ఇప్పటి వరకు నీటి వాటా ఇండెంట్ పంపని కర్నూలు జిల్లా యంత్రాంగం
దీంతో ఎల్‌ఎల్‌సీ నీటిని అడ్డుకున్న కర్ణాటక రైతులు
ఆంధ్రాకు వస్తున్న నీరు వారి పొలాలకు మళ్లింపు
చంద్రబాబు ప్రభుత్వ అలసత్వంపై తీవ్ర విమర్శలు
హొసపేటె: ఎల్‌నినో వల్ల ఆంధ్రప్రదేశ్ కరువు కోరల్లో చిక్కుకుంది. తాగు, సాగు నీటి కోసం ప్రజలు, రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో పొరుగు రాష్ట్రాల నుంచి తమకు రావాల్సిన నీటివాటా కంటే ఎక్కువ అడిగి ప్రజల కష్టాలను తీర్చాల్సిన చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోంది. ముఖ్యంగా రాయలసీమకు తుంగభద్ర నుంచి రావాల్సిన నీటి విషయంలో చంద్రబాబు సర్కారు తీరు రైతులకు శాపంగా మారిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏటా కర్నూలు జిల్లాకు లో లెవెల్ కెనాల్(ఎల్‌ఎల్‌సీ) ద్వారా తుంగభద్ర నీరు వెళ్తుంది.
తమకు ఎంత నీరు కావాలి, ఎప్పటి నుంచి ఎప్పటివరకు నీటిని విడుదల చేయాలి... అనే వివరాలతో కర్నూలు జిల్లా అధికారుల నుంచి ఇండెంట్ లేఖలు పంపిస్తారు. కానీ ఇప్పటి వరకు కర్నూలు జిల్లా అధికారుల నుంచి ఇండెంట్ లేఖలు తుంగభద్ర డ్యామ్ ఇంజనీర్లకు చేరలేదు. దీంతో డ్యామ్ అధికారులు కూడా కర్నూలుకు నీటి విడుదల గురించి పట్టించుకోవడం లేదు. ఆగస్టు మూడో వారం వచి్చనా ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సిన నీటి వాటాపై ఏపీ అధికారుల నుంచి అధికారిక లేఖ (ఇండెంట్) తుంగభద్ర డ్యామ్ కార్యాలయానికి రాకపోవడం కర్ణాటక అధికారులు విస్మయం వ్యక్తంచేస్తున్నారు.
నిండుకుండలా తుంగభద్ర
ఎగువన వర్షాలు కురవడంతో కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్ సుమారు 80 టీఎంసీలతో నిండుకుండలా తొణికిసలాడుతుంది. ఆదివారం డ్యామ్‌కు 18,550 క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం డ్యామ్‌లో నీటిమట్టం 1,630 అడుగులకు చేరుకుంది. డ్యామ్ పూర్తిగా నిండేందుకు ఇంకా 3 అడుగులు మాత్రం మిగిలి ఉంది. కర్ణాటక ప్రభుత్వం తమ వాటా కింద హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీకి నీటిని విడుదల చేయడంతో రైతులు పొలం పనుల్లో నిమగ్నమయ్యారు.
కర్నూలుకు వచ్చే నీటిని అడ్డుకున్న కర్ణాటక రైతులు
కర్నూలు జిల్లా నుంచి అధికారిక ఇండెంట్ రాకపోవడంతో ఎల్‌ఎల్‌సీ ద్వారా ఏపీకి వస్తున్న కొద్దిపాటి నీటిని కూడా కర్ణాటక రైతులు అడ్డుకున్నారు. కర్నూలు జిల్లా హాలహర్వి మండలం వద్ద ఏపీలోకి ప్రవేశించే చోట ఎల్‌ఎల్‌సీ 155వ కిలోమీటరు వద్ద భారీ సంఖ్యలో కర్ణాటక రైతులు ఇసుక బస్తాలతో అడ్డుకట్ట వేసి నీటిని తమ పొలాలకు మళ్లించుకున్నారు. టీబీ డ్యామ్‌లో నీటిమట్టం సంతృప్తికరంగా లేదని, తమ పొలాలు ఎండిపోతాయనే సాకుతో ఏపీకి రావాల్సిన నీటిని అడ్డుకున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు ప్రభుత్వం స్పందించి తుంగభద్ర డ్యామ్ అధికారులకు అధికారిక ఇండెంట్ పంపించి కర్నూలు జిల్లాకు నీరు వచ్చేలా చూడాల్సిన అవసరం ఉంది.


