ప్రమాదంలో నుజ్జునుజ్జు అయిన బస్సు ముందుభాగం
దాచేపల్లి: లారీని తెలంగాణ ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్రగాయాలవ్వగా.. మరో ఆరుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలో శనివారం జరిగింది. వివరాలు.. తెలంగాణలోని మిర్యాలగూడెంకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రతి రోజూ దాచేపల్లికి రాకపోకలు సాగిస్తుంటుంది. శనివారం 35 మందితో మిర్యాలగూడెం నుంచి బయలుదేరిన బస్సు దాచేపల్లి మండలం గామాలపాడు సమీపంలోని ఆంధ్రా సిమెంట్స్ వద్దకు చేరుకుంది.
అదే సమయంలో ముందు వెళ్తున్న లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో.. వెనుక వస్తున్న బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం నుజ్జునుజ్జవ్వగా.. బస్సు డ్రైవర్ గొనేనాయక్, గురజాలకు చెందిన షేక్ నబీమున్‌కి తీవ్రగాయాలయ్యాయి. కండక్టర్ లింగయ్య, ప్రయాణికులు సంతోషం, ధనావత్ రంగి, రాణి, నర్సమ్మ, దానమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. సాగర్ సిమెంట్స్ ప్రతినిధులు తమ అంబులెన్స్‌లో క్షతగాత్రులను ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.


