
పిఠాపురం లాడ్జిలో అశ్లీలంగా ప్రవర్తిస్తున్న జనసేన నాయకులు
వీర మహిళపై అసభ్య పదజాలంతో రెచ్చిపోయిన నాయకుడు
లాడ్జిలో అసభ్య చేష్టలు
5 నెలల తర్వాత వెలుగులోకి వీడియో
సోషల్ మీడియోలో వైరల్
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జనసేన నాయకురాలిని ఆ పార్టీ ప్రకాశం జిల్లా నేత అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా.. లాడ్జిలో అసభ్య చేష్టలకు దిగిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 5 నెలల తర్వాత వీడియో వెలుగులోకి రాగా.. జిల్లాలో ఇదే హాట్‌టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది మార్చి 14న పిఠాపురంలో జనసేన ఆవిర్భావ సభ జరిగింది. ఆ సభకు ప్రకాశం జిల్లా నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు బస్సులో వెళ్లారు.
పీకలదాకా మద్యం సేవించిన ఒక నాయకుడు బస్సులో ఉన్న మహిళా నాయకురాలితో ఘర్షణ పడ్డాడు. రాయలేని భాషలో అసభ్య పదజాలంతో తిట్టాడు. అందరి ఎదుట ప్యాంటు జిప్పు తీసి చూపిస్తూ దూషించాడు. దీంతో జనసేన నాయకులు బస్సులోనే కొట్టుకున్నారు. ఇదంతా జనసేనలో కీలకపాత్ర పోషిస్తున్న ఓ నాయకుడి అల్లుడు వీడియో తీసినట్టు ప్రచారం జరుగుతోంది. పిఠాపురం చేరుకున్న తరువాత వారు మరింత రెచ్చిపోయారు.
వీరంతా జనసేనలో జిల్లాస్థాయి పదవులు ఉన్నవారే కావడం గమనార్హం. పిఠాపురం చేరుకున్నాక వారు ఒక లాడ్జిలో దిగారు. ఒకరిమీద మరొకరు పడుకుని మహిళల గురించి అశ్లీల పదాలు మాట్లాడుతూ వెకిలి చేష్టలు చేశారు. ఈ వీడియోలో వెకిలి చేష్టలు చేసిన వారిలో ఒకరిని స్థానికంగా ఉండే దేవాలయ ట్రస్ట్ బోర్డుకు చైర్మన్‌గా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఇంకో వ్యక్తిని ఒంగోలు మార్కెట్ కమిటీ కీలక పదవిలో నియమించనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో రాష్ట్రవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
జిల్లాలో కీలకంగా ఉన్న జనసేన నేత ముఖ్య అనుచరులుగా ఉన్న వీరు గతంలో అదే పార్టీకి చెందిన రాష్ట్ర నాయకురాలు రాయపాటి అరుణపై దాడి చేశారు. దీంతో ఉలిక్కిపడిన జనసేన అధిష్టానం పరువు కాపాడుకునే పనిలో పడింది. జిల్లా నేతలకు క్లాస్ పీకడంతోపాటు ఈ ఎపిసోడ్‌కు ప్రధాన కారకుడైన వ్యక్తిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని ఆదేశించినట్టు తెలిసింది. ఆ నేతను పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉండాలని ఆదేశించినట్టు చెబుతున్నారు. జనసేన నాయకుల బూతుపురాణం వీడియోను జనసేన నాయకులే సోషల్ మీడియాకు విడుదల చేసినట్టు ప్రచారం జరుగుతోంది.