
కేసును నీరుగారుస్తాం... అప్పటివరకు అంతా డ్రామానే
చినబాబు భరోసా... గన్నవరంలో దిగిన జనార్దన్‌రావు
నకిలీ మద్యం కేసును పక్కదారి పట్టించే పక్కా పన్నాగం
అంతా మీరే చేశారు... మీ పేర్లు బయటపెడతాం
ప్రభుత్వ పెద్దలకు జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావు వార్నింగ్
దీంతో ప్రభుత్వ పెద్దల్లో గుబులు.. వారిని కాపాడే ఎత్తులు!
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం కేసును నీరుగార్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం తాము పన్నిన పన్నాగాన్ని పక్కాగా అమలు చేస్తోంది. ఈ మేరకు ‘‘కేసును పక్కదారి పట్టించి నీరుగారుస్తాం. కంగారుపడొద్దు’’ అని పెదబాబు, చినబాబు హామీ ఇవ్వడంతో ఎ1గా ఉన్న జనార్దన్‌రావు గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం దర్జాగా అడుగుపెట్టారు. ఆధారాలతో సహా అడ్డంగా దొరికినా సరే ఆయన ఏమాత్రం జంకు లేకుండా రావడం పోలీసులనే విస్మయపరిచింది. కాగా, కేసును నీరుగార్చేందుకు ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీ కథ కమామిషు ఇలా సాగింది.
అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పట్టుబడ్డ నకిలీ రాకెట్‌లో అడ్డంగా దొరికిన ఆఫ్రికా మోడల్ కల్తీ మద్యం మాఫియా సూత్రధారులు టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి, ఆయన భాగస్వామి జనార్దన్‌రావుతో పాటు సురేంద్రనాయుడు ప్రభుత్వ పెద్దలకు ఎదురుతిరిగారు. తమను బయటపడేయకుంటే ఎన్నికలకు ముందు కుదిరిన డీల్ ప్రకారం... పెదబాబు, చినబాబు ఆదేశాలతోనే రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం దందాను వ్యవస్థీకృతం చేశామనే వాస్తవాన్ని బయటపెడతామని తేల్చి చెప్పారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధితో పాటు కేసును పర్యవేక్షిస్తున్న ఐపీఎస్ అధికారి ద్వారా కూడా సమాచారం పంపించారు. ‘మమ్మల్ని బయటపడేసే బాధ్యత ప్రభుత్వ పెద్దలదే... లేకపోతే మొత్తం నకిలీ మద్యం గుట్టు విప్పుతామని కుండబద్దలు కొట్టారు. జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావు నోరువిప్పితే బండారం బయటపడుతుందని నకిలీ మద్యం దందా కుట్రదారులు, లబ్దిదారులైన పెదబాబు, చినబాబు బెంబేలెత్తారు. ‘‘తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేశాం తప్ప అంతకుమించి దర్యాప్తు ముందుకుసాగకుండా నీరుగారుస్తాం’’ అని హామీ ఇచ్చినట్టు సమాచారం.
ప్రజలను తప్పుదారి పట్టించేందుకే జయచంద్రారెడ్డిని సస్పెండ్ చేసినట్టు ప్రకటించి కనికట్టు చేశామని.. టీడీపీలో ఆయన స్థానానికి ఢోకా లేదని కూడా భరోసా ఇచ్చారు. ‘‘విచారణకు హాజరైనట్టు, పోలీసులకు సహకరిస్తున్నట్టు నటించండి. కొన్ని రోజుల్లోనే మిమ్మల్ని బయటకు తెచ్చి కేసును పూర్తిగా పక్కదారి పట్టిస్తామని’’ చెప్పారు. ఈ డ్రామా కొనసాగింపులోనే నకలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం లేదని వీడియో ద్వారా ప్రకటించాలని జనర్దాన్‌రావును చినబాబు ఆదేశించినట్టు తెలుస్తోంది.
ఇలా అందరినీ నమ్మించేందుకు ఓ ఆధారాన్ని సృష్టించినట్టు కూడా అవుతుందన్నదన్నది అసలు ఉద్దేశం. కేసు నుంచి బయటపడేస్తామన్న భరోసా వచ్చాకే... జనార్దన్‌రావు 4 రోజుల క్రితం వీడియో విడుదల చేశారు. అయితే, నకిలీ మద్యం వ్యవహారంతో టీడీపీ నేతలకు సంబంధం ఉందో లేదో చెప్పాల్సింది దర్యాప్తు చేసే పోలీసు అధికారులు. కానీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దరావు టీడీపీ నేతలకు క్లీన్‌చిట్ ఇవ్వడం గమనార్హం.
ఇదంతా చూస్తుంటే కేసును పక్కదారి పట్టించేందుకు ఎంత పక్కాగా కథ నడుపుతున్నారో స్పష్టమవుతోంది. ఆ స్కెచ్‌లో భాగంగానే జనార్దన్‌రావు పోలీసులకు సమాచారం ఇచ్చి మరీ గన్నవరం విమానాశ్రయంలో దిగారు. వెంటనే పోలీసులు అరెస్టు చేయడంతో డ్రామాలో మొదటి అంకం పూర్తయింది. ఇక కొద్ది రోజుల్లోనే జనార్దన్‌రావును బెయిల్‌పై తీసుకొచ్చి కేసును పూర్తిగా నీరుగార్చాలన్నదే ప్రభుత్వ పెద్దల ఎత్తుగడ అని పోలీసు వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి.

నకిలీ మద్యం కేసులో జనార్దన్‌రావు అరెస్ట్
గాందీనగర్ (విజయవాడ సెంట్రల్): రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ మద్యం కేసులో ప్రధాన సూత్రధారి అద్దేపల్లి జనార్దన్‌రావును ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం గన్నవరం ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలించారు. అద్దేపల్లి జనార్దన్‌రావు ములకలపల్లి, ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడిగా ఉన్నారు. నకిలీ మద్యం గుట్టు రట్టయిన వెంటనే ఆయన ఆఫ్రికా పారిపోయినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఇబ్రహీంపట్నం నకిలీ మద్యం కేసులో 12 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ కేసులో మొదట ముగ్గురు నిందితులు అద్దేపల్లి జగన్మోహన్‌రావు, బాదల్ దాస్, ప్రతాప్ దాస్, కట్టారాజు, శ్రీనివాసరెడ్డి, కళ్యాణ్‌ను అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు చెందిన రవిని ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ తరలించారు. ఏ–1 అద్దేపల్లి జనార్దన్‌రావు కూడా అరెస్ట్ కావడంతో ఈ కేసులో ఇప్పటి వరకు మొత్తం 8 మంది నిందితులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టయింది.

అద్దేపల్లి జనార్దన్‌రావు అరెస్ట్‌పై శుక్రవారం ఉదయం నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన విదేశాలకు పారిపోయాడని అధికారులు చెబుతున్నప్పటికీ... విజయవాడలోనే తలదాచుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ జనార్దన్‌రావు ఎయిర్ ఇండియా విమానంలో ముంబై నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు శుక్రవారం సాయంత్రం 5.45 గంటలకు చేరుకున్నారు. అప్పటికే అక్కడికి చేరుకున్న ఎక్సైజ్ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా జనార్దన్‌రావు మీడియాతో మాట్లాడుతూ తనను రాజకీయంగా ఈ కేసులో ఇరికించారన్నారు. ఆయన తరఫు న్యాయవాది రవీంద్ర రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జనార్థనరావును తీసుకొచ్చి సరెండర్ చేస్తామని చెప్పినా ఎక్సైజ్ పోలీసులు స్పందించలేదన్నారు. ఆయనను బలవంతం చేసి వారికి కావాల్సిన విధంగా వాంగ్మూలం తీసుకొనేందుకు అదుపులోకి తీసుకున్నారన్నారు. ఆయనకు ఏదైనా జరిగితే ఎక్సైజ్ పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు.
టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బావమరిదిపై కేసు
ములకలచెరువు: టీడీపీ నేత జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్‌రెడ్డిని నకిలీమద్యం తయారీ కేసులో నిందితులుగా ఎక్సైజ్ పోలీసులు శుక్రవారం చేర్చారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈనెల 3న 14 మందిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా మరో ఏడుగురిని నిందితులుగా చేర్చారు. ఈ మేరకు తంబళ్లపల్లె కోర్టులో మెమో దాఖలు చేశారు.
జయచంద్రారెడ్డిని ఏ17గా, గిరిధర్‌రెడ్డిని ఏ18గా చేర్చారు. మిగిలిన వారిలో అణ్బురాసు, అష్రఫ్, బాలాజీ, సుదర్శన్, రవి ఉన్నారు. కేసులో ఏ–2 కట్టా రాజు, ఏ–12 కొడాలి శ్రీనివాసరావుల వాంగ్మూలాల ఆధారంగా వీరిని నిందితులుగా చేర్చినట్టు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు. వీరి అరెస్టు కోసం ఎక్సైజ్ పోలీసులు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.