
ఈసీ నిర్ణయంతో తదుపరి విచారణ అవసరం లేదని తేల్చిన న్యాయస్థానం
నిర్దేశిత స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులకు వేరే గుర్తులు కేటాయించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు
సాక్షి, అమరావతి: గాజు గ్లాసు గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ జనసేన పార్టీ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు మూసివేసింది. కూటమి మొత్తానికి వర్తించే విధంగా కాకుండా కేవలం జనసేన పార్టీకి మాత్రమే గాజు గ్లాసు గుర్తును పరిమితం చేస్తూ నిర్ణయం తీసుకున్నామని.. జనసేన పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాల పరిధిలో ఉన్న లోక్‌సభ నియోజక వర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులు, గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలకు గాజు గ్లాసు గుర్తు కేటాయించవద్దని రిటర్నింగ్ అధికారులను ఆదేశించామని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం హైకోర్టుకు లిఖితపూర్వకంగా నివేదించింది.
అదేవిధంగా జనసేన పోటీ చేస్తున్న రెండు పార్లమెంటరీ నియోజకవర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న స్వతంత్ర, గుర్తింపు లేని రిజిస్టర్డ్ పార్టీలకు కూడా గాజు గ్లాసు గుర్తును కేటాయించవద్దని ఆదేశాలు ఇచ్చామని ఎన్నికల సంఘం హైకోర్టుకు వివరించింది. గాజు గ్లాసు గుర్తు విషయంలో జనసేన పార్టీ పెట్టుకున్న వినతిపై ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పింది. ఎన్నికల సంఘం సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు జనసేన పిటిషన్‌పై తదుపరి విచారణ ఏదీ అవసరం లేదని స్పష్టం చేసింది.
ఆ పిటిషన్‌ను మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వ్యాజ్యం మంగళవారం విచారణకు రాగా.. 24 గంటల్లోగా పరిష్కరిస్తామని న్యాయస్థానం ఆదేశించింది. తాజాగా బుధవారం ఈ వ్యాజ్యం విచారణకు రాగా.. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది అవినాష్ దేశాయ్ వాదనలు వినిపిస్తూ.. జనసేన వినతిపై నిర్ణయం వెలువరించామని చెప్పారు. జనసేనకు ఇబ్బంది లేకుండా నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఆ స్థానాల్లో స్వతంత్రులకు వేరే గుర్తులు కేటాయించండి
జనసేన పోటీ చేస్తున్న పార్లమెంటరీ స్థానాల పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలోను, ఆ పార్టీ పోటీ చేస్తున్న 21 అసెంబ్లీ స్థానాలకు చెందిన పార్లమెంటరీ స్థానాల్లోను ఇప్పటికే స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తే.. ఎన్నికల నిబంధన 10 (5) ప్రకారం వేరే గుర్తులను కేటాయించాలంటూ రిటరి్నంగ్ అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.