28న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

JEE Advanced 2022 exam will be conducted on 28th August - Sakshi

న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలు మినహా అన్నిటికీ నెగిటివ్‌ మార్కులు

స్వల్ప మార్పులు మినహా పాత విధానంలోనే పరీక్ష

నేటి నుంచి అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌

11న తుది కీతోపాటు ఫలితాలు

12 నుంచి జోసా కౌన్సెలింగ్‌

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)లు, తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి నిర్వహించే జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) అడ్వాన్స్‌డ్‌ – 2022 పరీక్షను ఈ నెల 28న నిర్వహించనున్నారు. ఐఐటీ బాంబే ఈ పరీక్షను నిర్వహించనుంది. కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించే ఈ పరీక్ష అడ్మిట్‌ కార్డులను మంగళవారం నుంచి విద్యార్థులు వెబ్‌సైట్‌ (https://jeeadv.ac.in/) నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా పరీక్ష విధానంలో స్వల్ప మార్పులు మినహా పాత విధానంలోనే పరీక్ష జరగనుంది. అడ్వాన్స్‌డ్‌ పరీక్షలో న్యూమరికల్‌ వ్యాల్యూ విభాగంలోని ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కులు ఉండవు. తక్కిన విభాగాల్లోని ప్రశ్నలకు నెగిటివ్‌ మార్కులు ఉంటాయి. 

ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..
జేఈఈ మెయిన్‌ను 13 మాధ్యమాల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే. అడ్వాన్స్‌డ్‌ను మాత్రం ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లోనే నిర్వహిస్తారు. ఒక్కో పేపర్‌ పరీక్ష వ్యవధి.. మూడు గంటలు. ఉదయం 9 గంటల నుంచి 12 వరకు పేపర్‌–1, మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు పేపర్‌–2 నిర్వహిస్తారు. నిర్ణీత సమయానికి ముందే పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు చేరుకోవాలి. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.

పేపర్‌–1, పేపర్‌–2ల్లో ఒక్కోదానిలో 54 ప్రశ్నలుంటాయి. ఒక్కో పేపర్‌కు 180 చొప్పున మొత్తం 360 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు. న్యూమరికల్‌ వ్యాల్యూ ప్రశ్నలు మినహా తక్కిన విభాగాల్లో తప్పుగా రాసినవాటికి నెగిటివ్‌ మార్కులుంటాయి. మార్కుల విధానంలో ఫుల్‌ మార్కులు, పార్షియల్‌ మార్కుల విధానం అమలవుతుంది. 

సెప్టెంబర్‌ 3న ప్రొవిజినల్‌ ‘కీ’..
జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ఆంధ్రప్రదేశ్‌లో 28 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఐఐటీ భువనేశ్వర్‌ జోన్‌లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతోపాటు ఐఐటీ మద్రాస్‌ జోన్‌ పరిధిలో 25 కేంద్రాల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అభ్యర్థుల రెస్పాన్సు కాపీలను సెప్టెంబర్‌ 1 నుంచి వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీని అదే నెల 3న విడుదల చేస్తారు. వీటిపై 3, 4 తేదీల్లో అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను ఆన్‌లైన్‌లో స్వీకరిస్తారు.

తుది ఆన్సర్‌ కీని, ఫలితాలను సెప్టెంబర్‌ 11న విడుదల చేయనున్నారు. ఆర్కిటెక్చర్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టుకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ అదే రోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ పరీక్షను సెప్టెంబర్‌ 14న నిర్వహించి ఫలితాలను 17న విడుదల చేస్తారు. కాగా సెప్టెంబర్‌ 12 నుంచి జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా) ఆధ్వర్యంలో సీట్ల కేటాయింపునకు కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top