుమార్తె ఆయేషా వారి దగ్గరే ఉంటోంది. శనివారం ఆయేషా సరదాగా ఆడుకుంటూ, నవ్వుకుంటూ అందరినీ ఆటపట్టిస్తోంది. ఈ క్రమంలో ఆయేషా రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన కారు ఢీకొంది. అక్కడికక్కడే నేలకొరగడంతో స్థానిక వైద్యశాలకు తరలించినా ఫలితం లేకపోయింది. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆసుపత్రి వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.