స్టాక్‌మార్కెట్లో పెట్టుబడికి వెనుకాడుతున్నఅత్యధిక భారతీయ కుటుంబాలు
63 శాతం మందికి అవగాహన ఉంటే ఇన్వెస్ట్ చేస్తున్నది 9.5 శాతం మందే
రాష్ట్రంలో ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నవారు 6 శాతమే
తక్కువ నష్టభయం ఉన్నవాటివైపే 80 శాతం కుటుంబాల చూపు
సెబీ తాజా సర్వేలో వెల్లడి
సాక్షి, అమరావతి: దేశీయ స్టాక్ సూచీలు నూతన గరిష్టస్థాయిల దిశగా దూసుకుపోతున్నా.. భారతీయులు అత్యధికమంది ఈ అంశాలను గమనిస్తున్నారేగానీ, పెట్టుబడి పెట్టడం ద్వారా వాటి ప్రతిఫలాలను పొందడం లేదు. స్టాక్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తాజాగా నిర్వహించిన ఇన్వెస్టర్ సర్వే–2025 ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. అత్యధికమందికి స్టాక్‌మార్కెట్‌పై అవగాహన ఉన్నా వాస్తవంగా పెట్టుబడి పెడుతున్న వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉందని ఈ సర్వే వెల్లడించింది. స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్ పథకాల్లో కనీసం ఒకదానిపైనైనా 63 శాతం మందికి అవగాహన ఉన్నప్పటికీ 9.5 శాతం మంది మాత్రమే ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా 400 పట్టణాలు, వెయ్యికిపైగా గ్రామాల్లో 90 వేల కుటుంబాలపై సెబీ ఈ సర్వే నిర్వహించింది. ఈ సర్వే ప్రకారం.. 21.3 కోట్లమందికి స్టాక్‌మార్కెట్‌పై అవగాహన ఉన్నా ఇన్వెస్ట్ చేసింది మాత్రం 3.2 కోట్ల మందే. పట్టణ ప్రాంతాల్లో 15 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తుంటే, గ్రామీణ ప్రాంతాల్లో ఆరుశాతం మంది మాత్రమే ఈక్విటీల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా ఢిల్లీలో 20.7 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత గుజరాత్‌లో 15.4 శాతం మంది పెట్టుబడి పెడుతున్నారు.
పెట్టుబడి రక్షణకే అధిక ప్రాధాన్యత
భారతీయులు తక్కువ నష్టభయం ఉండే పథకాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మొగ్గుచూపుతున్నారు. 80 శాతం మంది ఎటువంటి నష్టభయం లేని సురక్షితమైన పథకాల్లో పెట్టుబడి పెట్టేందుకే ముందుకొస్తున్నారు. పెట్టుబడిదారుల్లో 79.7 శాతం మంది తక్కువ నష్టభయం ఉన్నవాటిని, 14.7 శాతం మంది కొద్దిగా రిస్క్ ఉన్నవాటిని ఎంపిక చేసుకుంటుండగా.. 5.6 శాతం మంది ఎక్కువ రిస్క్ తీసుకోవడానికి సిద్ధపడుతున్నారు. ఈక్విటీల్లో కూడా అత్యధికంగా సగటున 6.7 శాతం మంది ఇన్వెస్ట్ చేస్తుంటే షేర్లలో 5.3 శాతం మంది పెట్టుబడి పెడుతున్నారు.
ఈక్విటీ పెట్టుబడుల్లో ఉండే సంక్లిష్ట పరిస్థితులపై పూర్తిస్థాయిలో అవగాహన లేకపోవడంతో వెనుకాడుతున్నట్లు 74 శాతం మంది తెలిపారు. వీటిపై కొద్దిగా అవగాహన కలి్పస్తే పెట్టుబడులు పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్, ఇన్‌స్ట్రాగామ్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా అవగాహన పెంచుకుని పెట్టుబడులు పెట్టడానికి యువతీయువకులు ముందుకొస్తున్నారు. ఏటా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య పెరుగుతోందని, వచ్చే ఏడాది నుంచి పెట్టుబడులు పెడతామని 22 శాతం మంది చెప్పడం ఒక శుభసంకేతమని సెబీ ఆ నివేదికలో పేర్కొంది.


