
పాత్రికేయుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను ఖండిస్తున్నాం
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టపరమైన భద్రత కల్పించాలి
కేసులు, దాడులు, వేధింపులకు పాల్పడ్డ వారిపై కఠినచర్యలు తీసుకోవాలి
‘సాక్షి’ మీడియా సంస్థ, వారి జర్నలిస్టులకు వేధింపులపై ఐఎన్‌ఎస్ ఆగ్రహం
సాక్షి, న్యూఢిల్లీ: జర్నలిస్టులు, మీడియా సంస్థలపై పెరుగుతున్న దాడులను ది ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ (ఐఎన్‌ఎస్) తీవ్రంగా ఖండించింది. ‘సాక్షి’మీడియా సంస్థ, వారి జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, వేధింపులపై ఐఎన్‌ఎస్ తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. ఈ మేరకు ఐఎన్‌ఎస్ అధ్యక్షుడు ఎం.వి. శ్రేయామ్స్ కుమార్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. పత్రికా రంగంపై జరుగుతున్న ఈ దాడులను ప్రజాస్వామ్య పునాదులు, పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగా ఐఎన్‌ఎస్ అభివర్ణించింది.
ఆంధ్రప్రదేశ్‌లో ‘సాక్షి’జర్నలిస్టులపై పలుమార్లు దాడులు జరగడంతో పాటు, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వారిపై అక్రమ కేసులు బనాయించి, విచారణల పేరుతో వేధిస్తున్నారని ఐఎన్‌ఎస్ దృష్టికి వచ్చిందన్నారు. మీడియా కార్యాలయాలు, సాక్షి ఎడిటర్ నివాసంలో సోదాలు నిర్వహించడం వంటి చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడినట్లు తమ దృష్టికి వచ్చిందని ఆ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.
స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ధోరణి..
ప్రజా ప్రయోజనాల కోసం పనిచేసే జర్నలిస్టుల గొంతు నొక్కే ఇలాంటి చర్యలను సొసైటీ తీవ్రంగా ఖండిస్తోందని ఐఎన్‌ఎస్ తెలిపింది. ఈ దాడులు స్వతంత్ర జర్నలిజాన్ని అణచివేసే ఒక ఆందోళనకరమైన ధోరణిలో భాగమని శ్రేయామ్స్ కుమార్ అభిప్రాయపడ్డారు. జర్నలిస్టులు ఎలాంటి భయం, బెదిరింపులు, హింసకు గురికాకుండా తమ వృత్తిపరమైన బాధ్యతలను నిర్వర్తించగలగాలని సూచించింది. దేశంలో పత్రికా రంగం శత్రువు కాదని.. ప్రజాస్వామ్య జవాబుదారీతనాన్ని బలోపేతం చేసే మిత్రపక్షమని ఐఎన్‌ఎస్ పేర్కొంది.
మీడియా ప్రతినిధులకు భద్రత కల్పించాలి..
ఇక ఈ దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని, మీడియా ప్రతినిధుల రక్షణకు తగిన చట్టపరమైన భద్రత కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఐఎన్‌ఎస్ డిమాండ్ చేసింది. బెదిరింపులు, హింసను ఎదుర్కొంటున్న జర్నలిస్టులు, మీడియా సంస్థలకు తాము అండగా నిలుస్తామని సొసైటీ పునరుద్ఘాటించింది. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛ కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఐఎన్‌ఎస్ సెక్రటరీ జనరల్ మేరీ పాల్ కూడా తెలిపారు.