Jahnavi Dangeti: అమ్మమ్మ కథలు.. అస్ట్రోనాట్‌ కలలు

Jahnavi Dangeti First Indian To Complete Prestigious Nasa Programme - Sakshi

సాకారం దిశగా జాహ్నవి అడుగులు

17 ఏళ్లకే నాసా ప్రోగ్రామ్‌లో పాల్గొన్న రికార్డు

తాజాగా వ్యోమగామిగా శిక్షణ పొందిన వైనం

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)తూర్పుగోదావరి: నిండు పున్నమి రోజు ఆరు బయట మంచం మీద బామ్మ ఆమెకు అన్నం తినిపిస్తూ ఆకాశంలో ఉన్న చందమామని చూపిస్తూ అనేక కథలు చెప్పేది. చందమామ లోపల ఒక ముసలావిడ నూలు వడుకుతుందని చెప్పేది. ఒక్కోసారి చందమామ ఎందుకు కనిపించకుండా పోతుందని అమ్మమ్మని అడిగితే..రాహువు, కేతువులు చందమామని మింగేస్తారు అందుకే చందమామ క్రమంగా తరుగుతూ, పెరుగుతూ ఉంటుందని తెలపడంతో మనవరాలిలో ఆలోచనలు మొలకెత్తాయి.
చదవండి: రాజమౌళి తండ్రి హైస్కూల్‌ వరకూ చదివింది ఇక్కడే..

ఆ చిన్నారికి చందమామ దగ్గర ఏం ఉందో తెలుసుకోవాలనే ఆసక్తి వయసుతోపాటు పెరుగుతూ వచ్చింది. 17 సంవత్సరాలకే నాసా నిర్వహించిన ప్రోగ్రామ్‌లో పాల్గొని రికార్డు నెలకొల్పింది. 18 ఏళ్ల వయసులో ఇప్పుడు పోలెండ్‌లో నిర్వహించిన అంతరిక్ష  వ్యోమగాముల శిక్షణ శిబిరంలో పాల్గొని అతి చిన్న వయసులో ఈ శిక్షణ పొందిన మొదటి మహిళగా రికార్డు సాధించింది. అంతరిక్షంలో విహారానికి రెక్కలు చాపుకుని ప్రయత్నిస్తున్న ఆ అమ్మాయి పాలకొల్లుకి చెందిన జాహ్నవి దంగేటి.

అమ్మమ్మ నాగమణితో జాహ్నవి 

అమ్మమ్మ లాలనలో... 
జాహ్నవి అమ్మానాన్నలు శ్రీనివాస్, పద్మశ్రీ ఉద్యోగ రీత్యా కువైట్‌లో ఉండడంతో ఆమె అమ్మమ్మ నాగమణి దగ్గర పెరిగింది. అమ్మాయిలకు స్వీయరక్షణ సామర్థ్యం ఉండాలని జాహ్నవి తండ్రి ఆలోచన ఆమెను ఐదవ తరగతిలో కరాటే నేర్చుకొనేలా చేసింది. అందులో నేషనల్, ఇంటర్నేషనల్‌ పతకాలు సాధించింది. స్విమ్మింగ్, స్కూబా డైవింగ్‌లో కూడా తర్ఫీదు పొందింది.

17వ ఏటే నాసాలో పాల్గొన్న రికార్డు  
పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లులో ఉండే జాహ్నవి పంజాబ్‌లోని లవ్లీ కాలేజీలో బీటెక్‌ రెండో సంవత్సరం చదువుతోంది. యూఎస్‌కి చెందిన నాసా (నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌) నిర్వహించిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు భారతదేశం నుంచి ప్రాతినిధ్యం లేని ప్రోగ్రామ్‌లో ఆమె పాల్గొంది. జాహ్నవి పాల్గొనడం ఒక్క భారతదేశానికే కాదు ఆసియా ఖండానికి కూడా రికార్డే.

తల్లిదండ్రులతో జాహ్నవి  

రాకెట్‌ నడిపింది..  
జాహ్నవి గత సంవత్సరం 2021 నవంబర్‌ 12వ తేదీన యూఎస్‌కి వెళ్లి అక్కడి అలబామాలోని నాసాకు చెందిన స్పేస్‌ అండ్‌ రాకెట్‌ సైన్స్‌ సెంటర్‌లో అస్ట్రానాట్‌ ప్రోగ్రామ్‌లో శిక్షణ పూర్తి చేసుకొంది. పది రోజుల్లో ఆమె జీరో గ్రావిటీ, మల్టీ యాక్సెస్, ట్రైనింగ్, అండర్‌వాటర్‌ రాకెట్‌ లాంచ్‌ చేయడంతో పాటు ఎయిర్‌ క్రాఫ్ట్‌ను నడపడం కూడా నేర్చుకొంది. మెషీన్‌ కంట్రోలర్‌కి ఫ్లైట్‌ డైరెక్టర్‌గా వేర్వేరు దేశాలకు చెందిన పదహారు మంది యువతతో కూడిన బృందానికి జాహ్నవి నేతృత్వం వహించింది. సెస్మా 170 స్కైహాక్‌ అనే చిన్న రాకెట్‌ని విజయవంతంగా లాంచ్‌ చేసింది. భూమి మీద నుంచి గాల్లోకి ఎగరడం, దాదాపు అరగంట సేపు ఆకాశంలో విహరించడం, తిరిగి జాగ్రత్తగా ల్యాండ్‌ చేయడంలో ప్రతిభ చూపింది.

నాసా సెంటర్‌లో తోటి అనలాగ్‌ అస్ట్రోనాట్స్‌తో   

కలెక్టర్‌ ప్రశంసలు పొంది..
పోలెండ్‌లో నిర్వహించిన అంతరిక్ష వ్యోమగాముల శిక్షణ శిబిరంలో పాల్గొని అతి చిన్న వయసులో ఈ శిబిరంలో పాల్గొన్న మొదటి మహిళాగా రికార్డు సాధించిన జాహ్నవి బుధవారం పోలెండ్‌ నుంచి రాజమహేంద్రవరం చేరుకుని కలెక్టర్‌ మాధవీలతను మర్యాద పూర్వకంగా కలిసింది. అనలాగ్‌ అస్ట్రోనాట్‌గా శిక్షణ పొంది దేశానికి గర్వకారణంగా జాహ్నవి నిలిచిందని, అంతరిక్షంలోకి వెళ్లాలన్న ఆమె లక్ష్యం నెరవేరాలని కలెక్టర్‌ మాధవీలత ఆకాంక్షించారు. తమ నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామన్నారు.

స్కూబా డైవింగ్‌ నేర్చుకున్నాను 
స్కూబా డైవింగ్‌ అని చెప్తే ఇంటో వాళ్లు పంపించరేమోనని స్విమ్మింగ్‌ అని చెప్పి వైజాగ్‌ వెళ్లాను. ఆ తర్వాత గోవాకు వెళ్లి ట్రైనింగ్‌ సెషన్స్‌లో పాల్గొని లైసెన్స్‌ తీసుకున్నాను. అండమాన్‌లో స్కూబా డైవింగ్‌లో అడ్వాన్స్‌డ్‌ కోర్సు పూర్తి చేశాను. అంతరిక్షంలో జీరో గ్రావిటీలోనే ఉండాలి. నీటి అడుగున కూడా గ్రావిటీ ఉండదు. ఆ ఎక్స్‌పీరియన్స్‌ కోసమే స్కూబా డైవింగ్‌ నేర్చుకున్నాను. పీపుల్స్‌ చాయిస్‌ అవార్డు, ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నా పేరు నమోదు అయ్యింది. నేను సాధించిన వాటికి వచ్చిన ప్రశంసలన్నీ మా అమ్మమ్మకే దక్కాలి.  
– జాహ్నవి దంగేటి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top