శ్రీకాకుళం: జిల్లాలోని పారిశ్రామికవాడ పైడిభీమవరం పంచాయతీలో థాయ్ స్పా పేరుతో నిర్వహిస్తున్న మసాజ్ సెంటర్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారింది. సన్‌రైజ్ ఇన్ అనే హోటల్ సముదాయంలో స్థానిక జనసేన నాయకుడి కనుసన్నల్లో ఈ థాయ్ స్పా(మసాజ్ సెంటర్) నడుస్తోందని సర్వత్రా టాక్ వినిపిస్తోంది. రాయల్ టచ్ ఫీలింగ్, స్టీమ్ బాత్, జకూజీ బాత్ వంటి సదుపాయాలతో నిర్వహిస్తున్న ఈ మసాజ్ సెంటర్‌కు ఎలాంటి అనుమతులు లేకపోవడం గమనార్హం. అయినా ఈ మసాజ్ సెంటర్‌ను నలుగురికి పైగా పొరుగు జిల్లా అమ్మాయిలతో నడిపిస్తున్నారు.
స్థానిక మహిళల నుంచి విమర్శలు వినిపిస్తున్నా పట్టించుకోవడం లేదు. తాజాగా కూటమి పార్టీల్లోనూ ఈ స్పా విషయమై అగ్గి రాజుకుంది. మన ప్రాంతంలో ఇలాంటి సంస్కృతి లేదని తక్షణమే తొలగించాలని మహిళల నుంచి ఓ స్థానిక టీడీపీ ప్రజా ప్రతినిధికి తీవ్ర ఒత్తిడి వస్తోంది. దీంతో టీడీపీ, జనసేన మధ్య అంతర్గత పోరు నడుస్తోంది. ఈ థాయ్ స్పా పైడిభీమవరంలో అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారిందని, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని అధికారుల దగ్గర ఆ టీడీపీ నాయకుడు అనడంతో కూటమిలో అంతర్గత కుమ్ములాట మరింత జఠిలమైంది. పైడిభీమవరంలో ఇలాంటి సంస్కృతి లేదని, జనసేన నాయకుడే ఇదంతా నడిపిస్తున్నారనే చర్చ విస్తృతంగా సాగుతోంది.
ఈ మసాజ్ సెంటర్ తొలగించకపోతే ధర్నా చేస్తామని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై జేఆర్ పురం ఎస్‌ఐ ఎస్.చిరంజీవిని వివరణ కోరగా.. తమను ఎవరూ సంప్రదించలేదని, అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. పంచాయతీ పరిధిలో ఏమైనా ఇచ్చారేమో తనకు తెలియదన్నారు. పంచాయతీ అభివృద్ధి అధికారి పి.అజయ్‌బాబును వివరణ కోరగా థాయ్ స్పాకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదని తెలియజేశారు.


